చదవేస్తే ఉన్నమతి పోయే, కాకరకాయ కాస్తా కీకర కాయ అయినట్లుంది ఘనత వహించిన మన అధికారుల తీరు. రాజకీయ నేతల తీరూ అందుకు ఏమీ తీసి పోలేదు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్లుంది వారి తీరు. ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు ఇటీవల జరిగిన శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల తీరు చూస్తే అదే అనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును ఆమోదించాలన్న ఏకైక లక్ష్యంతో శాసనసభ, శాసనమండలి సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు తేదీల ఖరారులో ఏర్పడిన గందరగోళం శాసనసభలో బిల్లును ఆమోదించేంత వరకు కొనసాగింది. నిబంధనల ప్రకారం ఏదైనా ఒక బిల్లును శాసనసభ ఆమోదించిన తర్వాతనే శాసనమండలికి పంపిస్తారు. సాధారణ సమావేశాలైతే ఇతరత్రా అజెండా ఉంటుంది కాబట్టి శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఒకే రోజున ప్రారంభించినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ప్రత్యేక సమావేశాలు ఒక బిల్లును ఆమోదించడానికి మాత్రమే ఉద్దేశించినవి. అయన ప్పటికీ ఘనత వహించిన మన అధికారులు నిబంధనలను పట్టించుకోకుండా నవంబర్ 30నే శాసనసభ సమావేశాలతోపాటు శాసనమండలి సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 30వ తేదీన విడివిడిగా జరిగిన శాసనసభ, శాసనమండలి సలహా సంఘం (బిఎసి) సమావేశంలో ఈ పొరపాటును గ్రహించారు. నోటిఫికేషన్ జారీ అయింది కాబట్టి నవంబర్ 30వ తేదీనే శాసనమండలి సమావేశం కావలసి వచ్చింది. ఆ రోజు ఏదో ఒకటి చర్చించాలి కాబట్టి నీలం తుపాను నష్టంపై చర్చించాలని నిర్ణయించారు. అంత వరకు బాగానే ఉంది. అయితే తొలి రోజు సమావేశానే్న జరగనీయకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో సమావేశాలను డిసెంబర్ పదో తేదీ నాటికి వాయిదా వేస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ ఎ చక్రపాణి ప్రకటించారు. నిబంధనల ప్రకారం సమావేశాలు ఏడు రోజులకు మించితే నిరవధిక వాయిదా (సైనిడై) వేయాలే తప్ప వాయిదా వేయడానికి లేదు. ఇది ఓ తప్పిదంగానే భావించాలి. ఇక శాసనసభలో బిల్లుపై చర్చ, ప్రభుత్వ సమాధానం చెప్పిన తర్వాత సభ ఆమోదం పొందే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కొన్ని సవరణలను ప్రతిపాదించింది. ఇతర ప్రతిపక్షాలు కూడా కొన్ని సవరణలను ప్రతిపాదించాయి. అయితే ఆ సవరణ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇక బిల్లు ఆమోదం పొందుతుందనుకుంటున్న సమయంలో టిడిపి అడ్డుపుల్ల వేసింది. బిల్లులోని పనె్నండవ నిబంధనకు తాము ప్రతిపాదించిన సవరణపై ఓటింగ్‌కు పట్టుపట్టింది. ఎస్సీ, ఎస్టీలకు వినియోగించే నిధులను ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఖర్చు చేయాలన్నది టిడిపి ప్రతిపాదించిన సవరణ. వాస్తవానికి ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన సవరణ ప్రతిపాదన. ఈ సవరణను అధికార పక్షం గ్రహించలేకపోయింది. నిజానికి ఫలానా సవరణను ప్రతిపాదించనున్న ట్లు టిడిపి రెండు రోజుల ముందునుంచే విలేఖరుల సమావేశాల్లో చెబుతూ వచ్చింది. అప్పటికప్పుడు సభలో హఠాత్తుగా ప్రతిపాదించలేదు. అప్పుడే న్యాయ శాఖ అధికారులు గాని, ఇతర అధికారులు గాని దీనిపై దృష్టిపెట్టినట్లయితే సభలో అంతటి ఉద్రిక్తత చోటు చేసుకునేది కాదు. సవరణ ప్రతిపాదనపై ఓటింగ్ జరిగినపుడు ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా మద్దతు పలికాయి. చివరకు ఐఎఎస్ అధికారిగా పని చేసి రాజ్యాంగం పట్ల విశేష పరిజ్ఞానం ఉన్న లోక్‌సత్తా పార్టీ ఏకైక ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ కూడా రాజ్యాంగ విరుద్ధమైన ఈ సవరణ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యకరం. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాయనుకోవాలనేమో. అయతే ఓటింగ్ జరిగి ఫలితాన్ని ప్రకటించబోతున్నారన్న సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. దాం తో సభలో గందరగోళం ఏర్పడింది. దీనిపై సభలో సుదీర్ఘ చర్చనే జరిగింది. సవరణ ప్రతిపాదనకు అనుకూలంగా 47, వ్యతిరేకంగా 69 ఓట్లు రావడంతో సవరణ ప్రతిపాదన వీగిపోయింది. ఒకవేళ ప్రతిపక్షాల సభ్యులందరూ హాజరై సవరణ ప్రతిపాదనకు అనుకూలంగా మెజారిటీ ఓట్లు వచ్చి ఉన్నట్లయితే రాజ్యాంగ, రాజకీయ సంక్షోభానికి, వివాదానికి దారి తీసేది. న్యాయశాఖ అధికారుల నిర్వాకం వల్ల ప్రభుత్వ మనుగడే అప్పుడు ప్రశ్నార్థకమయ్యేది. ఈ తప్పుకు కారణం మీరంటే మీరని ప్రభుత్వ అధికారులు, శాసనసభ సచివాలయ అధికారుల మధ్య విభేదాలకు దారి తీసింది. కానీ ఒకవిధంగా చెప్పాలంటే శాసనసభ అధికారులది పోస్టుమ్యాన్ ఉద్యోగం. వివిధ అంశాలపై ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రశ్నలను ఆయా శాఖల అధికారులకు పంపించినట్టే బిల్లుపై వచ్చిన సవరణ ప్రతిపాదనలను కూడా సంబంధిత అధికారులకు పంపించారు. ఆ సవరణ ప్రతిపాదన చట్టసమ్మతమా, న్యాయ సమ్మతమా, రాజ్యాం గ నిబంధనలకు లోబడి ఉందా అన్నది చెప్పాల్సింది ప్రధానంగా న్యాయశాఖ అధికారులు. ఈ విషయాన్ని వారు ముందుగానే చెప్పి ఉంటే సభలో ఓటింగ్‌కు దారి తీసి ఉండేది కాదు. సవరణ ప్రతిపాదన వీగిపోయింది కాబట్టి సరిపోయింది. లేని పక్షంలో అధికారుల తప్పిదానికి ఏకంగా ప్రభుత్వమే బలయ్యేది. ఇంతటి తప్పు జరిగినా సంబంధిత అధికారులపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం ప్రభుత్వ పెద్ద మనసుకు నిదర్శనమేమో?!
చదవేస్తే ఉన్నమతి పోయే, కాకరకాయ కాస్తా కీకర కాయ అయినట్లుంది ఘనత వహించిన మన అధికారుల తీరు.
english title:
keekarakaya
Date:
Saturday, December 8, 2012