కావలసినవి
బాస్మతి బియ్యం - 2 కప్పులు
ఉల్లిపాయ - 1
బీన్స్, కారట్ ముక్కలు - 1/4 కప్పు
బంగాళదుంప - 1
పనీర్ ముక్కలు -1/2 కప్పు
పచ్చి బఠానీలు - 1/4 కప్పు
పచ్చిమిర్చి - 3
పుదీనా ఆకులు -2 టీ.స్పూ.
కొత్తిమీర - 2 టీ.స్పూ.
అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
పెరుగు - 1/2 కప్పు
ఆరెంజ్ ఫుడ్ కలర్ లేదా
కుంకుమ పువ్వు - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - 4 టీ.స్పూ.
నెయ్యి - 1 టీ.స్పూ.
లవంగాలు - 4
యాలకులు - 3
దాల్చిన చెక్క - చిన్న ముక్క
షాజీరా - 1 టీ.స్పూ.
బిర్యానీ ఆకులు - 2
జాపత్రి పువ్వు - సగం ముక్క
ఇలా చేయాలి
కూరగాయలు, పనీర్‌ను అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కుంకుమ పువ్వు లేదా కలర్‌ని చెంచాడు వేడి పాలల్లో వేసి ఉంచాలి. బాస్మతి బియ్యం కడిగి అరగంట నాననివ్వాలి. తర్వాత రెండింతల నీళ్లు మరిగించి ఉప్పు, చిన్న దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, యాలకులు రెండేసి వేసి సగం ఉడికించి పెట్టుకోవాలి.
పాన్ లేదా మందపాటి గినె్నలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి పువ్వు షాజీరా వేసి కొద్దిగా వేపి కూరగాయ ముక్కలన్నీ వేయాలి. అందులో నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత పనీర్ ముక్కలు, పెరుగు కూడా వేసి కలిపి ఉప్పు సరి చూసుకోవాలి. ముక్కలన్నీ కొంచెం మగ్గి, మసాలాలన్నీ కలిసిన తర్వాత దింపేయాలి. ఒక బౌల్‌లో అడుగున సగం ఉడికిన అన్నం పరిచి దానిపైన కొద్దిగా కుంకుమ పువ్వు లేదా కలర్ నీళ్లు వేసి కూరను ఒక వరుసలో పరవాలి. దానిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర ఆకులు, వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. దానిపైన కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఆకులు వేయాలి.
ఇలా మొత్తం అన్నం, కూర ఐపోయేవరకు ఒకదానిపైన ఒకటి వరుసగా పరవాలి. చివరిగా పైన కొద్దిగా నెయ్యి వేసి మూతపెట్టి 210 డిగ్రీల మీద వేడి చేసిన ఓవెన్‌లో పెట్టి 180 డిగ్రీలవద్ద 15 - 20 నిమిషాల వరకు బేక్ చేయాలి. లేదా గాస్ మీద పెనం పెట్టి దానిపైన అన్నం, కూర అమర్చిన గినె్న పెట్టి దానిపైన బరువైన వస్తువు పెట్టి 15- 20 నిమిషాలు ఉడికించాలి. ఇదే దమ్ బిర్యానీ. ఈ బిర్యానీని పెరుగు పచ్చడి లేదా కుర్మాతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.