Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు’

$
0
0

గంట్యాడ, డిసెంబర్ 9 : విద్యార్ధులు ప్రణాళిక బద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించ గలరని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఎం. రామారావు అన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్న పాఠశాలలకు చెందిన 9,10 తరగతుల విద్యార్ధులకు కెరియర్ గైడేన్స్‌పై అవగాహన సదస్సు కోటారుబిల్లి జంక్షన్ల్‌ని టి.టి.డి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి నాగమణి పర్యవేక్షణలో జరిగిన సదస్సుకు ఎ.జె.సి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు ఉజ్వల భవిషత్తుకోసం లక్ష్యాన్ని నిర్ణయించుకుని దానిని సాధించేందుకు కృషి కొనసాగించాలన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ర్యాకులు సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారావు మ్లాడుతూ చదువు పట్ల ఎకాగ్రత అవసరమని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్ధులకు సూచించారు. ఎం.ఇ.ఓ సత్యన్నారాయణ, వరల్డ్ విజన్ జిల్లా మేనేజర్ నిర్మల, ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
‘తెలుగ భాషను ఆధునికం చేయాలి’
విజయనగరం(టౌన్), డిసెంబర్ 9 : తెలుగు భాషకు అనుకూలంగా ప్రజల సంసిద్ధత లేక పోవడం పెద్ద సవాలుగా నిలిచిందని డాక్టర్ యుఎ నరసింహమూర్తి అభిప్రాయపడ్డారు. తెలుగు మహాసభలలో భాగంగా స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు భాష సవాళ్ళపై చేసిన ప్రసంగంలో తెలుగును ఆధునీకరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సభాధ్యత వహించిన ఆచార్య ఎ గోపాలరావు మాట్లాడుతూ భాషకు అవరోదం కల్గించే అంశాలను తగ్గించుకోవాలన్నారు. జానపధ సాహిత్యంపై బద్రికూర్మారావు, పత్రికా భాషపై నాగేద్రప్రసాద్ ప్రసంగించారు. సమావేశంలో తెలుగు మహా సభల సమన్వయ కర్త రాబర్ట్స్,సహాయ సమన్వయకర్త ఎస్.జానకమ్మ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కవిగాయక సమ్మెళనంలో బాల,బాలికలు చెప్పిన పద్యాలు, శతకాలు ప్రేక్షకుల కరతాళధ్వనులందుకున్నాయి. అలాగే కాళ్ల లక్ష్మి భాగవతారిణి హరికధను, కాళ్ల కృష్ణ బుర్ర కధను హృద్యంగా ప్రదర్శించారు.
‘దళారి వ్యవస్థను రూపుమాపేందుకు కృషి’
గజపతినగరం, డిసెంబర్ 9 : దళారి వ్యవస్థను రూపుమాపి ప్రజలకు నేరుగా సబ్సిడీలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు. మండలంలోని భూదేవిపేట, వేమలి గ్రామాల్లో నిర్మించిన పంచాయతీ కార్యాలయాల భవనాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పధకాలు సబ్సిడీలు అన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా నగదు బదిలీ పధకాన్ని జనవరి నుంచి ప్రభుత్వం ప్రారంభించడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఉన్నత నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో 35 కోట్లతో కేంద్ర విద్యాలయాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. 1.25 లక్షల రూపాయాలతో వారికి వసతి గృహాలను నిర్మించే కార్యక్రమాన్ని కూడా చేపడుతుందన్నారు. వసతి గృహ విద్యార్ధులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఇటీవల మెస్ చార్జీలను కూడా ప్రభుత్వం పెంచిందని తెలిపారు. 10 రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించడానికి నిధులను మంజూరు చేస్తుందన్నారు. బిసి బాలుర వసతి గృహంలో విద్యార్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి, జెడ్పీటిసి సభ్యుడు మక్కువ శ్రీ్ధర్, గార తవుడు పాల్గొన్నారు.
‘విద్యార్థులతో ఆహార కమిటీలను ఏర్పాటు చేయాలి’
విజయనగరం (కంటోనె్మంట్), డిసెంబర్ 9: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్‌లో విద్యార్థులతో ప్రత్యేక ఆహార కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి ఏడాది పెరుగుతున్న ధరలకు తగ్గట్లు మెస్‌ఛార్జీలను పెంచాలని హాస్టల్ వెల్ఫేర్ రాష్ట్ర మాజీ కార్యదర్శి గౌరీ శంకర్ డిమాండ్ చేశారు. హాస్టల్ మెస్‌ఛార్జీల పెంపు సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎం.ఆర్.ఎ కళాశాలలో విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మెస్‌ఛార్జీల పెంచి చేతులు దులుపుకోకుండా హాస్టల్ విద్యార్థులకు అందిస్తోన్న భోజన సరఫరా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అలాగే అధిక సంఖ్యలో వసతిగృహాల్లో సిబ్బంది కొరతతోపాటు వౌళి వసతుల కొరత ఎక్కువగా ఉందన్నారు. హాస్టల్స్‌కు అవసరమైన పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి, వౌళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్ మాట్లాడుతూ మెస్‌చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. 126 జీవో ప్రకారం అన్ని హాస్టల్స్ నిర్వహణకు నెలకి 1000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడ అమలు జరగడం లేదన్నారు. అలాగే హాస్టల్ విద్యార్థులకు పెట్టెలు, స్టీలు పళ్లాలు, గ్లాసులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం ఇస్తున్న కాస్మోటిక్ ఛార్జీలు విద్యార్థులకు ఏమాత్ర సరిపోవడం లేదని తెలిపారు. అదేవిధంగా గిరిజన హాస్టల్ విద్యార్థులకు గిరిబాల రక్షణ, మిగిలిన హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య భీమా ప్రకారం మెరుగైన వైద్య సేవలు కోసం 50 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉన్న ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. ఎస్.ఎఫ్.ఐ నాయకులు రాజు, విజయ్, గణేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తెలుగు మహాసభల ఏర్పాట్ల పరిశీలన

