సజీవ స్రవంతులతో జల ధారలతో కనువిందైన జలపాతాలతో నిత్య శోభితంగా ఉండే పశ్చిమ కనుమలు పుడమి నొసట దివ్వెలే. ప్రకృతిపరంగా సహజసిద్ధమైన సౌందర్యంతోపాటు ఆరాధనాయోగ్యమైన సౌరభాన్ని సంతరించుకున్న ఈ కనుమలు భారతావనికి రక్షణ కవచాలు. ప్రపంచ ప్రఖ్యాతిని సంతరించుకున్న ఈ కనుమలు జీవవైవిధ్యానికే కాదు, జీవాధారమైన అనేక ఔషధ మూలికలకు నిలయాలు. వీటిని కాపాడుకునేందుకు మరోసారి ప్రకృతి ఆరాధకులు నడుం బిగించారు. ఈ కనుమల
రక్షణే పుడమికి రక్షణ అన్న నినాదం మళ్లీ తెరపైకొచ్చింది.
ప్రకృతి సౌరభాలకు భారతావని పెట్టింది పేరు.. ఎన్నో సుజల స్రవంతులు, జీవనదులు, హిమానీనదాలతో అలరారే మన నేల జీవ వైవిధ్యానికి పట్టుగొమ్మ.. భారత సంప్రదాయాలకు, విశిష్టమైన భౌగోళిక సంపత్తికి చిహ్నంగా హిమాలయాలు, ఎన్నో, ఎనె్నన్నో పర్వత శిఖరాలు భాసిల్లుతున్నాయి... నింగిని తాకి.... నేలకు దివిటీ పడుతున్నట్టుగా గోచరించే ఈ పర్వత సముదాయాలు సమున్నత వారసత్వ సంపదకు, ప్రపంచంలోనే ఎక్కడా కనిపించనంతటి జీవ వైవిధ్యానికి నిదర్శనాలు.. పుడమి నొసట బొట్టుగా, జలధారగా భాసిల్లుతున్న పశ్చిమ కనుమలు ప్రకృతి విలక్షణతకు సలక్షణ రూపాలే..ఈ సమున్నత కనుమలకు జగతి నీరాజనం పలుకుతోందనడానికి యునెస్కో అందించిన ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపే చాలు..ప్రపంచంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు ఉన్నా..ఆయాదేశాలకు, ప్రాంతాలకు ప్రకృతి సౌరభాలు అందించే సహజ సౌధాలున్నా..మన పశ్చిమ కనుమలకు సాటి ఏదీ లేదు..ఈ కనుమల ప్రత్యేకత వేరు..వీటి భౌగోళిక ప్రాధాన్యత అత్యంత విశిష్టం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి..అంటే ఓ మూల నుంచి మరో మూలకు విస్తరించే పర్వత సముదాయాలనే ఉమ్మడిగా కనుమలని వ్యవహరిస్తాం..వింధ్య- సాత్పుర పర్వత సానువుల మీదుగా పశ్చిమ తీరం నుంచి దక్షిణముఖంగా విస్తరించే అత్యున్నత పర్వత సముదాయాల నిలయమే ఈ పశ్చిమ కనుమలు..అన్ని రకాల జీవ జాతులు నివసించగలిగే సానుకూల పర్యావరణ వ్యవస్థ ఈ కనుమల్లో కనిపిస్తుంది. నిత్యనూతనంగా విలసిల్లే అడవులెన్నో ఈ ప్రాంత అందాలను ఇనుమడింపజేస్తున్నాయి..చెట్లు చేమలు, విశిష్టమైన, అరుదైన మొక్కలెన్నింటికో ఈ ప్రాంతం ఆలంబనగా మారింది. తరతరాలుగా భారతీయ వైద్య విధానంలో ఉపయోగించే వనమూలికలెన్నో ఇక్కడి అడవుల్లో లభిస్తున్నాయి..అనేక సతత హరితారణ్యాలు కూడా ఈ కనుమల కనుసన్నల్లోనే ఉన్నాయి. అంబోలి, రాధానగరి ప్రాంతాలు ఈ రకమైన అడవులకు ప్రసిద్ధమైతే..ముల్సి, తదితర అడవులు ముందుంతురై ప్రాంతంలో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ప్రకృతి వరాలుగా, మానవాళికి ఇతోధిక సేవలు అందిస్తున్నవే. ఈ కనుమల పొడవునా కనువిందు చేసే ప్రకృతి అందాలెన్నో..ఎనె్నన్నో..ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూనే ఉన్నాయి. యునెస్కో నుంచి తాజాగా లభించిన ప్రపంచ పర్యాటక ప్రాంత గుర్తింపుతో పశ్చిమ కనుమలకు విశ్వ విఖ్యాతి లభించినట్టయింది. ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్న ఈ తరహా ప్రకృతి శోభిత ప్రాంతాలన్నింటికంటే తలమానికమైన పశ్చిమ కనుమలను రక్షించుకునే ప్రయత్నాలు దీర్ఘకాలంగానే సాగుతున్నాయి.
