Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కెసిఆర్ సభకు భారీ ఏర్పాట్లు

$
0
0

నిజామాబాద్, డిసెంబర్ 9: కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు సన్నిహితుడిగా కొనసాగిన ప్రముఖ వ్యాపారవేత్త బస్వ లక్ష్మినర్సయ్య టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. సాయంత్రం 4గంటలకు నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరిస్తున్నారు. కెసిఆర్ వెంట టిఆర్‌ఎస్ ముఖ్య నేతలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, కెటిఆర్‌తో పాటు జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్ తదితరులు సైతం తరలిరానున్నారు. దీంతో అట్టహాసంగా టిఆర్‌ఎస్‌లో చేరాలన్న సంకల్పంతో లక్ష్మినర్సయ్య గత వారం పదిరోజుల నుండి జన సమీకరణ యత్నాల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు టిఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్‌గా కొనసాగుతూ వచ్చిన ఆలూర్ గంగారెడ్డికి గత రెండు రోజుల క్రితమే జిల్లా అధ్యక్ష పదవిలో నియమిస్తూ పూర్తిస్థాయి జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలను కట్టబెట్టారు. దీంతో గంగారెడ్డి కూడా కెసిఆర్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను రప్పించేందుకు సన్నాహాలు చేసినట్టు స్పష్టమవుతోంది. నిజామాబాద్ అర్బన్‌తో పాటు రూరల్ సెగ్మెంట్ల నుండి జన సమీకరణకు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. ఇటీవలే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో వస్తున్నా..మీకోసం పాదయాత్ర నిర్వహించిన దృష్ట్యా, కెసిఆర్ సభకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. తన పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఒకింత ఎక్కువ మోతాదులోనే టిఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు గుప్పించారు. తెలంగాణ సెంటిమెంటు ముసుగులో కెసిఆర్ తన పబ్బం గడుపుకోవడం మినహా, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఏనాడూ పాటుపడలేదంటూ దాదాపుగా అన్ని సభల్లోనూ చంద్రబాబు దుమ్మెత్తిపోశారు. కెసిఆర్ వల్ల తెలంగాణకు ఒనగూరిన ఎలాంటి లబ్ధి చేకూరకపోగా, ఆయన కుటుంబీకులకు మాత్రం రాజకీయ కొలువులు సంపాదించి పెట్టాడంటూ ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి నోచుకుందని, బాబ్లీ సమస్యపై పోరుబాట చేపట్టి స్వయంగా తాను మూడు రోజుల పాటు మహారాష్ట్ర పోలీసుల నిర్బంధంలో గడిపానని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర కార్మిక శాఖా మంత్రిగా కెసిఆర్ కొనసాగిన సమయంలోనే బీడీ కట్టలపై పుర్రె, ఎముకల గుర్తులు తెచ్చారని, లక్షలాది మంది గల్ఫ్ బాధిత కుటుంబాలను గోడును పట్టించుకోవడం లేదని ఘాటైన విమర్శలు చేశారు. పనిలోపనిగా టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధపడ్డారంటూ ప్రతి సభలోనూ చంద్రబాబు తెరాసను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటి బహిరంగ సభలో తెరాస అధినేత కెసిఆర్ సైతం టిడిపినే టార్గెట్‌గా మార్చుకుని ఎదురుదాడికి దిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఎఫ్‌డిఐలపై రాజ్యసభలో నిర్వహించిన అవిశ్వాసం ఓటింగ్‌కు టిడిపికి చెందిన ముగ్గురు ఎంపిలు గైర్హాజరైన విషయాన్ని ఉటంకిస్తూ కెసిఆర్ విరుచుకుపడడం ఖాయమని తెరాస శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా, ఈ నెల 28వ తేదీన కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశం నేపథ్యంలోనూ కెసిఆర్ బహిరంగ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో బహిరంగ సభకు పెద్దఎత్తున జన సమీకరణ జరిపి, కెసిఆర్ పర్యటనను విజయవంతం చేయాలన్న పట్టుదలతో టిఆర్‌ఎస్ నేతలు ముమ్మర కసరత్తులు కొనసాగిస్తూ తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కెసిఆర్ సభను విజయవంతం చేయడం ద్వారా జిల్లాలో పల్లెబాట, బస్తీబాట కార్యక్రమానికి మరింత ఊపు తేవాలని పట్టుదలతో గులాబీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఎంఐఎం చేజారడంతో మారనున్న సమీకరణలు
కాంగ్రెస్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా బహిరంగ సభలు
