మహబూబ్‌నగర్, డిసెంబర్ 9: మరోసారి తెలంగానం రాజుకుంది. 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వాదులు దీక్షలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ కేంద్రాలలో తెలంగాణ పోరు దీక్షకు బిజెపి శ్రేణులు శ్రీకారం చుట్టారు. మూడు రోజుల పాటు ఉపవాస దీక్షలకు కాషాయపు దండు కార్యకర్తలు దిగారు. అందులో భాగంగా జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు పద్మజారెడ్డి, బాలరాజు, నరేందర్, కృష్ణవర్ధన్‌రెడ్డిలు దీక్షకు దిగారు. అదేవిధంగా కల్వకుర్తిలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలు చేపట్టారు. నారాయణపేటలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ పాండురెడ్డి, తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్ నాగూరావు నామాజీలు దీక్ష చేపట్టారు. మక్తల్‌లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య ఆధ్వర్యంలో తెలంగాణ పోరు దీక్షకు దిగారు. దేవరకద్రలో నిర్వహించిన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపి ప్రసంగించారు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, గద్వాల, వనపర్తి, కొడంగల్, షాద్‌నగర్, జడ్చర్ల తదితర నియోజకవర్గ కేంద్రాలలో బిజెపి నాయకులు దీక్షలకు దిగారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన తెలంగాణ బిజెపి పోరు ఉపవాస దీక్షలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల ప్రతిసారి మోసం చేస్తూ వస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టేందుకు బిజెపి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చే సత్తా కాంగ్రెస్‌కు లేదని, కేవలం బిజెపికే మాత్రమే ఆ సత్తా ఉందని ఆయన తెలిపారు. ఈనెల 28న అఖిలపక్షం అంటూ మరో కొత్త డ్రామాకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టిందని ఆయన ఆరోపించారు. అయితే అఖిలపక్షాన్ని బిజెపి వ్యతిరేకిస్తుందని, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే అఖిలపక్షానికి బిజెపి ప్రతినిధి హాజరవుతారని వెల్లడించారు. అయితే ఒక పార్టీ నుండి ఒకే ప్రతినిధిని కేంద్ర ప్రభుత్వం పిలువాలని ఆయన డిమాండ్ చేశారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో వెయ్యి మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కాంగ్రెస్సే కారణమని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఢిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టిన తెలంగాణ విద్యార్థులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జీ చేయడం విడ్డూరమని అన్నారు. ఈ సంఘటనను బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు, షర్మిలలు ప్రత్యేక తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ వచ్చి తీరుతుందని, అందుకే తెలంగాణ ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని, కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని ఆయన ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో వస్తుందని, అయితే ఎవరంతకు వారు ఉద్యమాల పేరిట విడివిడిగా కార్యక్రమాలు చేస్తే తెలంగాణ వ్యతిరేకులకు అదో అలుసుగా మారుతుందని, అందుకే బిజెపి తెలంగాణను కోరుకునే సంఘాలన్నింటిని, రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి కృషి చేస్తుందని అన్నారు. ఉద్యమకారులంతా ఐక్యతతో ఉద్యమిస్తే కేంద్రం దిగిరాక తప్పదని, ఒకవేళ కేంద్రం దిగిరాకపోతే కాంగ్రెస్‌ను ఖతం చేసి తెలంగాణను ఐక్య ఉద్యమం ద్వారా సాధించుకోవడం తథ్యమని ఆయన అన్నారు.
