బోటనీ హెడ్ వసంతలక్ష్మి పని కట్టుకొని శ్యామలారాణి యింటికి వెళ్లి ఉప్పందించింది. ‘నాకెవరు మెమోనివ్వగలరో అదీ చూస్తాను!’ అంటూ శ్యామలారాణి ఒంటికాలిమీద లేచింది. వసంతలక్ష్మి వివరంగా ప్రిన్సిపాల్ ధోరణి చెప్పాక శ్యామలారాణి ఆలోచనలో పడింది.
డిసెంబర్ 5, శనివారం:
ఉదయం ఎనిమిది గంటలకి భుజాన కాఫీ ఫ్లాస్క్ తగిలించుకొని, యిడ్లీ పార్సెలున్న ప్లాస్టిక్ సంచీ చేత పట్టుకొని ఆర్ట్స్ బ్లాక్ వరండా చివరనున్న మెట్లెక్కి వస్తున్న అటెండరు అప్పల్రాజుకి, బ్రీఫ్‌కేసు పట్టుకొని వస్తున్న మేథమెటిక్స్ లెక్చరర్ మంగపతి ఎదురుపడ్డాడు. యింటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు సైన్స్‌బ్లాక్‌లో ఉన్న లెక్చర్ హాల్లో స్పెషల్ క్లాసు తీసుకోవడానికి వెడ్తున్నాడు మంగపతి.
‘‘ఏం అప్పల్రాజూ, యింత పెందరాళే వచ్చావ్? ప్రిన్సిపాల్‌గారి గది బయట గుమ్మంమీద ఎర్రదీపం వెలుగుతోంది, ఏమిటీ సంగతి?’’ మంగపతి ప్రశ్నించాడు. ‘‘నేనింతకు చాలాముందే వచ్చాను. రాగానే హోటలుకి పోయి కాఫీ, టిఫిన్లు పట్టుకురమ్మని పురమాయించారు. యిక ఎర్రదీపం సంగతంటారా నాకు తెలియదు. కాని నేను హోటలుకి బయలుదేరినప్పుడు, హరిబాబుగారు ప్రిన్సిపాల్‌గార్ని కలవడానికి వచ్చారు. నిన్నటి మీటింగ్ దులుపులు యింకా కొనసాగుతున్నాయేమో?’’ అన్నాడు అప్పల్రాజు. ‘నీకఖ్ఖర్లేని విషయాలు లేవు!’ అనుకుంటూ మంగపతి మెట్లు దిగి, కాస్త దూరం సైన్స్ బ్లాక్ కేసి నడిచేసరికి, వెనుకనుంచి అప్పల్రాజు తన్ను గట్టిగానూ, కంగారుగానూ పిలవడం వినిపించి వెనుదిరిగాడు. ప్రిన్సిపాల్ గదిగుమ్మం ముందు అప్పల్రాజు భయం భయంగా నిల్చుని, మంగపతిని గదిలోపలకి చూడమన్నట్టుగా సంజ్ఞ చేశాడు. మంగపతీ, అతని వెనుకనే అప్పల్రాజు గదిలో ప్రవేశించారు.
ప్రిన్సిపాల్ రంగారావు తల, ముందున్న బల్లమీదకు వాలింది. ముంజేతులు రెండూ బల్లమీద ఆని ఉన్నాయి. మంగపతి పరిశీలనగా చూశాడు. రంగారావు డొక్కాడటల్లేదు. వెంటనే అప్పల్రాజు భుజం మీద చెయ్యి వేసి ముందుకుతోస్తూ గదిలోంచి బయటపడ్డాడు. వరండాలోకి అడుగు పెడ్తూనే ‘‘ఆయనకి ప్రాణం పోయిన సంగతి నీకెలా తెలుసు?’’ అని ప్రశ్నించాడు.
‘‘ఆయన తలవాల్చి బల్లమీదకు ఒరిగి ఉండడం చూసి భయం వేసింది. అందుకనే వెంటనే బయటకు వచ్చి మిమ్మల్ని వెనక్కి పిలిచాను’’
ప్రిన్సిపాల్ గది పక్కనే ఆఫీసు గది ఉంది. దాని తాళం వేసి ఉంది. ‘‘ఆఫీసు గది తాళం తెరు. వైస్ ప్రిన్సిపాల్ రామలింగంగారికి ఫోన్ చేద్దాం’’ అన్నాడు మంగపతి.
‘‘ఆఫీసు తాళాలు ఆఫీసు హెడ్ గుమాస్తాగారి వద్ద ఉంటాయి. అయితే మరో సెట్ ఆఫీసు తాళాలూ, లైబ్రరీ తాళాలూ అయ్యగారి గదిలో గోడకి తగిలించి ఉంటాయి. తీసుకురమ్మంటారా?’’ అప్పల్రాజు సందేహిస్తూ ప్రశ్నించాడు.
‘‘ప్రిన్సిపాల్‌గారి బల్లమీద టెలిఫోన్ ఉపయోగించడానికి నేనూ, గదిలోంచి తాళాలు తీసుకురావడానికి నువ్వూ ఒకేలా సందేహించావనుకొంటాను. సరేలే, నా సెల్‌లోంచి చేస్తాలే’’ అంటూ మంగపతి సెల్ తీసి రామలింగానికి ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు. ఆయన ఆదేశం మేరకు ముందస్తుగా తమకు తెలిసున్న డాక్టర్ కేశవరావుకీ, ఆపైన పోలీసు స్టేషన్‌కీ ఫోన్లు చేశాడు.
