Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఉగ్రవాద పడగ నీడలో పాక్ ప్రజలు విలవిల

$
0
0

మొత్తం ప్రపంచానే్న కలచివేసిన ముంబయి ఉగ్రవాదుల దాడిలో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది మహ్మద్ అజ్మల్ కసబ్‌ను ఉరితీసినా ఆ దాడికి సూత్రధారులు ఇంకా పాకిస్థాన్‌లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పలు దశాబ్దాలుగా భారతదేశంలో వివిధ ప్రాంతాలల్లో ఉగ్రవాద చర్యలకు పథక రచన పాకిస్థాన్ భూభాగంనుండే జరుగుతున్నది. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, వారికి ఆయుధాలు సమకూర్చడం సహి తం అక్కడినుండి జరుగుతున్నది.పాకిస్థాన్‌ప్రభుత్వం, సైన్యంలలో కీలక స్థానాలలో వున్న వారి ప్రమేయంతోనే మన దేశంలో ఉగ్రవాదం ఒక పెద్ద ఆంతరంగిక సవాల్‌గా పరిణమించింది. తమ రాజకీయ వైఫల్యాలు, ఆంతరంగిక సమస్యలు, స్వార్థ ప్రయోజనాలనుండి ప్రజల దృష్టి మళ్ళించడంకోసం భారతదేశంలో ఉగ్రవాద చర్యలను పాకిస్థాన్ భూభాగంనుండి ప్రోత్సహిస్తున్నారు. అయితే భస్మాసురుడి హస్తంవలే పాకిస్తాన్ ప్రజానీకం నేడు ఉగ్రవాదం రక్తపు నీడలలో భయ కంపితులై జీవనం కొనసాగించే పరిస్థితులు నెలకొన్నాయి. బాంబుల ప్రేలుళ్ళు, తుపాకీ మోతలు, హత్యలు, ఉగ్రవాదుల దాడులు నేడు పాకిస్థాన్‌లో నిత్యకృత్యమైపోయాయి. ఉగ్రవాదం వికృత రూపం దాల్చుతుంటే పాకిస్థాన్‌లో చట్టం అమలుచేయవలసిన సంస్థలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. చాలా అరుదుగా ఉగ్రవాదుల దాడులపై దర్యాప్తులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో బాధ్యులైన వారిని గుర్తించినా అరెస్టులు జరగడం చాలా అరుదు. ఇక శిక్షలు పడటం అసాధ్యం.
పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదులలో అత్యధికులు తాలీబన్లు అయినా, దాదాపు అదే సంఖ్యలో జాతీయవాద, మతపర, ప్రాంతీ య సంస్థలకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. తుపాకీ పొగలవాసన పాకిస్థాన్ వీధులలో నేడు సర్వసాధారణమవుతున్నది. తుపాకి కాల్పులు, బాంబు ప్రేలుళ్ళ శబ్దాలు, ఆవేదనతో రోదనలు, బాధితుల ఆక్రందనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాము రేపు ఉంటా మని గానీ, తాము ప్రేమించేవారిని మరుసటిరోజు చూడగలమని చెప్పలేని స్థితిలో పాకిస్థాన్ ప్రజలు ఉన్నారనడం అతిశయం కాదు. బడికి వెళ్ళిన పిల్లలను తరచూ తలచుకొంటూ వారి భద్రత గురించి తెలుసుకోవడానికి తల్లిదండ్రులు వారి మొబైల్ నంబర్లకు ఫోన్‌లు చేస్తున్నారు. పనికోసం, వ్యాపారంకోసం ఇంటినుండి బయలుదేరినవారు తుపాకీ కాల్పులకు, బాంబుల ప్రేలుళ్ళకు గురికాకుండా ఇంటికి తిరిగి రాగలమనే నమ్మకం ఉండటం లేదు.
ఆత్మాహుతి దళాలు ఉపయోగించే ప్రేలుడు పదార్థాలను తయారుచేయడం నేడు పాకిస్థాన్‌లో చాలా లాభదాయక పరిశ్రమ. ఈ పరిశ్రమకు విదేశాలలోని స్వార్థపరశక్తులు, సైన్యం-ప్రభుత్వంలోని ఉన్నతాధికారులనుండి పెట్టుబడులు సమకూరుతున్నాయి. ప్రతి మసీదు నుండి వ్యాప్తిచేస్తున్న మతపర ద్వేషభావమే మతపరమైన ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్నది.
