చట్టసభల్లో, సామాజిక చైతన్యాన్ని పెంచే సంస్థల్లో మహిళా సాధికారత, స్వేచ్ఛ, చైతన్యం అనే మాటలు మనకు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. వాటిని గమనిస్తే- మహిళకు అన్ని కోణాలనుంచి నీరాజనం పడుతున్నారనే చెప్పవచ్చు. అదే కీలస్థాయిలో కొన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్ళి వారి ప్రతిభా పాటవాలను రంగరిస్తున్నారు కూడా. మరి మహిళా ప్రపంచం ముందుకు సాగుతోందనే చెప్పవచ్చు. కానీ మరోవైపు మహిళల ఆక్రందనలు వినిపిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. మహిళలపై నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వరకట్న కేసులు, వేధింపులు, ఈవ్ టీజింగ్, గృహహింసలు, కిడ్నాపులు, అసభ్య ప్రవర్తన లాంటివి పతాక శీర్షికతో వార్తాపత్రికల్లో రోజూ ప్రత్యక్షమవుతున్నాయి. మన రాష్ట్రంలో జరుగుతున్న నేరాల గణాంకాలను గమనిస్తే మహిళా నేరాల వాటా 13 శాతం ఉందని తెలిసినపుడు మనం పురోగమిస్తున్నామో, తిరోగమిస్తున్నామో యోచించక ఉండలేం.
మహిళా చట్టాల్ని కాపాడటానికి ప్రత్యేక కోర్టులు, తీర్పుల అనం తరం శిక్షలను అమలు చేసేందుకు కారాగారాలు, వీటన్నింటిని గమనించి మహిళలకు న్యా యం జరిగి తీరాలని డిమాండ్ చేసేందుకు స్ర్తి శిశు సంక్షేమ శాఖ, మహిళా మండళ్లు, ప్రభు త్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళా సెల్ తదితర విభాగాలు ఉండ నే ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, వంటి సంఘటనలు విరివిగా పత్రికల్లో పతాక శీర్షికలయ్యేవి. నేడు మహిళలపై నేరాలు పెరుగుతూ, వారికి సంబంధించిన కేసులు ఎక్కువ కావటం గమనార్హం.
ఇదే విషయమై ఇటీవల జరిగిన చర్చల్లో గణాంకాలు తేటతెల్లమయ్యాక ఆందోళన కలిగించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 2011 జూన్ మాసంలో వెల్లడించిన గణాంకాల తీరును నిశితంగా గమనిస్తే మహిళలపై జరుగుతున్న నేరాల్లో మన రాష్ట్రం ముందువరసలో ఉంది. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బీ) గణాంకాల ప్రకారం దేశం మొత్తంమీద మన రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో మహిళలపై నేరాలు నమోదవుతున్నట్లు తేటతెల్లమవుతుంది.
గతం -చర్వితచర్వణం
వఈవ్ టీజింగ్ కేసుల్లో ఐపిఎస్ అధికారుల పేర్లు సైతం గతంలో నమోదయ్యాయి. వారికి నోటీసులు, శిక్ష లాంటివి కూడా పడ్డాయి. అయితే అవి నేటికీ చర్వితచర్వణంలా సాగుతూనే ఉన్నాయి. చట్టాల్ని, శిక్షల్ని మరింత తీవ్రతరం చేసి ఎప్పటికప్పుడు వాటిని అమలయ్యే విధంగా చూడాలి. అలసత్వం, ఆలస్యం పెరిగితే ఇలాంటి నేరాలు ఇంకా పుంజుకుంటాయే తప్ప రూపుమాపడం కుదరని పని అని గత అనుభవాలు చెబుతున్నాయ.
అన్నీ మొదటి, రెండో స్థానాలే
ఈవ్ టీజింగ్, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి నేరాల్లో దేశం మొత్తంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. గృహహింస, మానసిక వేధింపులపై నమోదయ్యే కేసుల్లో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. వరకట్న కేసుల్లో, హత్యల్లో నాలుగోస్థానంలో ఉంది. ఇటీవల విద్యార్థినులు, మహిళలపై యాసిడ్ కేసుల నమోదు తారస్థాయికి చేరుకుంటున్నాయి. వీటన్నింటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతూండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.2010లో జరిగిన మహిళా నేరాలను 2011వ ఏడాదితో సరిచూస్తే- మహిళల అపహరణలు 2010లో 1239 ఉంటే 2011 మే నాటికి 755కు పెరిగింది. ఇక 2011లో కంటే ఈ సంఖ్య 2012 ప్రారంభంలోనే రెట్టింపవుతుందనడానికి పలు దాఖలాలు కనిపిస్తున్నాయ. అత్యాచారాల విషయంలో 2010లో 1308 ఉంటే, 2011 మే నాటికి ఆ సంఖ్య 733కు చేరింది. ఇది ప్రస్తుత సంవత్సరం ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉందని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయ. వరకట్న హత్యలు, వరకట్న మరణాలు, ఆత్మహత్యలకు ప్రేరేపించటం, గృహ వేధింపులు, యాసిడ్ దాడి కేసులు అన్నీ ఇదే రీతిలో పెరుగుతున్నాయి.
ప్రభుత్వ యంత్రాంగం, మహిళా మండళ్ళు తమ వంతు కృషిగా కొన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ పరిస్థితి విషమిస్తూనే ఉంది తప్ప, సమసిపోవటంలేదు. మహిళా సమాజం మరింత చైతన్యవంతంగా అవగాహనను పెంచుకుంటూ ముందుకు సాగాలి. ఇందుకు అధికారులు, నాయకులు, మహిళా ఉన్నత అధికారులు మహిళా సమాజానికి స్ఫూర్తినందివ్వాలి.
కేసులు.. గణాంకాలు
నమోదైన నేరాలు 2010 2011
1. మహిళల అపహరణలు 1239 755
2. అత్యాచారాలు 1308 733
3. వేధింపులు, గృహహింస 9720 5628
4. వరకట్న హత్యలు 149 86
5. వరకట్న మరణాలు 570 284
6. ఆత్మహత్యకు ప్రేరేపణలు 1247 695