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, డిసెంబర్ 9: గడిచిన చాలాకాలం నుండి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ, కాంగ్రెస్‌కు దూరం కావడంతో రాజకీయ సమీకరణల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌తో విభేదించిన ఎంఐఎం, అధికార పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకుసాగుతామని ప్రకటించింది. ఈ మేరకు ముస్లిం మత సంస్థలకు చెందిన ప్రతినిధులను కూడగట్టుకుని ముమ్మర ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఖిల్లా రోడ్‌లో పెద్దఎత్తున నిర్వహించిన బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇదివరకు బహిరంగ సభల్లో ఎంఐఎం నేతలు బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌లను లక్ష్యంగా చేసుకుని, పరోక్షంగా కాంగ్రెస్‌ను సెక్యులర్ పార్టీగా తలకెత్తుకునేవారు. అందుకు భిన్నంగా శనివారం నాటి సభలో ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసి, ఇతర ముస్లిం సంస్థల మతపెద్దలందరూ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్‌గా చేసుకుని ఘాటైన విమర్శలతో తమదైన శైలిలో ఆవేశపూరిత ప్రసంగాలు చేశారు. కాంగ్రెస్ హయాంలో ముస్లిం మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలను ఏకరువు పెడుతూ, మతతత్వ శక్తులతో కుమ్మక్కై మైనార్టీల మనోభావాలను కాలరాస్తోందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కారణాలు ఏవైనప్పటికీ ఇలా ఒక్కసారిగా ఎంఐఎం పార్టీ ప్లేటు ఫిరాయించడం కాంగ్రెస్‌కు ఒకింత నష్టం కలిగించే పరిణామమేనని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు ముంచుకొచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఎంఐఎం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి పూనుకోవడంతో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని భావిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, బోధన్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అర్బన్ సెగ్మెంట్‌లో ఓటర్ల సంఖ్య 2లక్షల వరకు ఉండగా, అందులో అత్యధికంగా ముస్లిం మైనార్టీల ఓట్లు 50వేల పైచిలుకు ఉండడంతో అభ్యర్థుల గెలుపోటముల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో మైనార్టీలు పోలింగ్‌కు దూరం కావడం వల్ల బిజెపి తరఫున యెండల లక్ష్మినారాయణలు వరుస విజయాలు నమోదు చేశారు. అంతకుముందు ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతూ వచ్చారు. స్థానికంగా మైనార్టీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, ఎంఐఎం పార్టీ ఎన్నడు కూడా శాసనసభ ఎన్నికల బరిలో తలపడేందుకు ఆసక్తి కనబర్చకపోగా, పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచింది. ఎన్నికల్లో పోటీ చేయాలంటూ మైనార్టీల నుండి ఒత్తిడి వచ్చిన సందర్భాల్లోనూ ఎంఐఎం పార్టీ నేతలు కాంగ్రెస్‌తో దోస్తీకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీతో విభేదించిన దరిమిలా, నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్‌లో వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తామని బహిరంగ సభలో ప్రకటించారు. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా నిలుస్తూ వచ్చిన ముస్లిం మైనార్టీలలో అత్యధిక మంది ఎంఐఎం వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయని, ఫలితంగా కాంగ్రెస్ ఓట్లకు గణనీయంగా గండిపడుతుందని అంచనా వేస్తున్నారు. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న బోధన్, కామారెడ్డి నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలాఉండగా, భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఎంఐఎం కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుందని, జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సిపికి చేరువై తనకు పట్టు ఉన్న ప్రాంతాల్లో బలోపేతం కావడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మరింత క్రియాశీలక పాత్ర పోషించాలనే వ్యూహంతో ముందుకెళ్తోందని స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని ఎంఐఎం నేతలు బహిరంగంగా వెల్లడించనప్పటికీ, సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో తమ బలాన్ని 14సీట్లకు పెంచుకుంటామంటూ బహిరంగ సభలో ప్రకటించడం ద్వారా ఎంఐఎం పార్టీని మరింతగా విస్తరిస్తామనే సంకేతాలను అందిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్‌కు అంటిపెట్టుకుని ఉన్న ఎంఐఎం ఆ పార్టీకి దూరం కావడంతో రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని పరిశీలకులు విశే్లషిస్తున్నారు.