పార్వతీపురం, డిసెంబర్ 9: పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా ప్రాంగణంలో సోమవారం నిర్వహించనున్న డివిజన్ స్థాయి ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లను ఆదివారం పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి జల్లేపల్లి వెంకటరావుపరిశీలించారు. భారీ ఎత్తున అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ఈ సభలకు డివిజన్ స్థాయిలోని పెద్ద ఎత్తున కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు, అధికారులు, ఉపాధ్యాయులు,ప్రజలు హాజరై తెలుగు భాషా ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు ఈ సభ దోహదడపడుతుంది. ఈ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో భాగంగా తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజెప్పేవిధంగా సాంస్కృతిక ప్రదర్శనలు, తెలుగువంటకాలకు సంబంధించిన వివిధ స్టాల్స్ వంటివి వాటిని కూడా జూనియర్ కళాశాల గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెకు ఆవరణకు సమీపాన తెలుగుతల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనిని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ప్రారంభిస్తారు. అదేవిధంగా పార్వతీపురం ఎమ్మెల్యే జయమణితో పాటు పలువురు పాల్గొంటారు. తెలుగుతల్లి విగ్రహావిష్కరణకు ముందుగా తెలుగుభాషా గొప్పతనాన్ని చాటి చెపుతూ భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించనున్నారని ఆర్డీవో జె.వెంకటరావు తెలిపారు.

