ఒక్క హైస్కూల్ ఒక్క రోజు కూడా పిజిహెచ్‌ఎం లేకుండా ఉండొద్దని నెలనెలా స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులిచ్చి భర్తీచేస్తూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు విద్యారంగంలో ముందుండాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ గత ఐదు ఆరు సంవత్సరాలుగా కృషిచేస్తూ వస్తున్నది. హర్షదాయకం. ఆమోదయోగ్యం. విద్యార్థికి ప్రాథమిక స్థాయినుండే విద్యాపరమైన బోధన కీలకం కావున ప్రాథమిక పాఠశాలల్లో యస్.జి.టి. పోస్టులను పిజిహెచ్‌ఎంల లాగా నెలనెలా నియామకం చేస్తూ ఖాళీ ఎస్.జి.టి. స్థానాలను భర్తీచేయకపోవడం వలన పునాదిలోనే విద్యార్థుల చదువులు ఘోరంగా దెబ్బతింటున్నాయి. ‘మొక్కై వంగనిది మానై వంగునా’ అన్నట్లు ప్రాథమిక దశలో దెబ్బతిన్న చదువులను తర్వాత దశలో సవరించడం చాలా కష్టం. పట్టించుకునే దిశలో నేటి విద్యావ్యవస్థ లేదు. ఎంతసేపూ సిలబస్ పూర్తిచేయడం, ఉత్తీర్ణత సాధించడం పనులే ఉన్నత విద్యాధికారుల లక్ష్యాలుగా ఉంటున్నాయ. యాంత్రిక బోధనకు పెద్దపీట వేస్తూ తరగతి గదిలో ఉపాధ్యాయులు స్వేచ్ఛగా బోధించడానికి గత పది సంవత్సరాల క్రితమే తిలోదకాలిచ్చి, కాగితపు వర్క్‌లో బిజీ బిజీగా ఉపాధ్యాయులనుంచుతూ కావలసిన నివేదికలను తయారుచేయించుకునే వ్యవస్థగా విద్యాశాఖ మారింది. రాష్టవ్య్రాప్తంగా ప్రధానోపాధ్యాయులు అధికారుల అడుగులకు మడుగులొత్తుతూ వౌలికంగా విద్యార్థుల శ్రేయస్సు గురించి ఎలాంటి విద్యపరమైన చర్యలు చేపట్టకుండానే రిపోర్టులు అందించే ‘బంట్రోతు వ్యవస్థ’గా మారుతున్నారు. అతి కొద్దిమంది ప్రధానోపాధ్యాయులు మాత్రమే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తూ ప్రభుత్వ పాఠశాలల ఉనికికి గర్వకారణంగా ఉన్నారు. సహ ఉపాధ్యాయుల్లో సమన్వయంతో, అధికారులకు నిర్మాణాత్మక సలహాలతో విద్యార్థుల శ్రేయస్సుకై అహర్నిశలు కృషిచేస్తుండడం సంతోషదాయకం. ఇలాంటి ప్రధానోపాధ్యాయులను గుర్తించి మిగతా ప్రధానోపాధ్యాయులకు శిక్షణనిప్పిస్తే చాలా బాగుంటుంది. కొంతమంది ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రుల గ్రామ పెద్దల సహకారంతో తమ తమ పాఠశాలల్లో రాత్రి తరగతులు నిర్వహిస్తూ గ్రామీణ పేద విద్యార్థుల చదువులపై చిత్తశుద్ధి చూపడం ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థకే గర్వకారణం. ఇదంతా ఒక పార్శ్వమైతే, మరో పార్శ్వం ఘోరాతిఘోరం. పిజిహెచ్‌ఎం పోస్టు ఏదో అందివచ్చిన అదృష్టంగా భావిస్తూ కుర్చీలో కూర్చుని గుర్రాలను మలిపే పోస్టు అనుకొని పొద్దస్తమానం కుర్చీకే అతుక్కొని ... పనిచేసే మంచి ఉపాధ్యాయులకే ఎసరు బెట్టేలాగా మరింత సోమరి పోస్టు అయంది. వీళ్ళకు విద్యార్థుల చదువులపై ఎలాంటి శ్రద్ధ ఉండడం లేదు. కొంతమంది రిజర్వేషన్ పరంగా, అకాడెమిక్ పరంగా ఎలాంటి అనుభవం లేకుండా రావడంవలన రాజకీయాల మధ్య నలిగిపోతూ, పరిహసించబడుతున్నారు. అవకాశవాద టీచర్లు ఇలాంటి హెడ్మాస్టర్లను లెక్క చేయడంలేదు. సక్సెస్ స్కూళ్ళలో అయితే ఆంగ్ల భాషలో కనీసం అవగాహన లేని వాళ్ళు పదోన్నతిపై పిజిహెచ్‌ఎంలుగా రావడం కొంతమంది చురుకైన విద్యార్థుల వలన కూడా అవహేళనకు గురికావడం జరుగుతున్నది. పదోన్నతుల వలన రిజర్వేషన్ కేటగిరీ వారికి లాభం జరగగా అదే రిజర్వేషన్ కేటగిరీవారు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా ఉండడం వలన విద్యాపరంగా, పాఠశాల నిర్వహణాపరంగా బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు తీరని నష్టం జరుగుతున్నది. ఉద్యోగాలు సరే పదోన్నతులు ఎంతవరకు సబబు అనే విషయాన్ని, రిజర్వ్ కేటగిరిలో పదోన్నతి పొందిన పిజిహెచ్‌ఎంల పాఠశాలల పనితీరును గమనిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవగాహన వస్తుంది. కావున ఒక పరిశీలన చేయాలి. రిజర్వ్ కేటగిరీ ద్వారా ప్రమోషన్ పొందిన ప్రధానోపాధ్యాయులు ఇతర సీనియర్ ఉపాధ్యాయుల సలహాల మేరకు పనిచేయవలసిన పరిస్థితుల కారణంగా ఉపాధ్యాయులు వివిధ యూనియన్లుగా విడిపోవడం మూలంగా, యూనియన్ల రాజకీయాలన్ని ప్రధానోపాధ్యాయుల పనితీరుపై ప్రభావం చూపి, పాఠశాల పనితీరు పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నాయ. బోధనా సంస్కృతి లేని ఉపాధ్యాయ సంఘ నాయకులే ప్రధానోపాధ్యాయుల పనితీరును పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
ఒక్క హైస్కూల్ ఒక్క రోజు కూడా పిజిహెచ్‌ఎం లేకుండా ఉండొద్దని నెలనెలా స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులిచ్చి భర్తీచేస్తూ
english title:
pghm
Date:
Saturday, December 8, 2012