తెలంగాణపై కేంద్రం నాన్చుడు ధోరణి
బిజెపి నేత విద్యాసాగర్‌రావు విమర్శ
భీమ్‌గల్, డిసెంబర్ 9: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని బిజెపి జాతీయ నాయకుడు సిహెచ్.విద్యాసాగర్‌రావు విమర్శించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ పోరు దీక్ష శిబిరాన్ని ఆదివారం భీమ్‌గల్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం, సీమాంధ్ర నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గిందన్నారు. గడిచిన మూడేళ్ల నుండి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ వస్తోందని, కమిటీల పేరిట కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. తాజాగా ఈ నెల 28వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో మరో ఎత్తుగడ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటును కోరుతూ ఈ ప్రాంత ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమిస్తుంటే, ఇక్కడి నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేకుండా, కేవలం తమ పదవులను కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తుండడం వల్ల దీనిని జీర్ణించుకోలేక 900మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అయినప్పటికీ కేంద్రానికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ, సీమాంధ్ర పాలకుల అవినీతి, వివక్షత వల్ల తెలంగాణ అభివృద్ధికి దూరంగానే ఉండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రానికి ఆది నుండీ కాంగ్రెస్ పార్టీయే అడ్డంకిగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే, సంపూర్ణ మద్దతు తెలిపేందుకు బిజెపి సిద్ధంగా ఉందన్నారు. 1969లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 369మంది విద్యార్థులను కాల్చి చంపించారని ఆరోపించారు. యుపిఎ సర్కార్ తెలంగాణ పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తూ విద్యార్థుల బలిదానాలకు కారణమవుతోందని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. తెలంగాణలో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొంతమంది ఆంధ్రా పాలకులు లేనిపోని ఆరోపణలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేవలం సీమాంధ్రకు చెందిన కొంతమంది పెట్టుబడిదారులైన నాయకులు మినహా దేశ వ్యాప్తంగా ప్రజలందరూ తెలంగాణ కోరుకుంటున్నారని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాల ఆలోచనలను విడనాడి, రాజీలేని పోరాటం ద్వారా తెలంగాణను సాధించుకునేందుకు ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నాన్చుడు ధోరణిని విడనాడి, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను మోసగించే ప్రయత్నాలకు స్వస్తి పలకాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా చైతన్యవంతులుయ్యారో, తెలంగాణలోనూ ప్రజలు చైతన్యవంతులై ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందామని ఆయన కోరారు. తెలంగాణలోని విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను తెలంగాణ ఉద్యమంలో పెద్దఎత్తున భాగస్వాములు చేయాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి చేపట్టిన పోరుదీక్షలో తెలంగాణవాదులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అన్ని పార్టీలకు చెందిన ఈ ప్రాంత నాయకులు ప్రజల ఆకాంక్షను గుర్తించి, ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోందని విద్యాసాగర్‌రావు ఆరోపించారు. పేద, మధ్యతరగతి ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే, రాష్ట్రంలో కిరణ్ సర్కార్ పదవులను కాపాడుకునేందుకే పరిమితమవుతోందని విమర్శించారు. నిత్యవసర సరుకులతో పాటు వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ రుయ్యాడి రాజేశ్వర్, మండల పార్టీ అధ్యక్షుడు జగన్, మాజీ జడ్పీటిసి ప్రకాశ్‌గౌడ్, టిఆర్‌ఎస్ కన్వీనర్ దొన్కంటి నర్సయ్య, భీమ్‌గల్ మండల ఉద్యోగ జెఎసి కన్వీనర్ గట్టు ఈశ్వర్, న్యూడెమోక్రసీ నాయకుడు కె.రాజేశ్వర్, ఖాజామొహియుద్దీన్‌తో పాటు తెలంగాణవాదులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