‘పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలి’
కురుపాం, డిసెంబర్ 9: కురుపాం పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టవల్సి ఉందని జిల్లా పంచాయతీ అధికారి మోహనరావు అన్నారు. ఆదివారం అతిసార వ్యాధి ఎక్కువగా వ్యాపించిన గాంధీనగర్‌ను పరిశీలించారు. అక్కడ మంచినీటి సరఫరా పైపులను, వీధి కాలువలను పరిశీలించారు. ఆసుపత్రిలో అతిసార రోగులను పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో వీధి కాలువలను శుభ్రం చేయనట్లుగా పరిశీలనలో తేలిందన్నారు. ప్రతీ వీధిలోను వీధి కాలువలను తీయించాలని పంచాయతీ అధికారిని ఆదేశించామన్నారు. జిల్లాలో ఈనెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు అన్ని పంచాయతీలకు ఆదేశాలు జారీచేశామన్నారు. దీని కోసం జిల్లాలో అన్ని పంచాయతీలకు జనరల్ కేటగిరిలో 15కోట్ల రూపాయల నిధులున్నాయి. ఇప్పటి వరకు 30లక్షల రూపాయల వరకు పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం వెచ్చించామన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచకుండా అతిసార వంటి వ్యాధులు వ్యాపిస్తే అక్కడ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే కురుపాంలో ఆర్.డబ్ల్యు. ఎస్. పంచాయతీ అధికారుల మధ్య సమన్వయంతో మంచినీటి సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అతిసార వ్యాధి అదుపులోకి వచ్చేందుకు తమ సిబ్బంది కృషి చేస్తారన్నారు. ప్రత్యామ్నాయంగా ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలని స్థానిక అధికారులను ఆదేశించామన్నారు. ఈయన వెంట డి.ఎల్.పి.ఓ. కోటేశ్వరరావు, కురుపాం పంచాయతీ ఇ.ఓ. చిన్నికృష్ణుడు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

అధిక బిల్లులతో ఆందోళన
బాడంగి, డిసెంబర్ 9: అధికంగా ఈనెల విద్యుత్ బిల్లులు రావడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా 170 నుంచి 200 రూపాయలు వచ్చే వినియోగదారులకు 700 రూపాయలు నుంచి 800 రూపాయల వరకు బిల్లులు వస్తుండటంతో వారంతా అవక్కాయ్యారు. ఒక ఫ్యాన్, రెండు బల్బులున్న ఇళ్లకు కూడా 500 రూపాయలకు పైగా బిల్లులు రావడంతో వారంతా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సక్రమంగా సరఫరా కాకపోవడంతో కాకుండా బిల్లులు కూడా అధికంగా రావడం పట్ల వారు మండిపడుతున్నారు. ఈ విధంగా బిల్లులు వస్తే ఎలా చెల్లించగలమని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధిక ధరలు కారణంగా జీవించడమే దుర్భరంగా ఉన్న ఈరోజులలో వేలాది రూపాయలు విద్యుత్ బిల్లులను ఎలా చెల్లించగలమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయాల్లో తప్ప పేద ప్రజల బాగోగులను పాలకులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిదులు స్పందించి పెంచిన బిల్లులను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రేపటి నుంచి
విద్యార్థులకు
కంటి చికిత్సలు
బాడంగి, డిసెంబర్ 9: మండలంలో చదువుతున్న కంటి సమస్యలు ఉన్న విద్యార్థులకు ఈనెల 11,12వ తేదీలలో కంటి వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మార్టీ రాజేష్ తెలిపారు. ఇటీవల చిన్నారి చూపు కార్యక్రమం ద్వారా మండలంలో ఉన్న అన్ని పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలను నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా 347మంది విద్యార్థులకు కంటి సమస్యలున్నట్లు గుర్తించామన్నారు. వీరందరికీ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తామన్నారు.

‘ఎంఇఒ పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యం’
పార్వతీపురం, డిసెంబర్ 9: ఎం ఇవో పోస్టులు భర్తీ చేయకపోవడానికి రాష్ట్రప్రభుత్వమే కారణమని ఎస్సీ, ఎస్టీ సంఘ రాష్ట్ర కార్యదర్శి సామల సింహాచలం ఆరోపించారు. ఆదివారం స్థానిక విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం విద్యావ్యవస్థను భ్రస్టుపట్టిస్తోందని ఆరోపించారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ చెల్లవని 2005లో హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈతీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో 2007 ఫిబ్రవరిలో అప్పీలు చేసిందన్నారు. అప్పటినుండి టీచర్ల సర్వీసు రూల్స్ కేసు పెండింగ్‌లోనే ఉందన్నారు. ఫలితంగా ఆరేళ్లుగా ఎం ఇవో పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా, రాజకీయ లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టులో ఉన్న సర్వీసు రూల్స్ కేసును పట్టించుకోకుండా, కేసు విచారణకు రాకుండా అడ్డుకుంటోందని సామల విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 4లక్షల మంది ఉపాధ్యాయులకు సంబంధించిన ముఖ్యమైన సర్వీసు రూల్స్ వివాదాన్ని వెంటనే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలోని నెలిమర్ల మండలంలోని ఎం ఇవో బాధ్యతలు అర్హులకే నియమించాలని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ప్రభుత్వ నిబంధనలకు తలొగ్గి అనర్హులకు నియమించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 900లకు పైగా ఎం ఇవో పోస్టులు సీనియారిటీ ప్రాతిపదికన జడ్‌పి, ప్రభుత్వ టీచర్లకు అడహాక్ పద్దతిలో పదోన్నతులు కల్పిస్తే ఈ సమస్యకు పరిష్కారం కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పి.దేవానంద్ పాల్గొన్నారు.

