మ్యారేజ్, ఎంగేజ్‌మెంట్, బర్త్‌డే... ఇలా ఏ ఫంక్షన్‌లలో పట్టుచీరలకుండే అందం ఎప్పటికీ వనె్న తగ్గనిది. పట్టుచీరలకు బంగారు జరీ ఉంటే ఇక వాటి పట్ల మహిళల మక్కువ అంతా ఇంతా కాదు. త్రేతాయుగం, ద్వాపరయుగపు పురాణ గ్రంథాలలో సైతం వీటి ప్రస్తావన వుంది. గ్రీకు సంస్కృతికి చెందిన గ్రంథాలలోను బంగారు జరీ నేతల వర్ణనలు వున్నాయి. అప్పటి ముస్లిం పాలకులకు పైథానీ చీరలపట్ల మంచి ఆదరణ వుండేదట. నిజాం కూతురైన నీలోఫర్ ఏకంగా చీరల తయారీ కేంద్రానికే వెళ్ళి అక్కడ కొంత కాలం బస చేసి తనకిష్టమైన జరీ డిజైన్ చీరలు తయారుచేయించుకునేదంటే వీటికుండే విలువ చెప్పనలవి కానిది. తల్లి కూతురికి కట్నంలో భాగంగా పైథాన్ చీరను అందిస్తే అదే గొప్ప అని భావించేవారు ఆనాడు. పెళ్లి, పేరంటాళ్లలలో పట్టుచీరలు చేసే గరగరల శబ్దం కూడా ఓ ప్రత్యేక వాతావరణాన్ని కలిగిస్తుంది. పెళ్లికూతురి అలంకరణలో పట్టుచీరకు ప్రాధాన్యం ఉంది. వెంకటగరి, పోచంపల్లి, గద్వాల, కొత్తకోట వంటివేకాక కంచి, బెనారస్, ఆరణి, ఒరిస్సా, నాసిక్ వంటి ప్రాంతాల్లోనూ ప్రధాన ఉత్పత్తి కేంద్రాలున్నాయి. చీరల తయారీలో దేని ప్రత్యేకత దానిదే. ఆయా చీరలలో వుండే తేడాలను మగువలు ఇట్టే పసికట్టేస్తారు.
పూర్వం నీలం, ఆకుపచ్చ రంగులలో చీరలు నేసేవారు. వాటిపై బంగారు జరీ డిజైన్ తెప్పించడంలో నేతపనివారి ప్రతిభ కనబరిచేవారు. ప్రకృతిలోని పక్షులు, చెట్లు ఆధారంగా పైట అంచుకు డిజైన్లుచేసేవారు. కాలక్రమంలో రంగుల్లోను, డిజైన్లలోను ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పట్టు బరువు, జరీ నేతలో చూపిన నాణ్యత నైపుణ్యం ఆధారంగా ధరలు నిర్ణయించేవారు. పట్టుచీరల వాడకంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో టేస్ట్. దక్షిణాది వారు పైట అంచు మీద జరీ ఎక్కువగా ఉండటాన్ని ఇష్టపడితే, ఉత్తరాదివారు చీర మొత్తం జరీతో తళతళ మెరిస్తేనే ఇష్టపడతారు.
-ఎస్
english title:
pattucheera
Date:
Monday, January 30, 2012