సహ్యాద్రి ప్రాంతంగా కూడా పేర్కొనే పశ్చిమ కనుమల్లోని పర్వత శ్రేణులన్నీ అనంతరమైన వైవిధ్యాన్ని కలిగి ఉన్నవేననడంలో ఎలాంటి సందేహం లేదు. డక్కన్ పీఠభూమి పశ్చిమ చివరి నుంచి ఉత్తరం నుంచి మొదలై దక్షిణ దిశగా సాగే ఈ కనుమలు అరేబియా తీర ప్రాంత పొడవునా ఉన్న అతి సన్నని తీర ప్రాంతం నుంచి డక్కన్ పీఠభూమిని విభజిస్తూ సాగుతాయి. తపతి నది దక్షిణంగా గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దుల సమీపంలో పశ్చిమ కనుమల వరుస మొదలు అవుతుంది. మహారాష్ట్ర, గోవా, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా సాగి దక్షిణ భారత చివర్న ఉన్న కన్యాకుమారి వద్ద ముగుస్తుంది. అంటే దాదాపు 1600 కిలోమీటర్ల మేర పశ్చిమ కనుమల సోయగాలు విస్తరించాయన్న మాట. ఈ పదహారొందల కిలోమీటర్లూ వేటికవే సాటి అన్నట్టుగా ప్రకృతి అందాల భరిణలుగానే ఉన్నాయనడం అతిశయోక్తి ఏమీ కాదు. పశ్చిమ కనుమలంటే పర్వతాల సముదాయాలేనన్న భావన బలంగా ఉంది. కానీ.. ఇక్కడ వేల కిలోమీటర్ల మేర విస్తరించినవన్నీ నిజమైన పర్వతాలేనా అన్న అనుమానం కూడా అడపాదడపా కనిపిస్తుంది. భౌగోళిక పరిభాషలో చెప్పుకోవాలంటే ఇవి నిజమైన పర్వత ప్రాంతాలేవీ కాదు. గోండ్వానా మహా ఖండం చీలిపోయిన సమయంలోనే పశ్చిమ కనుమలు ఆవిర్భవించినట్టుగా చెబుతారు. భౌగోళికంగా ఈ ప్రాంతం అత్యంత విలువైన, అరుదైన ఖనిజాలకు, శిలలకు కూడా ప్రసిద్ధి చెందిందే. ఇక్కడి ఉపరితల లోతుల్లో గ్రానైట్, సున్నపురాయి, ఇనుప, బాక్సైట్ ఖనిజాలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే గుర్తించారు.
సాత్పుర నుంచి విస్తరించిన పశ్చిమ కనుమల్లో ఉన్న పర్వతాలు రక్షణ కవచాలుగానే దేశానికి ఉపయోగపడుతున్నాయి. ఈ పర్వతాల సానువుల్లో విలసిల్లుతున్న పర్యాటక కేంద్రాలు ప్రకృతి ఆరాధకులకు నిత్య నూతనాలే. సహ్యాద్రి పర్వతాలు ఉత్తరం నుంచి మొదలవుతాయి. ఇవి అనేక విధాలుగా మానవుడికి ఉపయోగపడేవి కాబట్టే సహ్యాద్రి అన్న పేరు వచ్చింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మథేరా, లోనావాల-ఖండాలా, మహాబలేశ్వర, పంజగని, అంబోలి ఘాట్ మొదలైనవి ఈ పర్వత ప్రాంతాల్లో ఉన్న హిల్ స్టేషన్లు. కేరళ ప్రాంతంలో ఈ పర్వతాలకు సహాయ పర్వతమనే పేరు. వాయవ్య తమిళనాడులో ఉన్న నీలగిరి కొండల అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కొండల్లోనే ఉన్న ఊటీ హిల్ స్టేషన్ ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఈ కొండల్లో కేరళలో ఉన్న అనామడి శిఖరం పశ్చిమ కనుమల్లో ఉన్న పర్వతాల్లో కెల్లా అత్యంత ఎత్తయినది.