‘సబ్సిడీ గ్యాస్‌పై పరిమితి ఎత్తివేయాలి’

పార్వతీపురం,డిసెంబర్ 9: సబ్సిడీ గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం నియమనిబంధనలు తక్షణమే ప్రకటించాలని సిపి ఎం పార్టీ పార్వతీపురం డివిజన్ కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిపి ఎం కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏడాదికి ఆరు గ్యాస్ సిలెండర్ల మాత్రమే ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగిందన్నారు. అయితే అది ఏ నెల నుండి వర్తిస్తుందోనిర్ధిష్టంగా తెలియజేయకపోవడం వల్ల గందరగోళానికి ప్రజలు గురవుతున్నారన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలోని కట్టా సరస్వతమ్మ మున్సిపల్ పాఠశాలకు చెందిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు జనవరి 2012 నుండి ఆగస్టువరకు 3గ్యాస్ సిలెండర్లు వాడారని, అలాగే సెప్టెంబర్ 27న రెండు సిలెండర్ల డీలర్ నుండి తీసుకున్నారన్నారు. అయితే మొత్తం ఇంకా ఐదు సిలెంటర్లను మాత్రమే డీలర్ నుండి తీసుకున్నప్పటికీ ఈనెల 29న హెచ్‌పి గ్యాస్ డీలర్ నుండి ఇంకా రూ.1220 గ్యాస్‌కోసం కట్టాలని నోటీసు పంపారన్నారు. అయితే ఆరుసిలెండర్ల వాకుండానే సబ్సిడీగ్యాస్ కంటే మించి వాడిన సిలెండర్లకు వర్తించే ధర చెల్లించాలని డీలర్ నోటీసు చేయడంలో ఆంతర్యమేమిటని శ్రీరామ్మూర్తి ప్రశ్నించారు. ఏడాది ఆరు సిలెండర్ల వ్యవహారం చాలా అధ్వాన్నంగా ఉందని దీనిపై తగు చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు శ్రీరామ్మూర్తి తెలిపారు. ఇదిలా ఉండగా తమ పార్టీ ఏడాది 12సిలెండర్లను సబ్సిడీపై సరఫరా చేయాలని, అంగన్‌వాడీ, మధ్యాహ్నభోజన పథకం, హాస్టళ్లకు సబ్సిడీ గ్యాస్ సిలెండర్లు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆర్డీవో వాహనానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
పార్వతీపురం, డిసెంబర్ 9: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి జల్లేపల్లి వెంకటరావు ప్రయాణిస్తున్న వాహనానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మండల పర్యటనకు వెళ్లి పార్వతీపురం తిరుగుప్రయాణంతోవస్తున్న ఆర్డీవో వాహనానికి పార్వతీపురం నుండి ఒడిశాకు మోటారుబైక్‌పై వెళుతున్న వ్యక్తి వెంకంపేట చెరువు సమీపాన ఎదురుగా వస్తుండగా ఆ బైక్‌ను తప్పించడానికి ఆర్డీవో డ్రైవర్ పక్కకు తీసే ప్రయత్నం చేయడంతో పక్కనున్న విద్యుత్ స్తంభానికి ఆర్డీవో ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది. అయితే వాహనంలో ప్రయాణిస్తున్న ఆర్డీవోకుగాని ఆయనతోపాటు ప్రయాణిస్తున్న తహశీల్దారు ఎం శ్రీనివాసరావుకు గాని ఎలాంటి ప్రమాదం జరగలేదు. వాహనం నడిపే ఆర్డీవోడ్రైవర్‌కు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఆర్డీవో వాహనం వెనుకగా వస్తున్న పార్వతీపురం సర్కిల్ ఇనస్పెక్టర్ బి.వెంకటరావు వారి కార్యాలయాల వద్దకు తీసుకువెళ్లారు. టూవీర్ నడిపే వ్యిక్తి తాగి ఉండడంతో ఆర్డీవోవాహనం నడుపుతున్న డ్రైవర్ పక్కకు తీయడం వల్ల పెను ప్రమాదం తప్పింది. మోటారు బైక్ కూడా అదుపుతప్పి చెరువులోనికి బోల్లా పడింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలు కావడంతో 108వాహనం సాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు అందించారు.

