ఏలూరు, డిసెంబర్ 9 : జిల్లా ఎన్నికల సంగ్రామంలో తొలి అడుగు పడింది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చూపిస్తున్న దూకుడుకు తగ్గట్టుగానే తన సైన్యాన్ని కూడా సిద్ధం చేసింది. ఎన్నికల పోరులో సత్తా చూపేందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా స్టీరింగ్‌కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా మండల, పట్టణాలకు బాధ్యులను కూడా నియమించింది. దీంతో జిల్లాలో కీలక పక్షాలుగా వున్న కాంగ్రెస్, టిడిపి, వై ఎస్ ఆర్ సిపిల్లో వై ఎస్ ఆర్ సిపికి మాత్రమే ప్రస్తుతం జిల్లా కార్యవర్గం ఏర్పడినట్లుగా భావించాల్సి వుంటుంది. టిడిపికి జిల్లా అధ్యక్షురాలి ప్రకటన కొద్దికాలం క్రితమే జరిగినా గతంలో ఎన్నడూ లేని రీతిలో కార్యవర్గం ఏర్పాటు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. దానికి తగ్గట్టుగా అనుబంధ సంఘాల విషయంలోనూ ఈ సందిగ్ధం కొనసాగుతూ వచ్చింది. ఇక అధికారపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా కార్యవర్గం విషయంలో ఎటూ తేల్చుకోలేని స్థితిలో చిక్కుకుంది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా కొత్తపల్లి సుబ్బారాయుడు కొద్దికాలం క్రితమే నియమితులైనా ఇటీవలే ఆయన ప్రమాణస్వీకారం చేశారు. త్వరలోనే కమిటీలను ప్రకటిస్తానని కూడా స్పష్టం చేశారు. ఏది ఏమైనా మూడు ప్రధాన పక్షాల్లో వై ఎస్ ఆర్ సిపి స్టీరింగ్ కమిటీని ప్రకటించి ఎన్నికల పోరులో తొలి అడుగు వేసినట్లే భావించవచ్చు. త్వరలో జరగనున్న సహకార ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని కూడా ఆ పార్టీ నేతలు ధీమాగా ప్రకటనలు చేస్తున్నారు. ఆదివారం స్థానిక వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి చిర్ల జగ్గారెడ్డి, జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్టీరింగ్ కమిటీ, మండల, పట్టణ కన్వీనర్ల జాబితాలను విడుదల చేశారు. దీని ప్రకారం చూస్తే ప్రస్తుతానికి 153 మందితో స్టీరింగ్ కమిటీ రూపుదిద్దుకుంది. కులాలు, వర్గాలు, ప్రాంతాల ప్రాతిపదికన స్టీరింగ్ కమిటీలో నేతలు కొలువుతీరడం విశేషం. ఇక మండల, పట్టణ కన్వీనర్ల జాబితాను కూడా విడుదల చేశారు. కాగా ఈ జాబితాలోనూ ఉంగుటూరు నియోజకవర్గం, ఏలూరు నియోజకవర్గాల పరిధిలో కన్వీనర్ల ఖరారు ఇంకా పూర్తికావాల్సి వుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఏది ఏమైనా దాదాపు అన్ని మండలాలకు, పట్టణాలకు బాధ్యులను గుర్తించడంలో వై ఎస్ ఆర్ సిపి ముందడుగు వేసినట్లే కనిపిస్తోంది. విలేఖరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రానున్న సహకార సంఘాల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. అదే ఊపులో ఆ తరువాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా తమ హవా చూపుతామని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్, టిడిపిలపై ఆ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని ధ్వజమెత్తారు. గతం నుంచి తమ పార్టీ చెబుతున్న ఈ రహస్య ఒప్పందం ఎఫ్‌డి ఐల బిల్లు ఓటింగ్ సందర్భంగా బయటపడిందని పేర్కొన్నారు. టిడిపి ఎంపిలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించి ఓటింగ్‌కు గైర్హాజరు కావడం ఆ రహస్య ఒప్పందంలో భాగమేనని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ దిగజారుతున్న రాజకీయ విలువలకు నిలయంగా మారిందని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీల రహస్య ఒప్పందం కారణంగానే ఏ తప్పు చేయని పార్టీ అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం తమతోనే వున్నారని, రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఈ అంశాన్ని స్పష్టం చేస్తామని వారు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాతపాటి సర్రాజు, ఇందుకూరి రామకృష్ణంరాజు, తోట గోపి, గాదిరాజు నాగరాజు, గూడూరు ఉమాబాల, దిరిశాల వరప్రసాద్, బివి రమణ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన జాతీయ స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు
తణుకు, డిసెంబర్ 9: గడచిన అయిదు రోజులుగా పట్టణంలోని శ్రీమతి కొండేపాటి సరోజినీదేవి మహిళా కళాశాలలో జరుగుతున్న జాతీయ స్కూల్ బ్యాడ్మింటన్ అండర్-14,17,19 ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ ఎం రమేష్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ దిశగా సంబంధిత క్రీడా శాఖలు ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కెసిహెచ్ పున్నయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తున్నామని చెప్పారు. తణుకులాంటి చిన్న పట్టణంలో ఇంత భారీస్థాయిలో టోర్నమెంటు నిర్వహించడం అభినందనీయమన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల వ్యవస్థాపకుడు చిట్టూరి సుబ్బారావు మాట్లాడుతూ ఇలాంటి బృహత్తర కార్యక్రమం తమ కళాశాలలో జరపడానికి అవకాశం కల్పించిన జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వివిధ రాష్ట్రాల విజేతలకు ఎస్పీ రమేష్ బహుమతులు అందించారు. కాగా రాష్ట్రానికే గౌరవం తెచ్చేవిధంగా ఈ పోటీలను నిర్వహించిన మహిళా కళాశాల అధినేత చిట్టూరి సుబ్బారావు, సత్య ఉషారాణి దంపతులను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో క్రీడల జాతీయ పరిశీలకులు సంత్ శర్మ, కళాశాల కోశాధికారి నందిగం సుధాకర్, పరిపాలనాధికారి డాక్టర్ డి సుబ్బారావు, డిగ్రీ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ ఎం ఝాన్సీ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యు లక్ష్మీ సుందరి, ఎస్‌డి కాలేజీ ప్రిన్సిపాల్ వివివి సత్యనారాయణరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు జి కుసుమకుమారి, రాజ్యలక్ష్మి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
అన్యాయం చేస్తే ఊరుకోం
*టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్‌పై మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం ధ్వజం
ఏలూరు, డిసెంబర్ 9 : రాష్ట్ర అసెంబ్లీలో ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌పై వర్గీకరణకు అనుకూలంగా టిడిపి ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికి మాలలకు తీవ్ర అన్యాయం చేసిందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కారెం శివాజీ ధ్వజమెత్తారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పునాధులపై పుట్టిందని, మాలల నాయకులు ఆ పార్టీలో చేరడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ మాలలపై కపట ప్రేమ నటిస్తూ శాసనసభలో వర్గీకరణకు మద్దతు పలికి తన నిజస్వరూపాన్ని బయటపెట్టి మాలల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందన్నారు. ప్రభుత్వం కూడా దళితులకు రావాల్సిన 60 వేల కోట్ల రూపాయల నిధులను దారిమళ్లించిందని ఆరోపించారు. నోడల్ ఏజెన్సీ నియామకంపై ఇచ్చిన జీవో కాగితాలకే పరిమితమైందన్నారు. వై ఎస్ ఆర్ ప్రవేశపెట్టిన అంబేద్కర్ జీవనధార పధకం బడ్జెట్ లేక నిర్వీర్యమైందన్నారు. చంద్రబాబునాయుడు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీసుకువచ్చిన వర్గీకరణ చిచ్చును అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. దళితుల్లో ఒక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకే ఈ వర్గీకరణ నాటకాన్ని చంద్రబాబు రక్తికట్టిస్తున్నారన్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ తీసుకురావడం హర్షదాయకమని పేర్కొన్నారు. అలాగే ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్ధులకు మెస్‌ఛార్జీలు పెంచడం అభినందనీయమన్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటల నుంచి స్థానిక పాతబస్టాండ్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి మదులత సెంటర్ వరకు మాలమహానాడు ఆధ్వర్యంలో ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు వరప్రసాద్, సుబ్బాని మోహన్, కస్సే బాలకృష్ణ, సుంకర సీతారామ్, అబ్బూరి అనీల్‌బాబులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