పశ్చిమ కనుమలంటే అక్కడి పర్వత సముదాయాలు, హిల్‌స్టేషన్ల కంటే తలచుకున్న వెంటనే కళ్లల్లో మెదిలేవి సెలయేటి ధారలు. కొండల మధ్య నుంచి వయ్యారంగా దిగే ఈ నీటి ధారలు ఎంత ఆస్వాదించినా తనివితీరని ఆనందాన్ని కలిగించేవే. ప్రకృతి వరంగా ఏర్పడిన ఈ సెలయేళ్ళతో పాటు మనిషి నిర్మించుకున్న అద్భుత నిర్మాణాలు కట్టడాలకూ పశ్చిమ కనుమలు ఆతిథ్యమిస్తున్నవే. నీలగిరి పర్వత సముదాయాల్లో 2500 మీటర్ల ఎత్తులో ఉన్న ఊటీ, 2285 మీటర్ల ఎత్తులో ఉన్న పళని కొండల్లో ఉన్న కొడైకెనాల్ ఇందుకు నిదర్శనాలు. ఈ కనుమల్లో అత్యంత పెద్ద సరస్సులు తమిళనాడులోనే ఎక్కువగా కనిపిస్తాయి. పశ్చిమ కనుమల్లో ఉన్న అనేక నదులు ఆయా ప్రాంతాలకు సజల స్రవంతులను అందిస్తున్నవే. భారతదేశంలో ఉన్న అనేక జీవనదులకు ఇవే ప్రాణాధారం. నిత్య శోభాయమానంగా విలసిల్లే ఈ కనుమలు అనునిత్యం యావద్భారతావనికి అటు వర్షపాతంతోపాటు, ఇటు నీటి శాతాన్ని తక్కువ కాకుండా అందిస్తూనే ఉన్నాయి. కృష్ణా, గోదావరి, కావేరి వంటి నదులు అత్యంత కీలకమైనవి. వీటి పరిధిలోని రాష్ట్రాలు తమ వ్యవసాయ, మంచినీటి అవసరాలకు వీటిపైనే ఆధారపడటం ఈ కనుమల ద్వారా ఈ ప్రాంతానికి లభిస్తున్న వరం. ఈ నదులన్నీ తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. అయితే పశ్చిమ దిశగా ప్రవహించే నదులు అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి. అయితే ఈ నదులు అత్యంత వేగంగా ప్రవాహ వేగాన్ని కలిగివుండటానికి కారణం అవి ప్రవహించే దూరం తక్కువ కావడమే. ఇలాంటి వాటిల్లో మదోవి, జువారి మొదలైనవి ఉన్నాయి. ఈ నదులన్నీ కూడా తమ నీటిని తిరిగి కేరళ, మహారాష్టల్రకు అందిస్తాయి. పశ్చిమ కనుమలకు తూర్పు దిశగా ప్రవహించే నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. వీటి ప్రవాహ వేగం తక్కువే. అంతిమంగా ఇవి కావేరి, కృష్ణా వంటి పెద్ద నదుల్లో విలీనమైపోతాయి. ఇక అతి పెద్ద ఉపనదుల్లో తుంగానది, భాద్రానది, భీమానది, ఘటప్రవ నది, హేమవతి నది మొదలైనవి ఉన్నాయి. అలాగే వీటితోపాటు చిత్తార్, మణిముత్తార్, కళావి, కుండలి, పెన్నార్, పెరియార్ వంటి చిన్న నదులు కూడా ఉన్నాయి. వేగంగా ప్రవాహాన్ని కలిగివున్న నదులు జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఆస్కారమిస్తున్నాయి. అనేక జలవిద్యుత్ కేంద్రాలు ఈ రకమైన నదులపైనే నిర్మితమయ్యాయి. మొత్తం పశ్చిమ కనుమల పొడవునా యాభైకి పైగా ప్రధాన ఆనకట్టలున్నాయి. 