చిల్లర ‘ఎఫ్‌డిఐ’కి వ్యతిరేకంగా ప్రస్తావనకు వచ్చిన తీర్మానాలు పార్లమెంటు ఉభయ సభలలోను పరాజయం పాలు కావడం ‘బహుళ జాతీయ సంస్థలు’ చిట్టి వ్యాపారుల పొట్టకొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యూహాత్మక విజయం!! దేశంలోని అతి పెద్ద రాష్ట్రానికి చెందిన రెండు అతి పెద్ద పార్టీల అవకాశవాదం ఇలా బట్టబయలైపోయింది. చిల్లర వ్యాపారాన్ని విదేశీ సంస్థలకు అప్పగించడానికి జరిగిపోతున్న ప్రహసనంలో తాటస్థ్యం వహించడం ద్వారాను, మాటిమాటికీ మాట తప్పడం ద్వారాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ములాయంసింగ్ యాదవ్, మాయావతి జనాదేశాన్ని నిర్లజ్జగా వమ్ము చేశారు! చిల్లర వ్యాపారంలోని విదేశీయ సంస్థల ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు గత సెప్టెంబర్ 15వ తేదీ నుండి ఆర్భాటం చేసిన ములాయం నాకత్వంలోని ‘సమాజ్‌వాదీ’ పక్షంవారు, మాయావతి నేతృత్వంలోని ‘బహుజన సమాజ్’ పక్షంవారు పార్లమెంటు ఉభయ సభలలోను తమ విధానాన్ని తామే ధిక్కరించారు! బహుళ వస్తు చిల్లర వ్యాపారంలోని ‘విదేశీయ ప్రత్యక్ష నిధులు’తో జరిగిపోయే విపరిణామాలను గురించి లోక్‌సభలో గట్టిగా చాటిన ములాయం ‘ఓటింగ్’ ఘట్టం సమీపించేసరికి తన అనుచరులతో కలసి సభ నుండి వెళ్లిపోవడం పలాయనవాదం మాత్ర మే కాదు రాజకీయ నైతికతా రాహిత్యానికి నిదర్శనం! మాయావతి మరింత ముందుకెళ్లి తమ విధానానికి వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రభుత్వాన్ని సమర్థించింది! లోక్‌సభలో భారతీయ జనతా పార్టీ తదితర ప్రతిపక్షాలు చిల్లర ‘ఎఫ్‌డిఐ’కి వ్యతిరేకంగా ప్రస్తావించిన ‘వాయిదా’ తీర్మానం నెగ్గి ఉండినట్టయితే ప్రధాని మన్మోహన్‌సింగ్ నాయకత్వంలోని ‘ఐక్య ప్రగతి కూటమి’ ప్రభుత్వం కూలిపోయి ఉండేది! ‘ఎఫ్‌డిఐ’ని వ్యతిరేకించిన ‘బహుజన సమాజ్’ వారి ఇరవై ఇద్దరు సభ్యులు, ‘సమాజ్‌వాదీ’కి చెందిన ఇరవై ఒక్కరు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి ఉండినట్టయితే తీర్మానం నెగ్గి ఉండేది! కానీ ఆ రెండు పార్టీలు సభనుండి బయటికి వెళ్లిపోవడంతో తీర్మానానికి అనుకూలంగా 218 ఓట్లు మాత్రమే లభించాయి. వ్యతిరేకంగా 253 ఓట్లు లభించాయి. వ్యతిరేకంగా పడిన 218 ఓట్లకు ఈ రెండు పార్టీల 43 ఓట్లు కలిసి ఉండినట్టయితే 261 ఓట్లతో తీర్మానం నెగ్గి ఉండేది!! కానీ ఇలా దేశ ప్రజల విస్తృత ప్రయోజనాల పరిరక్షణకు లభించిన చారిత్రక అవకాశాన్ని కాళ్లతో తన్నివేయడం ద్వారా ఈ రెండు పార్టీల వారు ‘జనాభిష్టాన్ని’ వెక్కిరించారు! చిల్లర వ్యాపారాన్ని విదేశీయ వాణిజ్య సంస్థలు కొల్లగొట్టడానికి