మృతి చెందిన ఆత్మాహుతి దళ సభ్యుల కుటుంబాలకు భారీ మొత్తాలలో పరిహారం లభిస్తుంది. అందువలన ఇటువంటి తీవ్రవాదం వైపు అనేకమంది ఆకర్షితులవుతున్నారు. ‘మరణ పరిశ్రమ’ వృద్ధి చెందడానికి ఇదొక కారణం. ఇక జాతీయ, ప్రాంతీయ గ్రూపులు తమ ‘మాతృభూమి’పై ఆధిపత్యంకోసం హింసను ప్రేరేపిస్తున్నాయి. వారెందుకు పోరాడుతున్నా అమాయక ప్రజలు భారీ సంఖ్యలో మృతి చెందుతున్నారు.
ఇంతవరకూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న సైన్యం, మతపర శక్తుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర సమస్యగా రూపొందుతున్న తాలిబన్ల పట్ల సహితం అదే విధంగా వ్యవహరిస్తున్నది. తాలిబన్లతో శాంతి చర్చలకోసం ఉపయోగపడతారు అనే నమ్మకంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల తొమ్మిది మంది జైళ్ళలో ఉన్న తాలిబన్లను విడుదల చేసింది. అయితే తరాల అంతరం కారణంగా జైలునుండి విడుదల చేసిన తాలిబన్లు శాంతి సంప్రదింపులకు ఏమాత్రం ఉపయోగపడతారో అని అంటూ వారి నిఘా సంస్థల అధికారి ఒకరు అనుమానం వ్యక్తంచేశారు. మరికొంతమందిని కూడా అందుకోసం జైళ్ళనుండి విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఆఫ్ఘానిస్థాన్‌లోని ప్రస్తుత తాలిబన్ల నాయకత్వం వారి మాటలకు ఏమేరకు ప్రాధాన్యత ఇస్తుందో చెప్పలేము. వారు జైళ్ళనుండి విడుదల అయిన తర్వాత కూడా పాకిస్థాన్‌లో బాంబుల ప్రేలుళ్ళ శబ్దాలు తగ్గలేదు. అంటే తాలిబన్లు శాంతి చర్యలకు సిద్ధంగా లేవని స్పష్టం అవుతుంది. పాకిస్థాన్ అంతటా డజన్లకొద్దీ అమాయక ప్రజలు మరణించడానికి కారణం అవుతున్నా బాంబు ప్రేలుళ్ళకు తామే బాధ్యులం అంటూ తాలిబన్లు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా షియాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. నవంబరు 21న జరిగిన బాంబు ప్రేలుడులో 30 మంది మృతి చెందగా, మరి అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటువంటి దాడులు మత ఉద్రిక్తతలకు సహితం దారితీస్తున్నాయి. రావల్పిండిలో షియాల ఊరేగింపులో చొరబడి జరిపిన దాడిలో 23 మంది మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. కరాచీలో షియాలపై జరిగిన మరో దాడిలో ఇద్దరు మృతి చెందారు. షాంగ్లీ, క్వెట్టాలో సహితం దాడులు జరిగాయి.
2008లో ముంబాయిలో 166 మంది ప్రజల మరణానికి దారితీసిన ఉగ్రవాదుల దాడికి సంబంధించి కసబ్‌ను ఉరితీయగానే భారతదేశంలో సహితం పలు ఉగ్రవాదుల దాడులు జరుపుతాము అంటూ పాకిస్థాన్‌లోని తాలిబన్లు హెచ్చరించారు. తమ దేశంలో తాలిబన్ల దాడుల పట్ల పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అయితే పొరుగు దేశాలలో ఉగ్రవాదుల దాడులు జరుపుతున్న వారికి తమ దేశంలో ఆశ్రయం కల్పించడం తీవ్ర అభ్యంతరకర అంశం. అటువంటి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడం పొరుగు దేశపు సార్వభౌమాధికారం ప్రశ్న తలెత్తినా తగు విధంగా స్పందించే అధికారం భారతదేశానికి ఉంటుందని గ్రహించాలి. పాకిస్థాన్‌లో తాలిబన్ల శిబిరాలపై అమెరికా వైమానిక దళం జరుపుతున్న దాడుల రీతిలో భారతదేశం సహితం దాడులు జరపక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాకిస్థాన్ భూభాగంనుండి తాలిబన్లు,ఇతర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు హింసాయుత దాడులకు పాల్పడటం తప్పించుకోలేని తన బాధ్యతగా పాకిస్థాన్ ప్రభుత్వం గుర్తించాలి. ఉగ్రవాదుల దుశ్చర్యలు, హింసాకాండను అడ్డుకోవడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ఎందుకు ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఆశ్చర్యం కలుగుతుంది. ఉగ్రవాదుల దాడుల గురించి పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు దర్యాప్తులు జరుపుతున్నా తర్వాత ఏమీజరగడంలేదు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించినా వారిపై చర్యలుతీసుకోవడం లేదు. ఉగ్రవాదం పట్ల సానుభూతి కలిగిన ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు అటువంటి వారిపై ఎటువంటి చర్యతీసుకోకుండా వదిలి వేస్తున్నారు. తగు శిక్షలు విధిస్తే తమకు ప్రాణాంతకం కాగలదనే భయంతో సహితం మరికొందరు వ్యవహరిస్తున్నారు. దానిలో ‘‘న్యాయం’’అనే మాటకు అర్ధంలేకుండాపోతున్నది.
‘‘ఉగ్రవాదులు, తీవ్రవాదులకు సేవకులుగా ఉన్నట్లు కనిపించకుండా మా ప్రాణాలు ఎలా రక్షించుకుంటాం? మా ఉద్యోగాలు ఎట్లా కాపాడుకుంటాం?’’అని ప్రశ్నిస్తున్నారు. వేలాది మంది ఉగ్రవాదులను అరెస్టుచేసినా, వారిలో కొద్దిమంది మాత్రమే కొద్దిరోజులు మాత్రం జైళ్ళలో ఉంటున్నారు. మిగిలిన వారు బెయిల్‌పై విడుదలయి తిరిగి కనిపించడం లేదు. పాకిస్థాన్‌లో కిరాతక నేరాలకు పాల్పడి మరణశిక్షకు గురై జైళ్ళలో మ్రగ్గుతున్న వారి సంఖ్య ఎనిమిది వేల మందికి పైగా ఉన్నది. అయితే వారిలో ఒక్కడు కూడా తాలిబన్ ఉగ్రవాది లేడు. ఉగ్రవాదుల దాడులకు సంబంధించిన వారు లేరు. ఉగ్రవాదులు శిక్షలుపడకుండా తప్పించుకోవడానికి ప్రాసిక్యూషన్ వైఫల్యంగా సాక్షులు చెబుతున్నారు. ప్రభుత్వానికి, స్వార్థపర ప్రయోజనం ఉండే వార్తాపత్రికల నుండి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా భారీశిక్షలు వేస్తున్నారు. కానీ ఉగ్రవాదులకు మాత్రం శిక్షలు పడటం లేదు. అంటే పాకిస్థాన్‌లో ఉగ్రవాదులే రాజ్యం ఏలుతున్నారని, వారిని కట్టడిచేయగల చట్టబద్ధ పాలన అంటూ లేదని స్పష్టం అవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే పాకిస్థాన్ తీవ్ర కల్లోలకర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుందని గ్రహించాలి. అరాచక పరిస్థితులు తీవ్రమైతే ప్రభుత్వం మనుగడ సాగింపలేదు. కనీసం తమ అస్థిత్వం నిలుపుకోవడంకోసం అయినా ఉగ్రవాదంను అదుపుచేయడంకోసం పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలుతీసుకోవాలని ఆసియన్ మానవ హక్కుల కమిషన్ వంటి పలు మానవ హక్కుల సంఘాలు, పౌర సంఘాలు కోరుతున్నాయి. దేశాన్ని కాపాడతామని ప్రతినబూనిన పోలీసులు, సైన్యం, ఇతర ప్రభుత్వ సంస్థలను ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రభుత్వం విశ్వసించే అవకాశాలు కనబడటంలేదు. అందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషింపక తప్పదు. ముందుగా పార్లమెంటులో ఉగ్రవాదంపట్ల దృఢవైఖరిని అన్ని పక్షాలు కలసి వ్యక్తంచేయాలి. ఉగ్రవాదాన్ని అరికట్టడానికై పోలీసులు, సైన్యం, ఇతర సాయుధ దళాలను కట్టడిచేసే విధంగా నిర్దిష్టమైన, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. న్యాయమూర్తులలో భద్రతాభావం కల్పించాలి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే హత్యకు గురికావలసి వస్తుందని లేదా దేశం వదిలిపోవలసి వస్తుందని భయపడే పరిస్థితిలో వారున్నారు. అటువంటి అవసరంలేదని వారు ధైర్యంతో విధి నిర్వహించగల పరిస్థితులు కల్పించాలి.
ఉగ్రవాదాన్ని కట్టడి చేయగల రాజకీయ సంసిద్ధత పాకిస్థాన్‌లోని రాజకీయ నాయకత్వానికి ఇప్పుడు ఉన్నదా? భారతదేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఫలితంగానే తమ దేశం సహితం ఉగ్రవాదం నీడలో భయ కంపితులై ఉండవలసి వస్తున్నదని గ్రహించారా? ఈ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం దృఢంగా వ్యవహరింపగలిగే పరిస్థితులు కనబడటం లేదు.

మొత్తం ప్రపంచానే్న కలచివేసిన ముంబయి ఉగ్రవాదుల దాడిలో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది
english title: 
ugra
author: 
- చలసాని నరేంద్ర

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>