కొయ్యలగూడెం, డిసెంబర్ 8: గ్రామాలలో గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏలూరు ఎం.పి కావూరి సాంభశివరావు అన్నారు. మండలంలో శనివారం పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. మంగపతిదేవిపేటలో కావూరి సొంత నిధులతో నిర్మించిన 21 గ్రావెల్ రోడ్లను ప్రారంభించారు. అచ్యుతాపురంలో నిర్మించిన రెండు కిలోమీటర్ల గ్రావెల్ రోడ్డును ప్రారంభించారు. స్థానిక తహశీల్థార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నీలం తుఫాన్‌కు ఇళ్ళు కూలిపోయిన 15 మంది బాధితులకు ప్రభుత్వ సహాయం చెక్కులను పంపిణీ చేసారు. ఇదే కార్యక్రమంలో కావూరి పౌండేషన్ జన శిక్షణా సంస్థాన్‌లో కుట్టు శిక్షణ పొందిన 45 మంది మహిళలకు సర్ట్ఫికెట్లు అందజేసారు. ఇద్దరికి వడ్డీలేని రుణ సహాయం అందించారు. యర్రంపేటలో నీలం తుఫాన్‌కు ఇళ్ళు కోల్పోయిన ఐదుగురు బాధితులకు ప్రభుత్వ సహాయం చెక్కులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమాలలో పోలవరం ఎఎంసి ఛైర్మన్ జెట్టి గురునాధరావు, వైస్ ఛైర్మన్ మట్టా సత్తిపండు, కాంగ్రెస్ నేతలు నూపా పార్వతి, పోతన తాతారావు, మల్లాబత్తుల వెంకటేశ్వరరావు, నందియ్య, గెడా దామోదరరావు, మేకల ప్రసాద్, ముప్పిడి చినబాబు, సంకు కొండ తదితరులు పాల్గొన్నారు.
లవులో కలెక్టరు
ఆంధ్రభూమిబ్యూరో
ఏలూరు, డిసెంబర్ 8: జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్ రెండురోజులపాటు వ్యక్తిగత కారణాలపై శెలవులో వెళ్లారు. తిరిగి ఆమె సోమవారం జిల్లాకు చేరుకుంటారు.
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయరా!
కావూరి వద్ద కాంగ్రెస్ రైతుల ఆందోళన
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 8: వ్యవసాయానికి పట్టుమని రోజుకు గంట సేపు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతులు ఆందోళన వ్యక్తం చేసారు. పట్టణంలోని పోలవరం ఎఎంసి ఛైర్మన్ జెట్టి గురునాధరావు కార్యస్థానంలో కావూరికి శనివారం పలు వర్గాల ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. కాంగ్రెస్ నేత సత్రం లక్ష్మణరావు నాయకత్వంలో రైతలు విద్యుత్ సరఫరా పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. రోజుకు ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం గంట సేపు కూడా సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికే నీలం తుఫాన్ మూలంగా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, మరల తోటలు వేసుకుంటే విద్యుత్ సరఫరా లేక పోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్మామని, పొగాకు రైతులను దృష్టిలో పెట్టుకుని రోజుకు 7 గంటలు నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కావూరిని కోరారు. దీనిపై స్పందించిన కావూరి ఈ ప్రాంతంలో మూడు షిఫ్ట్‌ల క్రింద వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, నిరాటంకంగా ఏడు గంటలు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపారు. ఏజన్సీలో భూ వివాదాలతో నలిగి పోతున్నామని పలువురు గిరిజనేతర రైతులు కావూరికి ఫిర్యాదు చేసారు. తమకు పట్టాలు, పూర్తి హక్కులు ఉన్న భూముల్లోకి, కోర్టు ఉత్తర్వులు ఉన్న భూముల్లోకి గిరిజనులు ప్రవేశించి వ్యవసాయం అడ్డుకుంటున్నారని, తమ భూములకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన కావూరి పట్టా భూముల జోలికి వెళితే చర్యలు తీసుకోవాలని, 1/70 చట్టం మేరకు భూములపై హక్కులు కలిగిన గిరిజనేతర రైతులకు రక్షణ కల్పించాలని స్థానిక సి.ఐ పి.మురళీరామకృష్ణను ఆదేశించారు. నీలం తుఫాన్ మూలంగా మండలంలో దెబ్బతిన్న రహదార్లకు మరమ్మత్తులు చేయించాలని, ఏరియా ఆసుపత్రిలో సి.సి రోడ్డు నిర్మించాలని కాంగ్రెస్ నాయకుడు కఠారి సీతారాంబాబు కోరారు. ఏజన్సీలో నివసిస్తున్న గౌడ కులస్తులను ఎస్టీలుగా పరిగణించాలని భారత రాజ్యాంగంలోని 342వ ఆర్టికల్ చెబుతోందని, ఈ దిశగా ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఏజన్సీలోని గౌడ కులస్థులు ఎం.పి కావూరికి వినతి పత్రం సమర్పించారు.