తెలంగాణ సమస్యకు
రాజకీయ పరిష్కారమే మార్గం
ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 9: తెలంగాణ సమస్యకు రాజకీయ పరిష్కారమే ఏకైక మార్గమని ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నందుకే ఈనెల 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనుందని అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు స్పష్టమైన వైఖరి ఉందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ చొరవతోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. టిడిపి నాయకులు తాము లేఖ రాసినందుకే అఖిలపక్ష సమావేశం అంటూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు కారుస్తున్న ముసలి కన్నీరు సంగతి 28న తేలనుందని తెలిపారు. వైకాపా, తెలుగుదేశం పార్టీల బండారం బయట పడనుందని తెలిపారు. చంద్రబాబు, షర్మిల పాదయాత్రలు ప్రజలు విశ్వసించడం లేదని, వీరి పాదయాత్రలు చిరస్మరణీయంగా ప్రజలలో నిలువడం లేదని, ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. వారి పాదయాత్రల ద్వారా నాయకులు మాత్రం గ్రామాలను చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పాదయాత్రలు తమాషాగా మారాయని ఎద్దేవా చేశారు. పాదయాత్రల వల్ల జనంకు ఒరిగిందేమి లేదన్నారు. త్వరలోనే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి మార్పు అంటూ చేస్తున్న ప్రచారం అంతా బూటకమని, కొన్ని ప్రసార సాధనాలు కాంగ్రెస్‌పై గిట్టకనే అలా గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవతోనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు చట్టం తీసుకురావడం జరిగిందని అన్నారు. చంద్రబాబు, షర్మిల యాత్రలు ప్రజల కోసం కాదని, ప్రజల కష్టాలు తీర్చడానికి యాత్రలు చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. వారి యాత్రలు అధికార దాహం కోసమేనని ఆరోపించారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. డిసిసి అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్, రాములుగౌడ్, అల్త్ఫా హుస్సేన్, సిజె బెనహర్, అరుణ తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్ విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం
* నూతన మెను విడుదల
రాష్ట్ర సమాచారశాఖ మంత్రి డికె అరుణ
గద్వాల, డిసెంబర్ 9: వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మెస్‌చార్జిలు పెద్దఎత్తున పెంచి ఆదివారం నుంచి పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకున్నదని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి డికె అరుణ అన్నారు. ఆదివారం గద్వాల పట్టణంలోని బాలభవన్‌లో ఏర్పాటు చేసిన మంత్రి డికె అరుణ పాల్గొని ప్రభుత్వం ప్రకటించిన మెస్ చార్జీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వసతిగృహాల్లో ఉండే ఆరోగ్యం, విద్య నాణ్యత పెరగడానికి మెస్ చార్జీలు పెంచే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నేటి నుంచి వారంలో ఆరు రోజులు కోడి గుడ్లు, పండ్లు అందజేస్తామన్నారు. అదే విధంగా సాయంత్రం అల్పాహారం, వారంలో ఒకసారి స్వీట్లు, ఆదివారం గుడ్డుతో బిర్యాని ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో 3-7వ తరగతి చదివే విద్యార్థులకు రూ.530-850కు, ఇంటర్ నుంచి పీజి వరకు చదివే విద్యార్థులకు రూ.540-1050కు పెంచడం జరిగిందన్నారు. నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడంతో విద్యార్థులు శారీర దృడత్వంతో పాటు విద్యను పొందుతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో చదువుకుంటున్న విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి మెరిట్ మార్కులు సాధించే విధంగా కృషి చేస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ భారతిలక్పతినాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం వసతిగృహ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచడం ఎంతో గొప్ప కార్యక్రమమన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను ఆసరగా చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నారాయణరెడ్డి, సాంఘిక సంక్షేమ డిడి జయప్రకాష్, మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డంకృష్ణారెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాములు, బిసి వెల్ఫేర్ అధికారి రాములు, నాయకులు బిఎస్ కేశవ్, రామాంజనేయులు, డిటిడిసి నర్సింహ, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు జిఎల్ చందు, భాస్కర్‌యాదవ్, నాగేంధర్‌యాదవ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ఐక్యఉద్యమాలతోనే తెలంగాణ సాధ్యం