1900 సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ మహారాష్టల్రోని కొపోలి సమీపంలో తొలి ఆనకట్ట నిర్మితమైంది. మహారాష్టల్రోని కొయినా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, అలాగే కేరళలోని పరంబికుళం ఆనకట్ట, కర్నాటకలోని లింగన్‌మక్కి ఆనకట్ట మొదలైనవి విస్తృత స్థాయి విద్యుత్ అవసరాలకు నీటి పారుదల అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. కమనీయ జలపాతాలకు కనువిందైన వాటి సౌరభానికి పశ్చిమ కనుమలు నిరంతర సోపానాలే. కర్నాటకలోని జోగ్ జలపాతాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వర్షాకాల సమయంలో అనేక పర్వత ప్రాంతాలనుంచి ప్రవహించే నీరు ఈ జలపాతాలకు నిత్య శోభను అందిస్తోంది. కుంచికళ్, శివసముద్రం, ఉంఛలి మొదలైన జలపాతాలు నిరంతరం వేలాదిమంది పర్యాటకులు ఆస్వాదిస్తున్నవే. దక్షిణాసియాలోనే అత్యంత ఎత్తునుంచి దిగుతున్న జలపాతంగా జోగ్‌కు పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,001 జలపాతాలను సహజసిద్ధ అద్భుతాలుగా పేర్కొంటున్నారు. వాటిలో జోగ్ జలపాతానికి స్థానం లభించడం, పశ్చిమ కనుమలకు పరోక్షంగా లభించిన ఘనకీర్తి.
తరతరాలుగా జీవ జంతు వృక్ష జాతులకే కాకుండా మానవాళికి పెట్టనికోటగా ప్రకృతి వరప్రసాదంగా విశిష్టమైన సేవలందిస్తున్న పశ్చిమ కనుమలను పరిరక్షించుకునే ప్రయత్నాలు అక్కడి ప్రకృతి శోభను విలక్షణతను కాపాడుకునే బృహత్ కార్యక్రమాలు దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. వీటి పరిరక్షణకు సంబంధించి సంబంధిత రాష్ట్రాల్లో విస్తృతస్థాయిలో ఉద్యమాలు మొదలయ్యాయి. యునెస్కో అందించిన ప్రపంచ పర్యాటక హోదాతో పశ్చిమ కనుమల ప్రాముఖ్యత మరింత పెరిగింది. ప్రపంచ స్థాయిలో ఈ తరహాలో ఉన్న హెరిటేజ్ కేంద్రాలకు తీసిపోని రీతిలో పశ్చిమ కనుమలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక్కడి జీవవైవిధ్యానే్న కాదు, జీవనయోగ్యమైన వాతావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక, గోవా, గుజరాత్ వంటి రాష్ట్రాలకు చెందిన అనేకమంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు, పరిశోధకులు, కళాకారులు, ఈ కనుమలను రక్షించుకుని తద్వారా భరతమాత ప్రకృతి సౌరభాన్ని మరింత ఇనుమడింపజేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1987లోనే పశ్చిమ కనుమలను పరిరక్షించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అవి మొదలై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి తమ నిబద్ధతను చాటుకునేందుకు ఈ రాష్ట్రాల పర్యావరణ ఉద్యమకారులు సిద్ధమవుతున్నారు. మరోసారి పశ్చిమ కనుమల పట్ల ప్రజల్లో అవగాహనను, వాటి ప్రాధాన్యతను చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతిని ఆరాధించడమే కాదు, సహజసిద్ధమైన దాని సొగసును కాపాడుకోవడం కూడా మనిషి బాధ్యత. ప్రకృతిని మనం రక్షిస్తే అది మనకు కంచుకవచమే అవుతుంది. మానవాళినే లాలించి పాలించి అనేక విపత్తులనుంచి రక్షిస్తుంది. అలాంటి సహజసిద్ధమైన కంచుకోటలో పశ్చిమ కనుమలది అగ్రతాంబూలమే. వాటి రక్షణ, పరిరక్షణపైనే మన జీవన గతి, భవిష్యత్ తరాల విధి ఆధారపడి ఉంది. *
.................
వైవిధ్యానికి
పట్టుగొమ్మలు
పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యానికి పట్టుగొమ్మలు. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పది జీవ వైవిధ్య ప్రాంతాల్లో వీటికి నిరుపమాన స్థానం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5వేల రకాల పుష్పించే మొక్కలకు ఈ ప్రాంతం ప్రత్యేకం. అలాగే 508 పక్షి జాతులు, 179 ఉభయ చరాలకూ పశ్చిమ కనుమలు పెట్టని కోటలే. వీటి సంఖ్య ఇంతటితో సరి అనుకుంటే పొరపాటే..ఇంకా లెక్కలేనంతగా జీవ వైవిధ్యం ఈ కనుమల మాటున ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఒకప్పుడు ఉన్న జీవ, జంతు, వృక్ష జాతులేవీ నేడు లేవు. ఉన్న వాటిలో కూడా అనేకం ముప్పు ముంగిట్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అలాంటి అరుదైన 325 జాతులు ఈ కనుమల్లోనే కనిపిస్తాయి.
కంచుకవచాలే!
పశ్చిమ కనుమల్లో ఉన్న అత్యంత విస్తృతమైన అటవీ ప్రాంతాలు మానవాళికి ప్రకృతి పరమైన ఉత్పాతాల నుంచి కంచుకవచాలుగానే పని చేస్తున్నాయి. కాలుష్య కారణంగా సమతూకాన్ని కోల్పోతున్న పర్యావరణాన్ని రక్షించడంలో ఈ అడవులు నిర్వహిస్తున్న పాత్ర నిరుపమానం. పర్యావరణాన్ని తద్వారా వాతావరణాన్ని స్థిరీకరించడం ద్వారా ఈ అడవులు వర్షపాతంలో విపరీతమైన తేడాలు లేకుండా ప్రకృతికి వరాలే అవుతున్నాయి. అంతే కాదు తన చేష్టల ద్వారా, చర్యల ద్వారా వాతావరణంలోని కర్బన ఉద్గారాలను విసర్జిస్తున్న మానవుడు కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ పరిస్థితి చేయిజారకుండా ఉందంటే అందుకు ఈ అడవులే కారణమని చెప్పక తప్పదు.
పట్టణీకరణ ముప్పు
పశ్చిమ కనుమలు విస్తరించిన ప్రాంతంలో అనేక జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ముంబయి సమీపంలోని బోరివలి జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేక పక్షి జాతులకు ప్రత్యేకం. అలాగే బందీపూర్ సమీపంలో ఉన్న నాగర్‌హోల్ జాతీయ పార్కు కూడా చిరుతలకు, ఎలుగుబంట్లకు ప్రసిద్ధి. 250 రకాలకు పైగా పక్షులు ఈ కేంద్రంలో కనువిందు చేస్తాయి. తమిళనాడులో ఉన్న అన్నామలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సతత హరితారణ్యాలకు, ఎక్కువ ఎత్తు ఎదిగే గడ్డి మొక్కలకు తిరుగులేని ప్రాంతమే. కేరళలో ఉన్న పెరియార్ జాతీయ వన్య సంరక్షణ కేంద్రంలో మరెక్కడా లేనంత పెద్ద సంఖ్యలో ఏనుగులు కనిపిస్తాయి. అలాగే ఇతర రకాల జంతుజాతులూ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఇంత ఘనత కలిగిన ఈ సంరక్షణ కేంద్రాలకు పట్టణీకరణ ముప్పు గత ఐదు దశాబ్దాలుగా వెన్నాడుతూనే ఉంది. అనాలోచిత అభివృద్ధి విధానాల వల్ల వృక్ష, జంతు జాతులెన్నింటికో ముప్పు వాటిల్లింది. దీని వల్లే ఎన్నో అరుదైన జాతులు హరించుకు పోయాయి. మరిన్ని అందుకు సిద్ధంగా ఉన్నాయి!