మీడియాతో మాట్లాడేది లేదు: కావూరి
పట్టణంలోని ఎఎంసి ఛైర్మన్ జెట్టి గురునాధరావు కార్యస్థానానికి శనివారం వచ్చిన ఎం.పి కావూరి సాంబశివరావు మీడియాతో గానీ, కార్యకర్తలతో గానీ మాట్లాడేందుకు నిరాకరించారు. గురునాధరావు అడిగినప్పటికీ మీడియాతో మాట్లాడేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మీడియాతో మాట్లాడినా, కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడినా కావూరి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఉప ఎన్నికలప్పటి నుండి కావూరి ప్రతి పర్యటనలోను డిసిసిబి ఛైర్మన్ కరాటం రాంబాబుపై పరోక్ష విమర్శలు చేయడం, ఆపై ఆ వర్గం నేతల విమర్శలకు గురికావడం పరిపాటైంది. ఈ సారి ఆ పరిస్థితిని కావూరి అధిగమించేందుకే మీడియాతోను, కార్యకర్తలతోను మాట్లాడేది లేదని తన పని తాను చక్కబెట్టుకున్నారని రాజకీయ పరిశీలకులు విశే్లషించారు.
కొనుగోలు చేయకపోతే రంగుమారిన ధాన్యం కలెక్టరేట్‌కు తరలింపు
కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు హెచ్చరిక
తాళ్లపూడి, డిసెంబర్ 8: రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేసి రంగుమారిన ధాన్యాన్ని కలెక్టరేట్‌కు తరలిస్తామని కొవ్వూరు ఎమ్మెల్యే టివి రామారావు హెచ్చరించారు. తుపాను కారణంగా అధిక మొత్తంలో పంటలు నీట నాని మట్టి పట్టాయని, ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఆంక్షలు విధిస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. శనివారం సాయంత్రం గజ్జరంలోని రంగుమారిన ధాన్యాన్ని పరిశీలించేందుకు ఆయన పొలంబాట పట్టారు. రైతులు కొర్లపాటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు రంగు మారిన ధాన్యాన్ని చూపించి ఇబ్బందులు వివరించారు. మండలానికి వచ్చిన ఎమ్మెల్యే ధాన్యం పరిశీలించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. తుపాను కారణంగా పండిన పంటలో కొంత పంట నాశనమైపోగా మిగిలిన ధాన్యాన్ని విక్రయిద్దామంటే కొనుగోలు కేంద్రాల వద్ద అభ్యంతరాలు చెబుతున్నారని, రంగు మారిన ధాన్యమే కాని బియ్యం తెల్లగానే వున్నాయని, ప్రభుత్వం ఈ ధాన్యం కొనకుంటే వారికి ఆత్మహత్యలే శరణ్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కారణంగానే తాను ఉద్యమం చేపడతానని, వారం రోజుల్లోగా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయకుంటే ఈ ధాన్యాన్ని కలెక్టరేట్‌కు తరలిస్తామన్నారు. కార్యక్రమంలో పోతవరం, గజ్జరం, తాడిపూడి, అన్నదేవరపేట గ్రామాలకు చెందిన రైతులు, నాయకులు నామ శ్రీరాములు, కొఠారు వెంకట్రావు, అనపర్తి పరమేశ్వరరావు, చలపాటి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
ఉండి అక్విడెక్టుకు అదనంగా రెండు ఖానాల ఏర్పాటుకు
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
ఉండి, డిసెంబర్ 8: ఉండి అక్విడెక్టుకు అదనంగా రెండు ఖానాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హైదరాబాద్‌కు చెందిన ఇరిగేషన్ డిజైన్ ఇంజనీర్లు స్థానిక ఇరిగేషన్ అధికారులకు సిఫార్సు చేశారు. హైదరాబాద్ నుండి వచ్చిన డిజైన్ విభాగం డిఇలు శాస్ర్తీ, చంద్రశేఖర్లు ఉండి అక్విడెక్టును శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు అదనపు ఖానాలు వేయుటకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, ప్రాజెక్టు కమిటి ఛైర్మన్ పండురాజు మాట్లాడుతూ ఉండి అక్విడెక్టు పునర్నిర్మాణం, అదనపుఖానాలు వలన రైతులు పంట కోల్పోవలసిన అవసరం ఉండదని అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. అదనపు ఖానాల వలన అదనంగా స్థల సేకరణ కూడా అవసరముండదని, ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం నుండి డిఇ క్వార్టర్స్ పక్క నుండి నూతన నిర్మాణాలు చేపట్టవచ్చని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈమేరకు సర్వే జరిపి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో అక్విడెక్టును పూర్తిగా పునర్నిర్మాణం చేయాలని అధికారులు భావించారు. తిరిగి కొత్తవిధానం ఆచరించాలని ఇటీవల చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణారెడ్డికి ప్రాజెక్టు కమిటి ఛైర్మన్ ప్రతిపాదనలు పంపారు. దీంతో అంచనాలకు అధికారులు వచ్చారు.
బాతు ఆకారంలో బొప్పాయి
ద్వారకాతిరుమల, డిసెంబర్ 8: బాతు ఆకారంలో ఉన్న బొప్పాయి చూపరులను కనువిందు చేస్తోంది. వివరాల్లోకెళ్తే ద్వారకాతిరుమలలోని వసంతనగర్ కాలనీకి చెందిన పి బసవరాజు శనివారం సాయంత్రం తన తోటలో ఉన్న బొప్పాయి చెట్టుకు కాచిన కాయల్లో ఒకటి బాతు ఆకారంలో వింతగా ఉండటం గమనించాడు. బాతు ఆకారంలో ఉన్న ఆ కాయను కోసి బసవరాజు ఇంటికి తీసుకురాగా స్థానికులు తండోపడండాలుగా తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు.