ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశం జిల్లా
నేడు ఎటు చూసినా మన స్వాతంత్య్రానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులలో యువకుల కర్తవ్యం ఏమిటి?
దేశం గురించి ఆలోచించటం. నీతిమాలిన నేతలకు దేశాన్ని వదిలేయటం వల్ల అన్ని రంగాల్లో వాటిల్లిన అనర్థాలను నలుగురితో కలిసి చర్చించటం. ఎవరి వృత్తి, ఉద్యోగాలను వారు కొనసాగిస్తూనే వారానికి కనీసం కొన్ని గంటల సమయాన్ని దేశం కోసం, ధర్మం కోసం క్రమపద్ధతిన వెచ్చించటం. ఎవరి రంగంలో, ఎవరి పరిధిలో వారు పదుగురినీ కూడగట్టి పనికొచ్చే కార్యక్రమాన్ని ఎంచుకుని విడవకుండా సాగించటం.. ... !!
వరిగొండ కాంతారావు, హనుమకొండ
గుజరాత్‌లో మా పార్టీ విజయానికి ‘మేమంతా కలిసి పనిచేస్తాం’ అని పార్టీ అధ్యక్షుడు ప్రకటించుకోవాల్సిన దుస్థితిలో ఉన్న భారతీయ జనతాపార్టీ ‘దేశాన్ని మంచి స్థితిలోకి తీసుకొస్తా’మంటున్న మాటల్ని నమ్మవచ్చా?
దాని బడాయిలకేమొచ్చె!
పట్నాల సూర్యనారాయణ, రాజమండ్రి
కేజ్రీవాల్‌గారు భారతీయులు దాచిన నల్లధనం వివరాలు, దాచిన ప్లేస్, స్విస్ బ్యాంకుల్లో 700 మంది ఆరాలు విపులంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ గారు నల్లధనం వెలికితీయడంలో ఆలస్యం చేస్తున్నారు. నల్లధనం బయటపడితే భారత ప్రభుత్వం మంచి ఉన్నతస్థితిలో ఉంటుంది కదా. మీరేమంటారు?
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది.
కె.సతీష్‌బాబు, కడప
అన్ని పత్రికలూ ధరలు పెంచాయి కదా? మీ మా ఆంధ్రభూమిని కూడా పెంచవచ్చు కదా? రోజూ రూ.3/లు, ఆదివారం రూ.4/లుగా చేయవచ్చును? దీనికై మీ కామెంట్?
మీరు ‘్భమి’కి చదువరా? చందాదారా?
రాపర్తి ఆదినారాయణ, పిఠాపురం. తూ.గో.జిల్లా
పోలీసు ఆఫీసర్లుగాను, కానిస్టేబుల్స్ గాను డ్రెస్సులు వేయించి హాస్యపూరితంగాను పోలీసు వారిని వారి విధులలో ఎగతాళి పరిచే విధంగాను అనేక చిత్రాలు తీస్తున్నారు. ఇది ఆ శాఖ వారికి బాధ కలిగించదా?
కలిగించినట్టు లేదు. అందుకే సినిమా పోలీసులు పేట్రేగుతున్నారు.
తోట రమాదేవి, వినుకొండ
ఈ మధ్య విడుదలవుతున్న చిత్రాలన్నీ దాదాపు బూతులతో నిండి ఉంటున్నాయని చిత్ర సమీక్షలు చదివి సినిమా చూడాలంటేనే సిగ్గుగా అన్పిస్తుంది. మరి అటువంటి చిత్రాలలో నటించే నటుల, దర్శకత్వం వహిస్తున్న దర్శకుల, నిర్మాతల కుటుంబ సభ్యులు ఆ చిత్రాలను వీక్షించి సిగ్గు పడరా?
ఏమో!
సిహెచ్.ప్రతాప్, సూర్యాపేట, నల్గొండ జిల్లా
మన పూర్వీకులు ఎంతో శ్రమకొద్దీ గ్రంథాలయోద్యమం సాగించి ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. కాని ప్రస్తుతం పుస్తక పఠనాసక్తి తగ్గిపోవడం వలన గ్రంథాలయాలు నిస్తేజ స్థితిలో వున్నాయి. వీటిని కాపాడుకోవడం ఎలా?
పఠనాసక్తి తగ్గడం వల్ల కాదు. గ్రంథాలయాలని సరిగా నడిపే దిక్కులేక. హంగులు, వనరులు ఉన్నవాళ్లు కూడా దీనివైపు దృష్టి సారించక.
తాళాబత్తుల సత్యనారాయణ మూర్తి, మల్కాపురం, విశాఖపట్నం
కుటుంబ వార పత్రికలు అని పేరు పెట్టి, 50 పేజీలు సినీ తారల వొంపు సొంపులు ప్రదర్శిస్తూ బొమ్మలు, స్కిన్ గ్లామర్‌కి, జీరో సైజ్‌కి చిట్కాలు దట్టించి, లక్షల్లో సర్కులేషన్స్ పెంచుకుంటుంటే, ఇంకా తడి తట్టని భూమి లాంటి మడి పత్రికల్ని ఎవరు చూస్తారు?
మడి ఇష్టమైన వాళ్లు.
కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
విద్యారంగంలో ప్రస్తుతం పెద్ద పీట వేసుకొని, తిష్ట వేసిన కార్పొరేట్ సంస్థలు తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడతాయంటారా? అసలు తెలుగుకు తెగులు సోకింది ఈ వ్యాపార ధోరణి గల బడా సంస్థ ల వల్లనే అంటాను. మీరేమంటారు?
అవి కూడా ఒక కారణమే అంటాను. *
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : mvrsastry@deccanmail.com