ఉండి, డిసెంబర్ 9: మండలంలోని కలిసిపూడి వద్ద శనివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. రెండు మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో భీమవరానికి చెందిన మీసాల గోపి (25), నిమ్మి రాజు (26), ఉండికి చెందిన ఉండ్రు అగస్తీన్ (35) దుర్మరణం చెందారు. ఉండి ఎస్‌ఐ జోసెప్‌రాజు అందించిన వివరాలు ప్రకారం ఉండికి చెందిన అగస్తీన్ అనే వ్యక్తి మోటారు సైకిల్‌పై ఉండి నుండి ఆకివీడు వైపునకు వేగంగా వెళ్తూ కలిసిపూడి సమీపంలో ఆకివీడు నుండి ఉండి వైపునకు మోటారు సైకిల్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అగస్టీన్ సంఘటనా స్థలంలో చనిపోగా మీసాల గోపి అనే యువకుడు భీమవరం ఆసుపతికి తరలించగా అక్కడ మృతి చెందాడు, నిమ్మి రాజు అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఆదివారం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ జరిపినట్లు తెలిపారు. ఉండి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ జోసెప్‌రాజు తెలిపారు.
ఎంతమంది పార్టీని వీడినా నష్టం లేదు
టిడిపి నేత, సినీ నటుడు మురళీమోహన్
నల్లజర్ల, డిసెంబర్ 9: ఎంతమంది పార్టీని వీడినా ఏ మాత్రం నష్టం లేదని తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటుడు మాగంటి మురళీమోహన్ అన్నారు. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు పోతవరం వచ్చిన ఆయన విలేఖర్లతో కొద్దిసేపు మాట్లాడారు. గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత తమ పార్టీని వీడినా టిడిపికి ఏ మాత్రం నష్టం లేదని, ఆమె తప్ప ఎవరూ పార్టీని వీడి వెళ్లలేదని అన్నారు. నిజమైన కార్యకర్తలు పార్టీని నమ్మి ఉంటారే తప్ప, పార్టీలు మారరని అన్నారు. తెలంగాణాలో సైతం చంద్రబాబు పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు. రెండు దశాబ్థాలు వెనుకబడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే టిడిపి అధికారంలోనికి రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ఐటి కంపెనీలు రాకపోగా, ఉన్న కంపెనీలు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోతున్నాయన్నారు. ఫలితంగా లక్షలాది మంది విద్యార్థులు ఉద్యోగాల్లేక ఖాళీగా ఉన్నారన్నారు. ఈ నెల 16నుండి గోపాలపురం నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించనున్నట్టు మురళీమోహన్ ప్రకటించారు. వ్యవసాయానికి ప్రభుత్వం 7గంటల విద్యుత్ ఇవ్వటం లేదని, మెట్ట ప్రాంతంలో 7గంటల విద్యుత్ ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈయన వెంట తాడేపల్లిగూడెం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముళ్లపూడి బాపిరాజు, వేకూరి దాలయ్య, యేలేటి సత్యనారాయణ (జెడి), మందా శ్రీనివాసరావు తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా పనిచేసిన కలిదిండి
ఉండి, డిసెంబర్ 9: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన మహామనిషి కలిదిండి రామచంద్రరాజు అని ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ కలిదిండి రామచంద్రరాజు విగ్రహాన్ని పెదపుల్లేరు గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జి సత్యనారాయణరాజు అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన కలిదిండిని రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ మాజీ సభ్యులు యర్రా నారాయణస్వామి కలిదిండి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ నిష్కల్మష కర్మయోగి కలిదిండి అన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గొట్టుముక్కల సత్యనారాయణరాజు, జుత్తిగ శ్రీనివాస్, మోటుపల్లి ప్రసాద్, గోపాలకృష్ణంరాజు, వేణు, మాజీ జడ్పీటీసీలు కాగిత మహంకాళి, గేదల జాన్, కలిదిండి లక్ష్మీనర్సింహారాజు, పెదపుల్లేరు రామం , గొల్ల రాజు, కలిదిండి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
కొవ