మంగపతి సైన్స్ బ్లాక్ చివరకువెళ్లి, తనకు అస్వస్థతగా ఉందని కారణం చెప్పి క్లాసుని కాన్సిల్ చేసి వచ్చాడు. ఓ విద్యార్థి చేత బ్రీఫ్‌కేస్‌ని యింటికి పంపించేశాడు. రామలింగం, కేశవరావూ ఒక నిముషం అటూ యిటూగా పావుగంటలో వచ్చారు. కేశవరావు రంగారావు చెయ్యి పట్టుకొని చూసి పెదవి విరిచాడు. ‘‘ఏదో ఉజ్జాయింపుగా ఏడూ ఎనిమిదిల మధ్య ప్రాణం పోయి ఉండొచ్చు. ఉద్ధృతమైన గుండెపోటు కావచ్చు. ఏవో, ఊపిరి సలపక ప్రాణం పోయిన లక్షణాలు కనబడ్తున్నాయి. విషప్రయోగం జరిగి ఉండవచ్చునన్న అనుమానం కూడా వేస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్ష జరిగితేనే కాని నిర్థారణగా యిదీ కారణం అని తెలియదు. పోలీసుల్ని రానివ్వండి’’ అన్నాడు కేశవరావు.
మరో యిరవై నిముషాలలో క్రైం బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ రఘురాం తన బలగంతో వచ్చాడు. ముందుగా కేశవరావు తన అనుమానాలు చెప్పి ‘‘నా కోసం పేషంట్లు కాసుక్కూర్చుని ఉంటారు. నా అవసరం ఎప్పుడు కలిగినా కబురు చెయ్యండి’’ అని రఘరాం దగ్గర సెలవు తీసుకొని వెళ్లిపోయాడు.
రఘురాం గదినంతనీ నిశితంగా పరిశీలించాడు. పైన పంకా మందకొడిగా తిరుగుతోంది. రంగారావు నుదురు బల్లమీద తెరచి ఉంచిన ఓ ఎకనమిక్స్ పుస్తకంమీద అని ఉంది. సూది పోట్లేమైనా కనబడ్తాయేమోనని మెడనీ, చేతుల్నీ పరిశీలనగా చూశాడు. బల్లమీదనున్న ‘ఇన్‌ట్రే’లో కాని, ‘ఔట్ ట్రే’లో కాని చూడవలసినవి కాని, చూసినవి కాని కాయితాలేమీ లేవు. చెత్త బుట్టలో రెండు నలిపి పారేసిన కాయితాలున్నాయి. వాటిని సాపు చేసి చూశాడు. శ్యామలారాణి అనే లెక్చరర్‌కి జువాలజీ హెడ్ రాజారావిచ్చిన ఓ మెమో తాలూకు ఒరిజినల్ ఒకటి, దాని తాలూకు ఆఫీసు కాపీ మరొకటి. మెమోని అందుకొన్నట్టుగా ఆఫీసు కాపీ మీద శ్యామలారాణి సంతకం లేదు.
వెనకవైపు, గదికి ఓ మూలగా క్రీం కలర్‌లో ఉన్న ఓ ప్లైవుడ్ పార్టిషన్ ఉంది. దాని వెనక గోడకి అమర్చిన వాష్‌బేసిన్, దానికి పైన ప్లాస్టిక్ ఫ్రేంలో ఉన్న అద్దం ఉన్నాయి. వాష్‌బేసిన్‌కి ఓ పక్కగానున్న బల్లమీద ట్రేలో ఉన్న పది మధ్య సైజు కప్పులు మరకలు కట్టి కాఫీ వాసన వేస్తున్నాయి. ఆ కప్పులు తెల్లగా ఉండి సూర్యుడి బొమ్మ ఉన్నవి. ఒకే దొంతరగా పది సాసర్లు పక్కనే ఉన్నాయి. ఆ సాసర్లమీదా సూర్యుడి బొమ్మ ఉంది. కాఫీ మరకలున్నాయి. గోడకి తగిలించిన ఓ షెల్ఫ్‌లో డజను గాజు గ్లాసులు ఉన్నాయి. వాష్‌బేసిన్ తడి తడిగా ఉంది. వాష్‌బేసిన్‌కి రెండోపక్కనున్న తలుపు టాయ్‌లెట్‌లోకి తెరచుకొని ఉంది. అందులో రఘురాంకి ఏదీ అనుమానాస్పదంగా కనిపించలేదు.
రఘురాం చెప్పిన ప్రకారం వేలిముద్రల గాలింపు జరిగింది. వివిధ కోణాల్లోంచి ఓయిరవై దాకా ఫొటోలు తీశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. కప్పులతో సహా ట్రేనీ, ప్రిన్సిపాల్ బల్లమీదనున్న రెండు పేపర్ ట్రేలనీ, ప్రిన్సిపాల్ తలానించిన పుస్తకాన్నీ, సొరుగుల్లో ఉన్న కాయితాల్నీ, ఇతర చిన్న చిన్న వస్తువులన్నీ పోలీసు లేబొరేటరీస్‌కి సీల్ చేసిన కవర్లలో పంపించాడు.
ఇంకా ఉంది