Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

$
0
0

వరంగల్, డిసెంబర్ 9: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మాట తప్పిన యుపిఎ ప్రభుత్వ మోసాన్ని నిరసిస్తూ డిసెంబర్ తొమ్మిదవ తేదీని వాగ్ధాన భంగదినంగా పాటిస్తూ ఆదివారం సిపిఐ ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డిసెంబర్ తొమ్మిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణను వెంటనే రోడ్‌మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పాతరేస్తారని హెచ్చరించారు. ఈనెల 28వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు కూడా కాలయాపన చేసేందుకేనని, అఖిలపక్షంతో ఒరిగేదేమి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించకుండా కమిటీలు, అఖిలపక్షం పేర్లతో డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ఎంపి లగడపాటి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా హైదరాబాద్‌పై చేస్తున్న ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్ తెలంగాణ ప్రజల సొత్తు అని అన్నారు. తెలంగాణపై మోసపూరిత వైఖరి అవలంభిస్తున్న కాంగ్రెస్, టిడిపి, వైఎస్సార్ సిపిలు ఇపటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా వ్యవహరించాలని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ కార్యదర్శి సిరబోయిన కరుణాకర్ మాట్లాడుతూ లోక్‌సభలో ఎఫ్‌డిఐ, అణు ఒప్పందం బిల్లులను ఆమోదించుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై మాత్రం దాటవేయడం మోసపూరితమని అన్నారు. సమైఖ్యవాద పార్టీలకు 2014లో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలీ ఉల్లా ఖాద్రీ, మహిళా సమాఖ్య జి.రమాదేవి, సిపిఐ నాయకులు రాజేష్, సతీష్, రాజు, రూప, లలిత, శ్రావణి పాల్గొన్నారు.
వరంగల్‌లో...
సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వరంగల్ హెడ్‌పోస్ట్ఫాస్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో రాస్తారోకో చేపట్టి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి మేకల రవి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టే ప్రధాన శత్రువు అని అన్నారు. సోనియాగాంధీ తన పుట్టినరోజు కానుకగా తెలంగాణను ప్రకటించి మాట తప్పారని విమర్శించారు. దాంతో ఆత్మహత్యలు జరిగాయని, తెలంగాణవాదులపై అక్రమకేసులు బనాయించి నిర్భంధించడానికి కుట్రలు పన్నారని ఆరోపించారు. పారా మిలటరీ బలగాలతో రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయువులతో తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు సిపిఐ రాజీలేని పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు
* 66 కిలోల కేక్ కట్ చేసిన ఎంపి సిరిసిల్ల
హన్మకొండ, డిసెంబర్ 9: యుపిఎ చైర్‌పర్సన్, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 66వ జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ ఆధ్వర్యంలో డిసిసి భవన్‌లో సోనియా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని 66 కిలోల బర్త్‌డే కేక్‌ను వరంగల్ ఎంపి సిరిసిల్ల రాజయ్య కట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ అనుబంధ సంఘ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్, మాజీ జడ్పీటిసి సభ్యుడు ఘంటా నరేందర్‌రెడ్డి, మేకల బాబురావు, బియబాని, కిషన్, సదానందం, రమాకాంత్‌రెడ్డి, చిన్నాల సరళదేవి పాల్గొన్నారు. కాగా వరంగల్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సందుపట్ల ధన్‌రాజ్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ 66వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని హన్మకొండ టిటిడి కల్యాణమండపం సమీపంలోని స్పేస్ బ్లైండ్ స్కూల్‌లోని అంధ విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పేస్ బ్లైండ్ స్కూల్ నిర్వాహకులు శోభాభాస్కర్, సుమన్‌రాధిక, యువజన కాంగ్రెస్ నాయకులు వీరన్న, కరణ్, జుబేర్, ఫిరోజ్ పాల్గొన్నారు.