సబ్సిడీపై విక్రయానికి వరి విత్తనాలు సిద్ధం
విజయనరగరం (తోటపాలెం), డిసెంబర్ 9: రబీ సీజన్‌లో పండించే వరి విత్తనాలు విక్రయానికి సిద్దంగా ఉన్నాయని రైతులు కావాలనుకుంటే పాస్ పుస్తకాలను తీసుకువచ్చి సబ్ సిడి పై తీసుకొవచ్చని మండల వ్యవసాయ శాఖాధికారి టి.సత్యనారాయణ తెలిపారు. తన కార్యాయలంలో కలిసిన విలేఖర్లులో మాట్లాడుతూ రబీ సీజన్‌లో తక్కువ కాలంలో పండే 1010 రకం వరి విత్తనాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని కావాల్సిన రైతులు కార్యాలయానికి రావాలని తెలిపారు. ఈ విత్తనాల పూర్త్ధిర 600 రూపాయిలు కాగా పాస్ బుక్ ఉన్నవారికి 450 రూపాయిలకు అందించనున్నట్లు తెలిపారు. అదే విదంగా పెసలు, మినుములు 50 శాతం సబ్ సిడి పై అందిస్తున్నామన్నారు. నాలుగు కేజిల ధర 260, 240 రూపాయిలు కాగా, సబ్ సిడిపై చే 130, 120 రూపాయిలకు అందించడం జరుగుతుందన్నారు. అపరాల అభివృద్ధి చేసి సాగు విస్తీర్ణం పెంచాలనే లక్ష్యంతో మండలంలోని గుంకలాం గ్రామంలో రెండు టన్నుల మినుములను 470 మంది రైతులకు ఉచితంగా అందిచామన్నారు.

‘బిజెపికి అనుకూలంగా వీస్తున్న పవనాలు’
విజయనగరం (కంటోనె్మంట్), డిసెంబర్ 9: నిత్యం ప్రజాకాంక్షను కోరే నిబద్ధత కలిగిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని దేశ ప్రధానిగా చూడాలని యావత్ భారత ప్రజలు ఆకాంక్షిస్తున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. జిల్లా బిజెపి విస్తృత స్థాయి సమావేశం ఆదివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కంభంపాటి మాట్లాడుతూ రాష్ట్రంలోను, కేంద్రంలోను బిజెపికి సానుకూల పవనాలు వీస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా కేంద్రంలో ప్రజలకు పారదర్శకమైన పాలనందించగలిగే ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ బిజెపియేనని అన్నారు. ఎఫ్.డి.ఐ ఓటింగ్ సందర్భంగా చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని తేటతెల్లమైందని అన్నారు. చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీ వెళ్లి అన్ని ప్రాంతీయ పార్టీలను ఒకే వేధికపైకి తెచ్చి బాబు తిరిగి హైదరాబాద్ వచ్చేసరికి ఆయా పార్టీల నాయకులు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి జిల్లా ఇన్‌ఛార్జ్ సుబ్బిరామరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీవిశ్వనాథం, జిల్లా మాజీ అధ్యక్షుడిగా పాకలపాటి సన్యాసిరాజు, పి.అశోక్, వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.