భార్య, కుమార్తెను కడదేర్చిన కానిస్టేబుల్
మృతదేహాలతో బంధువుల రాస్తారోకో
నిజామాబాద్ టౌన్, డిసెంబర్ 9: జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఆదివారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. తాగుడు, పేకాటకు బానిసగా మారిన ఓ పోలీసు కానిస్టేబుల్ కట్టుకున్న భార్యను, కన్న కూతురును అతి దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అయితే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆలి, బిడ్డలను కాటికి పంపిన కిరాతకుడిని తమకు అప్పగించాలంటూ మృతదేహాలతో బంధువులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన వివరాలు మృతుల బంధువులు, స్థానికుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన తొందూరు వెంకటేశ్ కామారెడ్డి డివిజన్ తాడ్వాయి మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి పదేళ్ల క్రితం నగరంలోని గాజుల్‌పేట్‌కు చెందిన బెల్లాల్ వనజతో వివాహం జరిగింది. వీరికి ప్రజ్ఞశ్రీ (7), ఉమాకాంత్(5) సంతానం. అయితే గత కొంతకాలంగా వెంకటేశ్ తాగుడుకు బానిసగా మారాడు. ఈ క్రమంలోనే పేకాట ఆడుతూ తరుచూ డబ్బుల కోసం భార్యను వేధించసాగాడు. ఇటీవలే భార్య వనజ మెడలోనున్న బంగారు గొలుసును అమ్ముకుని పేకాటకు తగలేశాడు. నిత్యం తాగి వచ్చి మద్యం మత్తులో భార్యను చితకబాదేవాడు. గత ఆరు మాసాల క్రితం భర్త చిత్రహింసలు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయిన వనజ, ఆ తర్వాత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ భిక్కనూరు సిఐని కౌన్సిలింగ్ చేయాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించిన సిఐ ఎదుట తాను ఇక నుండి బాగానే ఉంటానని భార్యను ఇబ్బందులకు గురి చేయనని మొరపెట్టుకున్నాడు. గతంలోనూ అనేక పర్యాయాలు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగి వెంకటేశ్‌ను మందలించినట్లు బంధువులు తెలిపారు. భార్యతో బాగానే ఉంటానని నమ్మించిన వెంకటేశ్‌లో ఎలాంటి మార్పు రాకపోగా తాగుడుకు మరింత బానిసగా మారాడు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి వరకు చిత్తుగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే భార్య, కూతురు, కొడుకు ఇంట్లో నిద్రిస్తున్నారు. తాగి వచ్చిన వెంకటేశ్ తలుపులు బాదుతూ హంగామా చేశాడు. వనజ తలుపులు తీయగానే ఆక్రోశంతో ఇంట్లోకి వెళ్లిన వెంకటేశ్ ఆమెను రోకలిబండతో చితకబాదాడు. ఈ దాడిలో వనజ తల పగిలిపోగా అనంతరం ఆమె మెడను నులిమాడు. వనజ అరుపులకు మేల్కొన్న కూతురు ప్రజ్ఞశ్రీ తల్లిని కొట్టవద్దంటూ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అదే సమయంలో కొడుకు సైతం లేచి తండ్రి దారుణాన్ని చూసి భయంతో పక్క గదిలోకి వెళ్లి తల దాచుకున్నాడు. అప్పటికే విచక్షణను కోల్పోయిన వెంకటేశ్ కన్న కూతురు అని కూడా చూడకుండా రోకలిబండతో ప్రజ్ఞపై దాడి చేశాడు. దీంతో ఆ చిన్నారి తీవ్ర గాయాలపాలై అక్కడిక్కక్కడే మృతి చెందింది. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న భార్య సైతం మృతి చెందడంతో ఇద్దరి మృతదేహాలను అక్కడే ఉంచి వెంకటేశ్ తాగిన మైకంలో నిద్రలోకి జారుకున్నాడు. ఆదివారం ఉదయం నిద్రలేచిన తరువాత పక్క గదిలో పడుకున్న తన కొడుకును తీసుకుని బయటకువచ్చాడు. శవాలను ఇంట్లోనే ఉంచి బయట నుండి తాళం వేసి, ఇక్కడే ఆడుకో ఇప్పుడే వస్తానంటూ కొడుకును ఇంటి ముందు వదిలి తనంతటతానే మూడవటౌన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపొయాడు. నగర సిఐ సైదులు, త్రీటౌన్ ఎఎస్‌ఐ భద్రయ్య సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తాళం తీసి చూడగా తల్లి, కూతురు శవాలు పక్కపక్కనే రక్తపు మడుగులో పడి ఉన్నాయి. సంఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు అక్కడికి చేరుకుని, ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కానిస్టేబుల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితున్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ తల్లి, కూతురు మృతదేహాలతో దుబ్బ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారికి నచ్చచెప్పినా, సాయంత్రం వరకు కూడా ఆందోళన విరమించలేదు. ఈ సంఘటన నగరంలోని దుబ్బ, గాజుల్‌పేట్‌లలో విషాదాన్ని నింపింది.

తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని పిడిఎస్‌యు ర్యాలీ
నిజామాబాద్ టౌన్, డిసెంబర్ 9: కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటూ, తక్షణమే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని పిడిఎస్‌యు నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం సుభాష్‌నగర్‌లోని నిర్మల హృదయ పాఠశాల నుండి కలెక్టరేట్‌లోని ధర్నా చౌక్ వరకు ర్యాలీ జరిపారు. అనంతరం మానవహారంగా ఏర్పడి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు నాయకుడు ఎం.సుధాకర్ మాట్లాడుతూ, నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కదం తొక్కడంతో బెంబేలెత్తిన యుపిఎ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను చేపడుతున్నామని ప్రకటించిందన్నారు. సాక్షాత్తూ అప్పటి కేంద్ర హోంశాఖా మంత్రి చిదంబరం అధికారికంగా ఈ ప్రకటన చేశారని, అనంతరం సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గి కొద్ది గంటల్లోనే ఈ ప్రకటనను వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు కృత్రిమంగా రాజీనామాల డ్రామాను తెరపైకి తెచ్చి, నోట్ల కట్టలతో ఢిల్లీ పెద్దలను ఏమార్చిన ఫలితంగానే వచ్చిన తెలంగాణ దూరమైందని ఆరోపించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతున్న భారతదేశంలో, సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనకు కూడా విలువ లేకుండాపోయిందని, అధికారికంగా చేసిన ప్రకటన నుండి వెనక్కి తగ్గడం ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్ఠను మసకబారేలా చేసిందని దుయ్యబట్టారు. గడిచిన 56 సంవత్సరాల నుండి సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారుల దోపిడీ, అణిచివేతకు గురవుతున్న తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడే న్యాయం జరుగుతుందని, అందువల్లే అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి చేరి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు చేయడం మినహా, మరో ప్రత్యామ్నాయం లేదని, ఈ విషయాన్ని గుర్తిస్తూ కేంద్రం ఇప్పటికైనా పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పుట్టిన రోజు కానుకగా అభివర్ణించిన కాంగ్రెస్ నేతలు, డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేలా ఒత్తిడి తేవాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు నగర కార్యదర్శి ప్రగతి, కల్పన, సుజిత్, ఎస్.ప్రశాంత్, అబ్బు, అరుణ, సాయినాథ్, స్వేచ్ఛ, హారిక, రమ, శేఖర్, దినేష్, భరత్, భజరంగ్, బాలకృష్ణ, సంగీత, సునీత, సంధ్యతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు సన్నిహితుడిగా కొనసాగిన ప్రముఖ
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles