ఏలూరు, డిసెంబర్ 8 : కొల్లేరు సరస్సు కాలుష్యానికి నిలయంగా మారడం, అంతకుమించి ఆక్రమణల కోరల్లో చిక్కుకోవడంతో శీతాకాలం విడిది చేసే పక్షులకు ఆవాసం కరువైంది. దీంతో కొల్లేటిలో ఉండాల్సిన పక్షులు జనావాసాల మధ్య విడిది చేస్తున్నాయి. ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కొల్లేరు సరస్సుకి ఏటా అక్టోబర్- మార్చి నెలల మధ్య కాలంలో ఉత్తరాసియా, తూర్పు యూరప్ ప్రాంతాల నుంచి పక్షులు తాత్కాలికంగా వలస వస్తుంటాయి. ఇక్కడి మంచినీటిలో లభించే చేపలను ఆహారంగా తీసుకుని జీవించే కొంగల జాతికి చెందిన గ్రే పెలికాన్, ఆసియా ప్రాంతపు ఓపెన్ బిల్డ్ స్టార్క్స్, రంగురంగుల స్టార్క్స్, గ్లోసీ ఇబినస్, తెల్లటి ఇబినస్, టేల్స్, పిన్‌టైల్స్, పోవెలర్స్ లాంటి పక్షులతోపాటు రెడ్‌క్రెస్టెడ్, పాచర్డ్స్, నలుపు రెక్కలు వుండే స్టిల్స్ (నీటి కాకులు), ఆవోసెట్స్, కామన్ రెడ్ షాంక్స్, ఫ్లెమింగోలు, హెరాన్, నైజీరియన్స్ ఇలా ఇంకా ఎన్నో రకాల పక్షులు సైబీరియా, ఆస్ట్రియా దేశాల నుంచి వలస వస్తాయి. అయితే ఇప్పుడు పారిశ్రామిక వ్యర్ధాలు, పోలీ సైకిలిక్ యారోమాటిక్ కార్బన్లు, హానికరమైన క్రిమిసంహారక అవశేషాలు కొల్లేరులో కలుస్తుండటంతో సరస్సులో నీరు కలుషితమై విషతుల్యంగా మారింది. మరీ ముఖ్యంగా ఆక్రమణల విషయంలో 2006 కొల్లేరు ఆపరేషన్‌కు ముందు పరిస్థితే ఇప్పుడు కొల్లేరు సరస్సులో నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పక్షుల వలసకు ఈ కారణంగా అవకాశం లేకుండా పోయింది. దీంతో కొల్లేరులో ఆవాసం, రక్షణ లేక వలస వచ్చిన పక్షులు కొల్లేరు చుట్టుప్రక్కల గ్రామాల్లో చెట్లమీద, పుట్లమీద దర్శనమిస్తున్నాయి. కొంచెం బురద వుండి పచ్చటి గుబురులు, పొదలు ఎక్కడ కనిపిస్తే ఎక్కడ గూళ్లు కట్టుకుంటున్నాయి. నగరాలు కూడా ఇందుకు మినహాయింపు కాదంటే ఆశ్చర్యం కలగకమానదు. తాజాగా ఏలూరు శాంతినగర్‌లోని ఖాళీ స్థలాల్లో మొక్కల మధ్య గ్రే పెలికాన్, తెల్లటి ఇబిసెస్, నల్లటి రెక్కలుండే స్టిల్స్, లాంటి పక్షులు గత కొద్దిరోజులుగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఖాళీ స్థలాల్లో చెట్ల మధ్య గూళ్లు ఏర్పరచుకుని గుడ్లు పెట్టి వాటిని రక్షించుకుంటున్నాయి. అదే ప్రాంతంలో వున్న బురదగుంట్లలో చిన్ని చిన్ని పురుగులను ఆహారంగా తింటున్నాయి. ఇప్పటికైనా 1999 అక్టోబర్ 4న ప్రభుత్వం జారీ చేసిన 120 జీవోని యధాతధంగా అమలు చేయడంతోపాటు, 2001 జూలైలో న్యాయస్థానం ఆదేశించినట్లుగా సరస్సు గర్భంలో ఆక్రమణలను తొలగించి కొల్లేరు సరస్సుకు పూర్వవైభవం తీసుకురావడానికి అందరూ సమిష్టిగా కృషి చేయడమే తక్షణ అవసరం అని పలువురు భావిస్తున్నారు.
చినవెంకన్నను దర్శించిన మంత్రి పితాని
ద్వారకాతిరుమల, డిసెంబర్ 8: ప్రసిద్ధ క్షేత్రమైన ద్వారకాతిరుమలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పితాని సత్యనారాయణ శనివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ స్వామివారు, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ మండపంలో ఆయనకు అర్చకులు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు మంత్రికి శ్రీవారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.
జనావాసాల మధ్య కొల్లేటి పక్షులు
english title:
a
Date:
Sunday, December 9, 2012