‘తాటిపూడి’కి పర్యాటకుల తాకిడి
గంట్యాడ, డిసెంబర్ 9 : ప్రభంజనంలా తరలివచ్చిన పర్యాటకులతో ప్రముఖ పర్యాట కేంద్రమైన తాటిపూటిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. కార్తీక మాసం ఆఖరి ఆదివారం పిక్నిక్ జరుపుకునేందుకు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకశం, జిల్లాల నుంచే గాక ఒరిస్సా ప్రాంతం నుంచి పలు వాహనాల్లో వేలాదిగా పర్యాటకులు తాటిపూడికి తరలివచ్చి ఆనందోహత్సలతో గడిపారు. జలాశయం ఎగువన దిగువన ఎటు చూసినా జన సమూహమే కనిపించెంది. ప్రత్యేక ఆకర్షణగా బోటు షికారుకు పర్యటకులు విపరీతంగా ఎగబడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జలాశయం గట్టుపై జనరద్దీ కొనసాగింది. తాటిపూడి జలాశయం స్లూయిప్ మదుం వద్ద పలువురు యువకులు జలకాలాటలతో ఉత్సాహంగా గడిపారు. మధ్యహ్నం వరకూ తాటిపూడి సహజ అందాలు తిలకించి, ఆట పాటులతోకాలక్షేపం చేసిన పర్యాటకులు మధ్యాహ్నం జలావయం దిగువన వన భోజనాలు చేశారు. చెట్ల కింద స్థలం లేక పోవడంతో పలువురు పర్యాటకులు గట్టుపై కూర్చుని కుటుంబ సమేతంగా భోజనాలు చేశారు. మరిన్ని సౌకర్యాలు కల్పించడం ద్వారా ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే అవకాశందని భావిస్తున్నారు.

‘నిజాయితీపరులకు సమాజంలో గౌరవం పెరగాలి’
విజయనగరం (కంటోనె్మంట్), డిసెంబర్ 9: నీతినిజాయితీలతో బతికే వారికి సమాజంలో పెద్దపీట వేసి వారిని గౌరవిస్తే, అవినీతి నియంత్రకు ఆస్కారం ఏర్పడుతుందని విజయనగరం ఎమ్మెల్యే, టిడిపి పోలీట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోకగజపతిరాజు అభిప్రాయపడ్డారు.ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆధ్వర్యంలో అవినీతికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ తొలి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి నియంత్రణకు చట్టాల్లో మార్పు రావాలన్నారు. ప్రధానంగా ప్రజల్లో అవినీతిపై అవగాహన పెంచుకుని దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వస్తే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ప్రజాస్వామ్య విధానంలో అవినీతి ఉన్నంతకాలం అభివృద్ధి సాధ్యపడదన్నారు. యూరప్ దేశాల్లో అవినీతి 5 శాతం భారతదేశంలో అవినీతి 54 శాతం ఉన్నట్లు కొన్సి సర్వేల్లో తేలడం దురధృష్టకరమన్నారు. అవినీతి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, లోక్‌సత్తాపార్టీ నాయకులు, పాల్గొన్నారు.

రిపోర్టర్స్ డైరీ

అధికారంలో ఉంటే....!
అధికారం ఉంటే చాలు ఏదైనా చేసేయొచ్చు. ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్నది కూడా అదే. ప్రభుత్వ పథకమైనా, పదవైనా. ప్రభుత్వం అందించే సంక్షేమమైనా, సహాయమైనా అధికార పార్టీ మార్కు ఉంటే చాలు ఎంచక్కా అందివచ్చేస్తాయి. ఇది ఏరాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సాధారణంగా జరిగేదే. అయితే అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ విషయంలో ఈ స్వలాభాపేక్ష కాస్త మోతాదుకు మించి ఉంటుందన్నది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. గతంలో అధికారం వెలగబెట్టిన ప్రస్తుత విపక్ష పార్టీ అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాల్లోను పచ్చచొక్కాలకు పదిలమైన వాటా అందేది. మరి ఇప్పుడున్నది జాతీయ పార్టీ ఆయే. మరి నూరేళ్ళకు పైబడి చరిత్ర కలిగిన పార్టీలో అనుయాయులు కూడా అంతే భారీగా ఉండటం సహజం. అందుకే పార్టీని నమ్ముకున్న వారికి ఇతోధికంగా సాయం చేయడం మామూలే అన్నట్టు విధివిధానాలను మార్చుకున్నారు. రైతు మిత్రలు కావచ్చు, ఆదర్శ రైతులు అవ్వొచ్చు, అంగన్‌వాడీ ప్రతినిధులు కావచ్చు, ఆశా వర్కర్లుగా పిలవచ్చు. సాక్షర భారత్‌లో గ్రామస్థాయి నుంచి కోఆర్డినేటర్లు కావచ్చు. ఎవరైనా సరే అధికార పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉంటే చాలు. వారికి ఉద్యోగ భద్రతతో పాటు అధికారుల కరుణాకటాక్షాలు మెండుగానే ఉంటాయి. ఇక ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళు తదితరాలు అదనపు భత్యాలే.
ఇప్పుడు తాజాగా అధికారులు సైతం పార్టీ కటాక్షవీక్షణాలకు అర్రులు చాస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ స్వామిభక్తిని చాటుకోవడం సర్వసాధారణమే అయినప్పటికీ జిల్లాలో ఇది మోతాదును మించుతోందన్న విమర్శలున్నాయి. అధికార పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు తమ పరిధులు మీరి మరీ సహకరించేందుకు యంత్రాంగం పడుతున్న తాపత్రయమే ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. సహకార ఎన్నికల శంఖారావం పూరించిన అధికార పార్టీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది. అయితే మిగతా పక్షాలను అడ్డుకునే క్రమంలో వారికి సభ్యత్వాలు కల్పించేందుకు కూడా అవకాశం ఇవ్వకూడదన్నది ఇక్కడ అధికార పక్ష భావన. దీనికి అధికారులు వంతపాడుతూ విపక్షాల తరపున వస్తున్న సభ్యత్వాలను సైతం అంగీకరించకుండా నిలువరించే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. ఇక అందరినీ సమభావంతో చూడాల్సిన గురువులు సైతం ఒక పార్టీని నమ్ముకునో, అధికార పార్టీని ఆలింగనంచేసుకునో విధులను నిర్వహించేందుకు సైతం సిద్ధం కావడం విచారకరం. ఇటీవల జరిగిన మండల విద్యాశాఖ అధికారుల నియామకంలో చోటుచేసుకున్న ఒక సంఘటన గురువులు నడుచుకునే తీరు, వారిబాధ్యతలను అపహస్యం చేసిందంటూ బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ఏఒక్కరి తప్పిదమో కానప్పటికీ రాజకీయ ఆకర్షణలో పడి యంత్రాంగం తాము ప్రజాసేవకులమన్న వాస్తవాన్ని మర్చిపోతే ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగిలిపోతుందేమో.
- బ్యూరో, విజయనగరం
రెండు విడతలుగా సహకార ఎన్నికలు

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 9: గ్రామస్థాయిలో రైతాంగానికి విశేష సేవలు అందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు జనవరి 31, ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండువిడతలుగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈనెల 20వ తేదీ వరకు కొత్తగా సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆదేశించింది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈనెల 21వతేదీన ఎన్నికల అధికారులను నియమిస్తారు. 24వ తేదీన సహకార సంఘాల్లో ఓటర్ల నమోదు పరిశీలిస్తారు. 27వ తేదీన అర్హులైన సభ్యుల జాబితా ప్రకటిస్తారు. 31న అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 4వతేదీన సహకార సంఘాల్లో అర్హులైన సభ్యుల జాబితాతోపాటు ఎన్నికలకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను ప్రకటిస్తారు. అనంతరం జనవరి 21వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తొలిదశ ఎన్నికలను జనవరి 31వతేదీన, రెండోదశ ఎన్నికలను ఫిబ్రవరి 4వతేదీన నిర్వహిస్తారు. జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య వ్యవహరిస్తారు. తొలిదశకు ఎన్నికకు సంబంధించి జనవరి 24వ తేదీన నామినేషన్లను స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. అలాగే రెండోదశ ఎన్నికకు సంబంధించి 28వ తేదీన నామినేషన్లను స్వీకరిస్తారు. 29న నామినేషన్ల పరిశీలన, 30న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 94 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో లక్షా 60వేల మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 80వేల మంది మాత్రమే సహకార సంఘాలు, బ్యాంకుల ద్వారా రుణాలను పొందుతున్నారు. మొత్తం మీద సహకార ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

విద్యార్ధులు ప్రణాళిక బద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించ గలరని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>