మార్గాన్ని సుగమం చేయగలిగారు. అలాంటప్పుడు ‘చిల్లర ఎఫ్‌డిఐ’ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పార్లమెంటులోను, బయటా కూడా ప్రకటించడం దేనికి?? ఇలా తాము స్వవచో విఘాతానికి పాల్పడడం వల్ల ప్రజల దృష్టిలో విశేషించి ఉత్తరప్రదేశ్ ఓటర్ల దృష్టిలో తాము చులకనైపోతామన్న సందేహం కూడా ఈ పార్టీల నేతలను పీడించకపోవడం ఘోరమైన రాజకీయ వైపరీత్యం! ప్రభుత్వాలు ఏర్పడడాలు, పతనం కావడాలు తాత్కాలిక రాజకీయ పరిణామాలు! కానీ చిల్లర వ్యాపారాన్ని విదేశీయ వాణిజ్యపు తండాలు క్రమంగా దురాక్రమించడం దేశాన్ని దివాలా తీయించగల, దేశ ఆర్థిక సార్వభౌమ అధికారాన్ని నీరుకార్చగల దీర్ఘకాల పరిణామం!! ప్రస్తుత ప్రభుత్వం కొనసాగుతుందా? పడిపోతుందా? అన్నది రాజకీయ పరిధికి పరిమితమైన అంశం! కానీ ‘చిల్లర ఎఫ్‌డిఐ’ స్థిరపడుతుందా? పలాయనం చిత్తగిస్తుందా? అన్నది విస్తృత జాతీయ అస్తిత్వానికి చెందిన అంశం! ఇలాంటి అతి ప్రధానమైన అంశం విషయంలో ‘ఆషామాషీ’గా వ్యవహరించడం ద్వారా సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ పార్టీలు దేశ ప్రజలను వెక్కిరించాయి. మన ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను అంతర్జాతీయ సమాజం దృష్టిలో నవ్వులపాలు చేశారు!
‘ఎఫ్‌డిఐ’ని వ్యతిరేకించినవారు, సమర్థించినవారు తమ నిష్ఠను నిలబెట్టుకోగలిగారు. ఈ రెండు పార్టీలు మాత్రం ‘‘దీపం పెట్టిన తరువాత దిగనేసే’’ వైపరీత్యానికి ఒడిగట్టాయి. ప్రభుత్వం పడిపోకుండా నిలబెట్టడానికై, ‘‘మతోన్మాద’’ శక్తులు బలం సంపాదించకుండా నిరోధించడానికై తాము లోక్‌సభలో ఓటింగ్‌లో పాల్గొనలేదన్నది ములాయం, మాయావతి బృందంవారు చేస్తున్న వాదం! ఎవరు మతోన్మాదశక్తులు? ఎవరు కాదు? అన్నది వేరే విషయం. కాని లోక్‌సభలో ప్రభుత్వాన్ని నిలబెట్టిన తరువాత కూడా ములాయం, మాయావతి పిల్లిమొగ్గలు వేయడానికి కారణం మాత్రం అంతుపట్టడంలేదు! రాజ్యసభలో ‘ఎఫ్‌డిఐ’కి వ్యతిరేకంగా తీర్మానాన్ని బలపరచడం ద్వారా తమ విధానాన్ని ప్రజలకు స్పష్టంచేస్తామని లోక్‌సభలో ఓటింగ్ ముగిసేవరకూ ఈ రెండు పార్టీలవారు చెప్పుకొచ్చారు. అంటే ‘‘ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నాము, చిల్లర ‘ఎఫ్‌డిఐ’ని వ్యతిరేకిస్తున్నాము...’’ అన్నది వారి విధానం. కానీ ఈ మాటనూ ఈ పార్టీలు నిలబెట్టుకోలేదు. సమాజవాదీ సభ్యులు ఓటింగ్ సమయంలో రాజ్యసభ నుండి బయటికి వెళ్లిపోగా, మాయావతి బృందంవారు మరింత బరితెగించి తీర్మానానికి వ్యతిరేకంగా ఓట్లువేశారు. ప్రజలు గమనిస్తున్నారన్న బిడియం లేకపోవడమా? ప్రజలంటే లెక్కలేనితనమా?
‘మాట’కు కట్టుబడి ఈ రెండు పార్టీలు ప్రతిపక్షాల తీర్మానాన్ని బలపరిచి ఉంటే వారి ‘చిల్లర ఎఫ్‌డిఐ’ వ్యతిరేక నిష్ఠపట్ల కొంత విశ్వాసం కలిగి ఉండేది! తీర్మానం రాజ్యసభలో నెగ్గినందువల్ల ప్రభుత్వపు మనుగడకు వచ్చే ప్రమాదం లేదు! ‘చిల్లర ఎఫ్‌డిఐ’పై పార్లమెంటు ఉభయ సభలలో అభిప్రాయభేదాలు వ్యక్తమయినట్టు స్పష్టమయ్యేది. కానీ అది ‘చిల్లర’ రంగంలోకి చొరబడదలచుకున్న విదేశీయ సంస్థలకు, వారికి దేశంలో ఉన్న మద్దతుదారులకు నైతిక పరాజయంగా మారి ఉండేది! అలాంటి నైతిక పరాజయంపాలుకూడ ఈ సంస్థలు వారి దళారీలు కావడం బహుజన సమాజ్, సమాజ్‌వాదీ నేతలకు ఇష్టంలేని వ్యవహారమన్నది స్పష్టమైపోయిన మరో అంశం! దేశ ప్రజలు, ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ఓటర్లు చిల్లర ‘ఎఫ్‌డిఐ’కి వ్యతిరేకంగా ఉన్నారన్నది స్పష్టం! అంతేగాక ఇటీవల పశ్చిమ బెంగాల్‌నుండి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ సమర్థించినప్పటికీ రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ కుమారుడైన అభిజిత్‌ముఖర్జీకి తక్కువ మెజారిటీ లభించడానికి కారణం ‘చిల్లర ఎఫ్‌డిఐ’! ఈ సంగతిని అభిజిత్‌ముఖర్జీ స్వయంగా ప్రకటించాడు! చిల్లర వర్తకంలో ఎఫ్‌డిఐలతో స్థానికంగా ఉన్న చిన్న దుకాణాలు మూత పడినట్టు స్వచ్ఛంద స్వతంత్ర సంస్థలు నిర్వహించిన ‘సర్వే’లలో వెల్లడైన అంశం! ఈ అనుభవం దృష్ట్యా ఈ అంశాన్ని ఎన్నికల వాగ్దాన పత్రంలో స్పష్టంగా వివరించి ‘జనాదేశం’ పొందిన తరువాత మాత్రమే అధికార రాజకీయ పార్టీలు అమలుజరపాలి! రాజకీయ పార్టీల అవకాశవాదాలు, పదవీ విన్యాసాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నది ధ్రువపడుతున్న వాస్తవం! బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ప్రభావం విస్తరిస్తున్నకొద్దీ మన దేశంతో సహా అన్ని వర్ధమాన దేశాలలోను ధరలు నిరంతరం పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం పెరుగుతోంది, ఎగుమతులు తగ్గుతున్నాయి, ‘వినిమయ ద్రవ్యం’ భారీగా విదేశాలకు తరలిపోతోంది, స్థూల దేశీయోత్పత్తి- జిడిపి- తగ్గిపోతోంది!!
చిల్లర ‘ఎఫ్‌డిఐ’కి వ్యతిరేకంగా ప్రస్తావనకు వచ్చిన తీర్మానాలు పార్లమెంటు ఉభయ సభలలోను పరాజయం పాలు కావడం ‘బహుళ జాతీయ సంస్థలు’
english title:
mulaayam
Date:
Saturday, December 8, 2012