షార్ట్ సర్క్యూట్‌తో రెండు షాపులు దగ్ధం
* రూ. 1.50 కోట్ల ఆస్తి నష్టం
వరంగల్ బల్దియా, డిసెంబర్ 9: ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఆయిల్, ఆటోస్పేర్‌పార్ట్సు రెండు షాపులు దగ్ధమై సుమారు 1.50కోట్ల ఆస్తినష్టం జరిగిన సంఘటన శనివారం అర్థరాత్రి వరంగల్‌లోని ఆటోనగర్‌లో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన జి.మహేందర్ అనే వ్యక్తి నగరంలోని ఆటోనగర్‌లో రాయల్ ఆయిల్ షాపు, కన్నయ్య అనే వ్యక్తి కన్నయ్య ఆటో ఏజన్సీ ఆటో స్పేర్‌పార్ట్సు షాపును నడుపుతున్నారు. వీరిద్దరు ఎప్పటిలాగానే శనివారం రాత్రి షాపులను మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు. అర్థరాత్రి దాటిన తరువాత ప్రమాదవశాత్తు ఈ షాపులలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఒక షాపు నుంచి మరోషాపుకు మంటలు వ్యాపించడంతో షాపులలోని లూబ్రికెంట్ ఆయిల్, టైర్లు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిబూడిదకావడంతో సుమారు 1.50కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. అయితే పక్కనే నూతనంగా నిర్మించుకున్న ఇంటిలో గృహప్రవేశం ఉండడంతో అక్కడ ఉన్నవారు మంటలను చూసి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగిసి పడుతున్న మంటలను ఆర్పివేశారు. లూబ్రికెంట్ ఆయిల్ షాపు, టైర్ల షాపు కావడంతో మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమపడి మంటలను అదుపుచేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నికి ఆహుతైన షాపుల పక్కనే అన్ని షాపులు ఆటోమొబైల్స్‌కు సంబంధించిన కావడం, ఒకదాని తరువాత మరొకటి షాపుకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను ఆర్పివేశారు.

బిజెపి పోరు దీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 9: కేంద్రప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదవతేదీన తెలంగాణ అనుకూల ప్రకటనచేసి మోసం చేయడాన్ని నిరసిస్తూ భారతీయ జనతాపార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండ చౌరస్తాలో తెలంగాణ పోరుదీక్ష చేపట్టారు. ఈ దీక్షలను పొలిటికల్ జెఎసి జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ప్రారంభించారు. దీక్షలలో బిజెపి, జెఎసి నాయకులు శేషు, సుధాకర్, కోలా జనార్దన్, కత్తి వెంకటస్వామి, అశోక్‌రెడ్డి, రాజేశ్వర్, బుచ్చిబాబు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కూర్చున్నారు. ఈ దీక్షా కార్యక్రమాన్ని ఉద్ధేశించి జెఎసి చైర్మన్ పాపిరెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ డిసెంబర్ తొమ్మిదవతేదీన కేంద్రప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు అనుకూల ప్రకటన చేసి మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఓట్లతో కేంద్ర, రాష్ట్రాలలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. చర్చలు, సంప్రదింపులు, ఏకాభిప్రాయం, అఖిలపక్షం పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. 2009 డిసెంబర్ తొమ్మిదవతేదీన కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేసారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోవడాన్ని నిరసిస్తూ 78 గంటల నిరవధిక నిరాహరదీక్ష చేపడుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 117 నియోజకవర్గ కేంద్రాలలో ఈ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో బిజెపి ఉపవాస నిరాహారదీక్ష చేపట్టిందని పేర్కొన్నారు. సమైక్యవాద పార్టీలు కాంగ్రెస్, టిడిపి, వైఎస్సార్ సిపి కుమ్మక్కై తెలంగాణకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణకు అడ్డుపడుతున్న సమైక్యవాద పార్టీలను బొందపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. సీమాంధ్ర పార్టీలు చేస్తున్న మోసంతో తెలంగాణ ప్రజలు నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసిన జాతీయ పార్టీ బిజెపి ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని జోస్యం చెప్పారు.
వరంగల్‌లో...
బిజెపి అర్బన్ పార్టీ అధ్యక్షుడు చింతాకుల సునిల్ అధ్యక్షతన నగరంలోని పోచమ్మమైదాన్ సెంటర్‌లో పోరుదీక్ష చేపట్టారు. ఈ దీక్షలను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగాల సమ్మిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుపిఎ ద్వంద నీతి కారణంగా డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటించి వెనుకకు తీసుకుని కపట నాటకం ఆడుతోందని ఆరోపించారు. యుపిఎ కుటిల నీతిని ప్రజలకు తెలపాలనే ఉద్ధేశంతో తెలంగాణ జిల్లాల్లో బిజెపి పోరుదీక్ష చేపట్టిందని అన్నారు. ఈ దీక్షలకు వరంగల్ తూర్పు నియోజకవర్గ జెఎసి కన్వీనర్ జోగు చంద్రశేఖర్, నాగవెల్లి సాంబయ్య, మంద కుమార్‌మాదిగ, పుట్ట రవిమాదిగ, వరంగల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ దీక్షలో బిజెపి నాయకులు సముద్రాల పరమేశ్వర్, ఎరుకల రఘునారెడ్డి, కుసుమ సతీష్, పుప్పాల రాజేందర్, మార్టిన్ లూథర్ పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలు జరిపించకపోవడంతో
గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధి
* టిడిపి జిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క
పరకాల టౌన్, డిసెంబర్ 9: కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం లేకనే స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆదివారం పరకాల ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలు జరిపించకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోయిందన్నారు. గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి జరుగాలంటే టిడిపి అధినేత చంద్రబాబు వలనే సాధ్యమనే విషయం ప్రజల్లో ఆలోచన వచ్చిందని పేర్కొన్నారు. అందుకోసం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన మీ కోసం పాదయాత్ర ఇప్పటి వరకు 68 రోజుల్లో 1200 కిలోమీటర్లు చేపట్టారని, ఈ వయస్సులో కూడా పాదయాత్ర చేయడంపై ప్రజల్లో టిడిపి పట్ల విశ్వాసం కలుగుతోందన్నారు. తెలంగాణకు టిడిపి వ్యతిరేకం కాదన్నారు. ఈనెల 28న అఖిల పక్ష సమావేశంలో ఒక్కొక్క పార్టీ నుండి ఒకరినే పిలవాలన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు టిడిపిని టార్గెట్ చేయడం శోచనీయమన్నారు. తెలంగాణకు మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను విమర్శించకుండా టిడిపిని విమర్శించడం సరైంది కాదన్నారు. త్వరలో జరగబోయే స్థానిక , సహకార ఎన్నికల్లో టిడిపి జెండాలను ఎగురవేయాలన్నారు. అలుపెరగకుండా ప్రజల కష్టాలు, సమస్యలు తీర్చడానికి చంద్రబాబునాయుడు ఈనెల 25న జిల్లాకు వస్తున్నాడని చెప్పారు. 25న చిట్యాల మండలం వెల్లంపెల్లిలో బాబు అడుగుపెడతాడని, అక్కడ నుండి రాఘువరెడ్డిపేట, ఇస్సిపేటలో బస చేయడం జరుగుతుందని చెప్పారు. ఇస్సిపేట నుండి ప్రారంభమైన పాదయాత్ర పరకాలకు చేరుకుంటుందని రాత్రి పరకాలలో బస చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పరకాల నుండి శాయంపేట మీదుగా ఆత్మకూర్‌కు అక్కడ నుండి మల్లంపెల్లికి అక్కడ నుండి నల్లబెల్లికి చేరుకుంటుందన్నారు. బాబు పాదయాత్ర కోసం రూట్‌మ్యాప్ చేస్తూ సర్వే చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబునాయుడు రోజుకు 15 కిలోమీటర్లు నడుస్తున్నారని రైతులు, విద్యార్థులు, ప్రజలను కలుస్తూ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో వస్తున్న స్పందన చూసి టిఆర్‌ఎస్, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని, వారు చేస్తున్న ఆరోపణలు తక్షణమే మానుకోవాలన్నారు. ప్రాజెక్టు పేరులతో బాగుపడింది అధికార పార్టీ నాయకులే తప్ప రైతులు, ప్రజలు కారన్నారు. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల రుణ మాఫిపైనే మొదటి సంతకం చేస్తారని చెప్పారు. చంద్రబాబునాయుడి పాదయాత్రకు భారీ సంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా, మండల నాయకులు పావుశెట్టి వెంకటేశ్వర్లు, విజయపాల్‌రెడ్డి, పావుశెట్టి సుకన్య, భీమురెడ్డి నాగిరెడ్డి, పంచగిరి శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.

వైభవంగా శివపార్వతుల కల్యాణం
* తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు
హన్మకొండ, డిసెంబర్ 9: నగరంలోని రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక మాస చివరి ఏకదశి సందర్భంగా జరిగిన శ్రీ్భవాని-రుద్రేశ్వరుల కల్యాణమహోత్సవానికి నగరానికి చెందిన భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శివపార్వతులను ప్రతిష్టింపజేసి దేవాలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు సత్యనారాయణశర్మ, మణికంఠశర్మ, ప్రవీణ్‌శర్మ కల్యాణ ఘట్టాన్ని వేదోక్తంగా వందలాది భక్తుల సమక్షంలో కమనీయంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి శ్రీ్భవాని, రుద్రేశ్వరస్వామిలకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఉదయం రుద్రేశ్వరస్వామి, మూలగణపతికి ఏకదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. శుభిక అలంకారాలతో విగ్రహ ప్రతిష్టాపన చేసి జిలకర, బెల్లం సమర్పించి సుమూహుర్త సావదన అంటూ మంత్రోక్త సంకల్పంతో పాదప్రక్షాళన, నూతన మంగళ సూత్ర పూజ, గౌరిపూజ నిర్వహించారు. మాంగళ్య తంతునానే అంటూ శ్రీస్వామి అమ్మవారికి మాంగళ్యధారణ, కంకణధారణ గావించారు. లగ్నాష్టకాలు, మహాచూర్ణిక, నాగవెళ్లి, కండషోపచార పూజ, మహానివేదన, మహాహారతి, మహామంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగాలు జరిగాయి. 51మంది ఉభయదాతలైన దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య నాయకుడు గట్టు మహేష్‌బాబు దంపతులు, జిల్లా మున్నూరు కాపుసంఘం నాయకుడు మాడిశెట్టి సాంబయ్య దంపతులు, రుద్రేశ్వర సేవా సమితి ప్రతినిధులు కృష్ణామాచారి, శంకర్‌నారాయణ, ఆలయ ఇఓ రాజేందర్‌బాబు పాల్గొన్నారు.

సంస్థాగత ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
హన్మకొండ, డిసెంబర్ 9: సంస్థాగత ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టిఆర్‌ఎస్ శ్రేణులను మాజీ డిజిపి పేర్వారం రాములు కోరారు. ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 37వ డివిజన్‌లో బస్తీబాటను పేర్వారం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు అడ్డుపడుతున్న సమైక్యవాద పార్టీలను భూస్థాపితం చేయాలని కోరారు. 2009 డిసెంబర్ తొమ్మిదవ తేదీన తెలంగాణకు అనుకూల ప్రకటన చేసిన కేంద్రప్రభుత్వం సీమాంధ్ర పెట్టుబడిదారులకు తలొగ్గి ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకుందని ఆరోపించారు. వెయిమంది విద్యార్థులు, యువకులు తెలంగాణకోసం ఆత్మబలిదానాలు చేసుకున్నా కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ పట్టించుకోవడంలేదని అన్నారు. రాబోయే ఎన్నికలలో తెలంగాణకు అడ్డుపడుతున్న సమైక్యవాద పార్టీలను భూస్థాపితం చేయడానికి యావత్ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్, నాయకులు మర్రి యాదవరెడ్డి, కోరబోయిన సాంబయ్య, కపిలవాయి రాంబాబు, శ్రీ్ధర్, వాసుదేవరెడ్డి, కమరున్నీసాబేగం, రహమున్నీసాబేగం, లలితా యాదవ్ పాల్గొన్నారు.

హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం అందించకపోతే
వార్డెన్‌లపై కఠిన చర్యలు
* ఎటిడబ్ల్యూఓ రమాదేవి
మహబూబాబాద్ టౌన్, డిసెంబర్ 9: హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకపోతే వార్డెన్‌లపై కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ ఏటిడబ్ల్యూఓ రమాదేవి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం పట్టణంలోని గిరిజన హాస్టల్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంఘీక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు పెంచిన మెస్‌చార్జీలు, కొత్త మెనూ నేటి నుంచి అమల్లోకి వచ్చిందని అన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్, పాఠశాలల్లో 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు రూ. 750, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 850 మెస్‌చార్జీలను పెంచినట్లు ఆమె తెలిపారు. కాగా ఆమె ఈ రాత్రి హాస్టల్‌లోనే నిద్ర చేస్తున్నట్లు తెలిపారు.
హాస్టళ్లను సందర్శించిన అధికారులు
నేటి నుంచి కొత్తమెనూ అమలులో ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని జమాండ్లపల్లి, ముత్యాలమ్మగూడెం హాస్టళ్లను మహబూబాబాద్ ఎంపిడిఓ సాయిచరణ్ సందర్శించారు. రెడ్యాల హాస్టల్‌ను డిప్యూటీ తహశీల్దార్ రమేష్‌బాబు, విఆర్‌ఓలు సందర్శించారు. పట్టణంలోని ఎస్సీ హాస్టల్, ఎస్సీ-ఎ,సి,ఇ హాస్టళ్లను ఎంఇఓ నల్ల లింగయ్య సందర్శించారు. అలాగే బీసి హాస్టల్‌ను మండల స్పెషల్ అధికారి లక్ష్మీనారాయణ సందర్శించారు. బిసి బాలికల హాస్టల్‌ను ఎంఆర్‌ఐ తరంగిణి సందర్శించారు. ఇతర హాస్టళ్లను ఆర్‌ఐ సందర్శించి, అక్కడే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా.. లేదా.. అని పరిశీలించడానికి అక్కడే ఈ రాత్రి నిద్రచేస్తున్నారు.
తొర్రూరులో..
తొర్రూరు: సంక్షేమ హాస్టళ్ల పనితీరును తెలుసుకునేందుకు జెసి ఆదేశాల మేరకు మహబూబాబాద్ ఆర్డీఓ తొర్రూరులోని ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ను ఆదివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనం పెట్టే విధానం, విద్యావలంటీర్ల పనితీరు, ఆహారం, మంచినీటి పరిశుభ్రతపై ఆరాతీశారు. 45 మంది విద్యార్థులే హాస్టల్‌లో ఉండడంతో వార్డెన్ చంద్రశేఖర్‌పై ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవు దినం కాబట్టి ఇంటికి వెళ్లినట్లు వార్డెన్ ఆర్డీఓకు చెప్పారు. వార్డెన్‌లు అందుబాటులో లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఆర్డీఓ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆర్డీఓతో పాటు తహశీల్దార్ శ్రీరాం మల్లయ్య, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
నెల్లికుదురులో..
నెల్లికుదురు: మండలంలోని కస్తూర్బా విద్యాలయం సాంఘీక సంక్షేమ వసతిగృహంలో మండల తహశీల్దార్ నునావత్ పాండురంగ, ఎంపిడిఓ కె. ఆరోగ్యం బసచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకే ఆదివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాస్టల్ నిద్ర చేస్తున్నట్లు వారు తెలిపారు.
కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
హన్మకొండ రూరల్, డిసెంబర్ 9: భవన నిర్మాణ కార్మికుల తరహా బీడీ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఎపి బీడీ అండ్ సిగార్ వర్కర్స్‌యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల చక్రపాణి అన్నారు. ఆదివారం హన్మకొండలోని యూనియన్ జిల్లా కార్యాలయంలో బీడీ కార్మికుల సమావేశం పి.అన్నపూర్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ బీడీ కార్మికులకు ఆకు, పొగాకు తక్కువగా ఇవ్వడంతో బీడీ కార్మికులు నెలకు సరిపడా పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బీడీ పరిశ్రమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బీడీ పరిశ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలని లేకుంటే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. వచ్చేనెల 4,5,6వ తేదీల్లో నగరంలో ఆల్ ఇండియా బీడీ ఫెడరేషన్ మహాసభను నిర్వహిస్తున్నామని ఈ సభను బీడీ కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు సత్తిరెడ్డి, సురేష్, లింగయ్య పాల్గొన్నారు.

తెలంగాణ రోడ్‌మ్యాప్ ప్రకటించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి
english title: 
d

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>