ఉపవాస దీక్షలో ఆచారి
కల్వకుర్తి, డిసెంబర్ 9: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు ఐక్య ఉద్యమాలే శరణ్యమని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి అన్నారు. కాంగ్రెస్‌కు తగిన శాస్తి చేస్తే తెలంగాణ సాధ్యమని చెప్పారు. పార్టీ రాష్టక్రమీటి నిర్ణయం మేరకు రెండురోజుల పాటు జరపతలపెట్టిన ఉపవాస దీక్షలను ఆదివారం కల్వకుర్తి జెఎసి శిబిరం వద్ద ప్రారంభించారు. ఈసందర్భంగా తల్లోజు ఆచారి కార్యకర్తలను, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సోనియా జన్మదిన కానుకగ వెలువడిన తెలంగాణ ప్రకటన ఎందుకు అమలు కావడం లేదని నిలదీశారు. బర్త్‌డే గిఫ్ట్ గురించి సోనియా వౌనిలా నోరు ముసుకొని కూర్చొవడం విచారకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇప్పటివరకు కాంగ్రెస్ ఆడిన దొంగనాటకాలు ఇక చాలన్నారు. అఖిలపక్షం ఏర్పాటుపై ఆ పార్టీనాయకులే తలొరకంగా మాట్లాడుతు అర్థం లేకుండా చేశారని ఆరోపించారు. సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో సమాధి కడితే రాష్ట్ర ఏర్పాటు తథ్యమన్నారు. సమైక్యపార్టీల జెండాలు మూసినంతకాలం తెలంగాణ ప్రజలు ప్రాణాలు పొగొట్టుకొవాల్సిందే తప్ప మరేమిలేదన్నారు. కడప, చిత్తూర్ నాయకుల కాళ్ళ చుట్టూ తిరగడం కంటే తెలంగాణ ప్రాంతంలో పిడికిలి బిగించడం ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొవచ్చని ఆచారి వెల్లడించారు. ఈ సమావేశంలో జెఎసి నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతు జెఎసి గొడుగు కింద అన్ని పార్టీలు ఎకమై సీమాంధ్రపార్టీలకు గోరికట్టి తెలంగాణ సాధించుకుందామన్నారు. లగడపాటికి తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ఆచారి దీక్షకు తెలంగాణ మజ్దూర్ యూనియన్, టియుటిఎఫ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించారు. ఈకార్యక్రంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కండె హరిప్రసాద్, నాయకులు న్యాయవాది కృష్ణయ్య, కృష్ణగౌడ్, రాఘవేంధర్‌గౌడ్, జెఎసి, ఉద్యోగ సంఘాల నాయకులు మొగులయ్య, బాలయ్య, రవీంధర్, సదానందంగౌడ్, జంగయ్య, శివలింగం, రాజేంధర్‌రెడ్డి, దుర్గాప్రసాద్, దేవిలాల్ చౌహాన్, తేజ్‌సింగ్ తదితరులతో పాటు తదితరులతో పాటు పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ ఇస్తారా ... చస్తారా?
కాంగ్రెస్ తేల్చుకోవాలి: నామాజీ
నారాయణపేటటౌన్, డిసెంబర్ 9: తెలంగాణ ఇస్తారా లేకపోతే రాజకీయంగా చస్తారా ఈ అంశాన్సిన కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలని బిజెపి తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్ నాగూరావు నామాజీ డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ఆదివారం నారాయణపేటలో నాగూరావు నామాజీతో పాటు బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యాక్షుడు కెంచె శ్రీనివాసులు చేపట్టిన మూడు రోజుల ఉపవాస పోరు దీక్షను అఖిల భారత వాణిజ్యపన్నుల అధికార అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి నాయకుడు శాంతికుమార్ పూలమాలలు వేసి ప్రారంబించారు. అంతకు ముందు స్థానిక సరాఫ్‌బజార్‌లో గల బాలాజీ మందిర్ నుండి బిజెపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి సత్యనారాయణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్దకు చేరుకుని దీక్షలో పాల్గొన్నారు. కాగా ఈ దీక్షలకు పట్టణంలోని మహిళా సంఘాలు, బ్రహ్మణ సమాఖ్యలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా నాగూరావు నామాజీ మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం కేంద్రంలోని యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా 12వందలకు పైగా తెలంగాణ విద్యార్థులు, యువత ఆత్మబలిదానాలకు కారణమైందన్నారు. నాడు ప్రకటించి నేడు తీరా అఖిలపక్షం అంటూ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పన్నాగాలకు ప్రజలు విసిగిపోయారన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారా చస్తారా అన్నది కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లేకపోతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు రాజకీయ సమాధి కడతారని హెచ్చరించారు. జిల్లా బిజెపి అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి మాట్లాడుతూ బిజెపితోనే తెలంగాణ సాధ్యమన్నారు. యుపిఎ ప్రభుత్వం తెలంసగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే ఎన్డీఎ సంపూర్ణ మద్దతు ప్రకటించి బిల్లును గెలిపించుకుంటుందన్నారు. లేకపోతే కేంద్రంలో ఎన్డీఎ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు శాంతికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పట్ల చిత్తశుద్ది లేదన్నారు. దేశాన్ని దోచుకునే ఎఫ్‌డిఐల అనుమతి కోసం అన్నీ పార్టీలు వ్యతిరేకించినా బిల్లు పెట్టి పార్టీలను భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి బిల్లును ఆమోదింపజేసుకుందన్నారు. అలాంటి ఘనత ఉన్న కాంగ్రెస్ సంకీర్ణ యుపిఎ ప్రభుత్వం తెలంగాణ బిల్లు పట్ల ఎందుకు ఆసక్తి చూయించడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇంచార్జి నర్సన్‌గౌడ్, నాయకులు గందె చంద్రకాంత్, జాజాపూర్ సిద్రామప్ప, ప్రభాకర్‌వర్దన్, బండి శివరాంరెడ్డి, బోయ లక్ష్మణ్, పస్పుల రవికుమార్, సత్యనారాయణ యాదవ్, మహిళామోర్చా నాయకురాళ్లు లక్ష్మీ శ్యాంసుందర్‌గౌడ్, సుజాత, విద్యావతి, ఉమేశ్, వెంకట్‌రెడ్డి, రాముల, సాయిబన్న, మనె్న వెంకట్రాములు, అయ్యళప్ప, మాణిక్‌నగరి, సిద్ది వెంకట్రాములు, సైదప్ప, అశోక్, మిర్చి వెంకటయ్య, విఠల్‌రావు లోమ్టే, ప్రభాకర్ రంగాపూరి తదితరులు పాల్గొన్నారు.
టిజెఎసి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 9: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని జిల్లా టిజెఎసి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. టిజెఎసి జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వందలాది మంది తెలంగాణ వాదులు పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టిఎన్‌జిఓ భవనం నుండి తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని స్మరిస్తూ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. అదేవిధంగా తెలంగాణ స్ఫూర్తి దినంతో సిపిఐ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ విద్రోహ దినంతో సిపిఐ ఎంఎల్-న్యూడెమోక్రసీ నాయకులు విద్రోహ దినాన్ని పురస్కరించుకుని ర్యాలీ చేపట్టారు. తెరాస నాయకులు సైతం జెఎసి ర్యాలీలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా క్లాక్‌టవర్‌లో నిర్వహించిన ర్యాలీలో టిజెఎసి చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వెయ్యి మంది యువకులు, విద్యార్థులు ప్రాణాలను బలిదానం చేసినా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తక్షణమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఆ పార్టీని తెలంగాణలో ప్రజలు కనుమరుగు చేయడం ఖాయమని హెచ్చరించారు.
ఢిల్లీలో పాలమూరు విద్యార్థుల అరెస్టు
విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాలమూరు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీలో పాలమూరు జిల్లాకు చెందిన విద్యార్థి జెఎసి నాయకులు సుదీప్, విష్ణులు గాయపడ్డారు. ఢిల్లీలో 26 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తే అందులో 16 మంది పాలమూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఉన్నారు. అరెస్టు అయిన వారిలో జిల్లాకు చెందిన విద్యార్థి జెఎసి నాయకులు కరాటే రాజు, మున్నూరు రవి, విష్ణు, ప్రసాద్, శరత్, నిఖిల్, వెంకటేష్‌తో పాటు పలువురు ఉన్నారు.
‘తెలంగాణకు అడ్డుతగిలే పార్టీలు గల్లంతు’
కోయిలకొండ, డిసెంబర్ 9: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అడ్డుతగిలే పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధం కావాలని టిఆర్‌ఎస్ జిల్లా కోకన్వీనర్ బెక్కం జనార్దన్ పిలుపునిచ్చారు. ఆదివారం టిఆర్‌ఎస్ పల్లెబాటలో భాగంగా కోయిలకొండ మండలం అభంగపట్నం గ్రామంలోని సమస్యలను ప్రజల వద్ద అడిగి తెలుసుకున్నారు. 60 సంవత్సరాలుగా తెలంగాణ వనరులను సీమాంధ్ర నాయకులు దోచుకోవడం జరిగిందని జనార్దన్ ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కాంగ్రెస్ మంత్రులు ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ పార్టీలు అఖిలపక్షంలో తెలంగాణకు వ్యతిరేకంగా గళం విప్పితే తెలంగాణ ప్రాంతంలో పార్టీలను తూడ్చివేయడం ఖాయమని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని వర్గాల వారు కలసికట్టుగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చెన్నకేశవులు, నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జి సరాఫ్ నాగరాజు, మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, నాయకులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, విష్ణు, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అంటే
ముఖ్యమంత్రికి అంత అలుసా
టిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆగ్రహం
జడ్చర్ల, డిసెంబర్ 9: తెలంగాణ ఉద్యమ పోరాటం అంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అంత అలుసు ఎందుకని టిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జడ్చర్లలో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేకం కామంటున్న సీమాంధ్ర నాయకులు అనుకూలమని ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. తెలంగాణను ఆంద్రోళ్లు ఏలుతున్నారని, అందుకే తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ నా సొత్తు అని ఒకరు అంటుంటే.. తెలంగాణ ఉద్యమం నేను మూడవ తరగతి నుంచే చూస్తున్నానని అవహేళన చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా సీమాంధ్ర పార్టీలకు బుద్ది చెబుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉమాశంకర్‌గౌడ్, యూసుఫ్, రవిశంకర్, దేవా, శ్రీకాంత్, ఇమ్మూ పాల్గొన్నారు.
నిబంధనలు పాటించకుంటే ఆర్‌బిసిలు రద్దు
ప్రత్యామ్నాయ పాఠశాలల జిల్లా సమన్వయ కర్త సుధాకర్‌రెడ్డి
కోస్గి, డిసెంబర్ 9: ప్రభుత్వ నిబంధనల మేరకు రాజీవ్ విద్యామిషన్ ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యామ్నాయ పాఠశాలల నిర్వాహకులు నిబంధలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో సంబంధిత పాఠశాలలను రద్దు చేస్తామని ప్రత్యామ్నాయ పాఠశాలల జిల్లా సమన్వయ కర్త సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం కోస్గి పట్టణంలోని బిసి కాలనీలో డబ్ల్యుసిడిఎస్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రత్యామ్నాయ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. హాజరు పట్టికలో 55 మంది విద్యార్థులు ఉన్నప్పటికినీ పాఠశాలలో కేవలం 35 మంది విద్యార్థుల ఉపస్థితి ఉండటం పట్ల నిర్వాహకులను మందలించారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, 0-5 సంవత్సరాలలోపు పిల్లలను పాఠశాలలో చేర్చుకోవద్దని, నాణ్యమైన బోధన అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం సుధాకర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్, మద్దూరు మండలాల్లో కూడా ఆర్‌బిసి కేంద్రాలను సందర్శించామని, దౌల్తాబాద్ మండల కేంద్రంలో పీపుల్స్ సర్వీస్ సొసైటీ అనే సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్‌ఎస్‌సిసి కేంద్రంలో ఒకే విద్యార్థి ఉండటం, అదేవిధంగా ఈర్లపల్లి గ్రామంలో హెల్ఫ్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్‌ఎస్‌సిసి కేంద్రంలో కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉపస్థితి అయ్యారని, మద్దూరు మండల కేంద్రంలో గల మరో ఆర్‌ఎస్‌సిసి కేంద్రంలో కూడా విద్యార్థులు లేకపోవడం వల్ల ఈ మూడు కేంద్రాలను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్‌ఎస్‌సిసి కేంద్రాలను సందర్శించిన వారిలో ఆర్‌విఎం ప్లానింగ్ అధికారి గోపాల్ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే ఎల్లారెడ్డి
ధన్వాడ, డిసెంబర్ 9: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి అన్నారు. ఆదివారం ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మాట్లాడుతూ పాఠశాలల అదనపు గదుల నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. అనంతరం గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో నూతనంగా ప్రతిష్టించిన ధ్వజ స్తంభానికి ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శారదనందిని, పంచాయతీరాజ్ ఎఇ కొండయ్య, టిడిపి ధన్వాడ మండల కన్వీనర్ యుగంధర్‌రెడ్డి, నాయకులు బాలరాజు, మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.