వర్ణ సంకరం అవుతుంది. అవని అరాజకంగా ఉండకూడదు. బుద్ధిమంతుడివి. నువ్వు పట్టం చేపట్టు’’ అని మతికరపాడు.
అంత ఆ వసిష్ఠ ముని నాథుడిని కనుగొని భరతుడు ‘‘మునిచంద్రా! ఇది ఏమిటి? నేనంత మూర్ఖుడినా? మా కులక్రమాగత ఆచారం ఎరుగవా? మా తల్లి నా కన్న తండ్రి మరణనికి కారకురాలు అయింది. ఈ ఘోరం చాలదా? రాజుని అయి రాజ్యం పాలిస్తానా? ఇట్టి నీతి చెప్పరాకు. కైకేయి కొడుకునని ఇంత కఠినోక్తులు ఆడుతున్నావు కాని ఈ ఆలోచనలు నాకున్నవా? ఇప్పుడున్న రూపంతోనే మా రాముడిని ప్రార్థించి తెచ్చి పట్ట్భాషేకం చేస్తాను. కాదంటే మా అన్న కైకొన్న నియమం నేనూ కైకొంటాను. ఇంక నాకు వేరు ఉపాయం తోచదు’’ అని తన అభిప్రాయం తెలిపాడు.
భరతుడు రాముని వద్దకు పోవుట
అనంతరం మంత్రులను కని మా రాముడున్న వనానికి ఏగవలసి ఉంది. త్రోవలు చక్క చేయించండి. అఖిల పురజనులు ఏతేరడానికి శీఘ్రంగా విడుదులు ఏర్పాటు చెయ్యండి. అనేక వస్తువులు సమగ్రంగా వారికి అందుబాటులో ఉంచండి. మంత్రులు అతులోత్సాహులయి అనుకూలమతులయి భరతుడి ఆదేశం తలదాల్చారు. ఆయా పనులు పూర్తి చేయించారు.
ఆ మరుదినము వందిమాగధ బృందము, సచివరులు, సుందరీమణులు, నటులు, నర్తకీరత్నాలు తొమ్మిదివేల దంతావళులు, కోటి జవనాశ్వాలు, లక్షరథాలు, అరవై లక్షల పదాతి దళం క్రిక్కిరిసి నడువ పౌర జనులను జానపదులను, ధరనత్న రాసులు, వసిష్ఠాది మునీంద్రులు, మంత్రివర్యులు, రాజన్యులు- అందరును, శతృఘు్నడు, తల్లులు- పల్యంకికలు ఎక్కి వెంట చనుదేరగా భరతుడు పయనం అయాడు. కతి పయ ప్రయాణాలు చేసి గంగా నదీ తీరంలో దండు విడిసింది.
ఆ వృత్తాంతం గుహుడికి తెలిసింది. వీక్షించి, కైక కొడుకు చతురంగ బలాలతో రాముడి మీదికి దండెత్తిపోతున్నాడు అని తలచాడు. వెంటనే నావలను ఆపించాడు. తన సేనలతో వచ్చి భరతుడితో ‘‘్భరతా! రాముడు రాజ్యం నీకు ఒసగి మునివృత్తితో అడవులలో ఉన్నాడు. నువ్వు చతుర్విధ బలాలతో అతడిపై దండు వెడలుతున్నావు. ఇది నీకు తగుతుందా? నేను రాముడి బంటుని, నిన్ను పోనీను. నీ సేనలను సంహరిస్తాను. నీతో కయ్యం ఒనరించి ప్రాణాలు విడిచిపెడితేనే నువ్వు రామచంద్రునిపైకి ఎత్తిపోవలసింది’’ అని రోషంతో చెప్పాడు.
అప్పుడు భరతుడు దరహాసం చేసి విమలమతితో ‘‘పరమాత్మ అయిన శ్రీరాముడిని ప్రార్థించి అయోధ్యకు కొనితెచ్చి పట్ట్భాషిక్తుడిని చెయ్యడం కొరకు వనములకు వెళుతున్నాను. నా మనస్సున వేరొక భావం లేదు. నువ్వు ఈ గతి పలకవద్దు’’ అని బదులు ఆడాడు.
అంత గుహుడు ఆ భరతుడిని గ్రుచ్చి కౌగిలించుకొని, విచారించి, భరతుడి చిత్తం తెలిసికొని, అనురాగంతో భరతుడి చరణ యుగళానికి దండ ప్రమాణాలు కావించాడు. అతడికి అనుమానాలైన వన్యములైన పదార్థాలు, పలు బహూకృతులు సత్కృతులు చేసి తీసుకొని వెళ్లాడు. అడవికి వెడలుతూ వెనుక రాముడు విడిచిన చోటు చూపించాడు. జడలు తాల్చిన తావున్నూ చెప్పాడు. జనులు, మునులు, అమాత్యులు, తానూ వీక్షించి, భరతుడు శోకించి, జానకీ శ్రీరాములు నాటి రాత్రి పరుండిన తృణశయ్యలలో కాననయ్యెడు కనక వస్త్రాల చినె్నలు కనుగొని వనమందు పురపుర పొక్కాడు. దుర్భర శోకం పొందాడు. కడుంగడు దీనుడయాడు. సీతారామ లక్ష్మణులు జడలు ఎక్కడ ధరించారో ఆ ప్రదేశానికి జడలు పంపి, మర్రిపాలు తెప్పించి శత్రుఘు్నడు, తాను జడలు ధరించారు. మరురోజు భరతుడు లేచి బ్రాహ్మిక కర్మలొనర్చి, గుహుడు సన్నద్ధం చేయించినట్టి ఐదునూరుల పెనునావలు ఎక్కి వేర్వేరుగా తాను, తల్లులు, మునులు, మంత్రులు, సమస్త సేనలు జాహ్నవిని దాటడానికి యత్నించారు.,
-ఇంకాఉంది