విశాఖపట్నం, డిసెంబర్ 9: ఒకప్పు డు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ, నేడు జిల్లా కమిటీని కూడా నియమించుకోలేని దుస్థితికి చేరుకుం ది. ఈ పరిస్థితి పార్టీ మనుగడనే ప్రశ్నిం చే విధంగా ఉంది. పార్టీ కునారిల్లిపోతున్నా, ఆధిపత్యపోరు మాత్రం ఇక్కడి నేతలు మానుకోవడం లేదు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందు కు చంద్రబాబు రాత్రనక, పగలనక రో డ్ల వెంట తిరుగుతుంటే, ఇక్కడి నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నారు. వచ్చిన పదవులతో సరిపెట్టుకోకుండా, తమ వర్గం అంతటికీ పదవులు కట్టబెట్టాలన్న నేతల ఆలోచన పార్టీని మరింత కుంగదీస్తోంది. ప్రజల్లోని పాజిటివ్ ఓటును సక్రమంగా వినియోగించుకుందామన్న కనీస ఆలోచన నాయకులకు లేదు. పరాయి పార్టీల్లో కొంతమం ది ఎదుగుదలకు టిడిపిలోని కొంతమం ది సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఆపార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో పార్టీకి పెద్ద చికిత్సే చేయాల్సి ఉన్నప్పటికీ, అధిష్టానం ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి నెలకొంది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అక్టోబర్‌లో జిల్లా కమిటీని ఎంపిక చేసుకోవలసి ఉంది. గతంలో అర్బన్, రూరల్ జిల్లాలకు కలిపి ఒకటే కమిటీ ఉండేది. దానికి అయ్యన్నపాత్రుడు నాయకత్వం వహించారు. 72 డివిజన్‌లకు సంబంధించి పీలా శ్రీనివాసరావు నాయకత్వం వహించారు. సంస్థాగత ఎన్నికల సమయంలో ఈ రెండు కమిటీలను విడదీయాలని చాలా మంది పట్టుపట్టారు. రూరల్ జిల్లా వరకూ మాత్ర మే అయ్యన్నపాత్రుడిని పరిమితం చేయాలని, అర్బన్‌కు వేరే కమిటీ కావాలని తీవ్రంగా పట్టుపట్టడంతో ఈ నియామకాలు కాస్తా నిలిచిపోయాయి. ఈ సంక్షోభాన్ని తొలగించేందుకు అక్టోబర్ 5వ తేదీన ఒక కమిటీని పార్టీ అధిష్ఠానం నియమించింది. ఆ కమిటీ ఇప్పటికీ కనీసం ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఈ కమిటీలో ఎంపి సుజనా చౌదరి ఉన్నారు. ప్రస్తుతం సుజనా చౌదరి పార్టీలో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పట్లో ఆయన ఈ వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో ఎవరెవరు ఏయే పదవులు కావాలని పట్టుదలతో ఉన్నారో, నేటికీ అదే అభిప్రాయంతో ఉన్నారు. అధిష్ఠ్టానానికి జిల్లా కమిటీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు. గత కమిటీలు రద్దయిపోవడంతో నాయకులెవరూ పార్టీ కార్యాలయానికి వెళ్లడం లేదు. కొద్దిరోజుల కిందట ఎర్రన్నాయుడు సంస్మరణ సభకు వెళ్లక తప్పదు కాబట్టి వెళ్లారే కానీ, తరువాత కార్యాలయ ముఖం చూడడం లేదు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని కైవసం చేసుకోడానికి ప్రణాళిక సిద్ధం చేయాలన్న ఆలోచన ఒక్క నాయకుడికి లేకపోవడం గమనార్హం. సమీప భవిష్యత్‌లో రానున్న ఏ ఎన్నికలైనా ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యాలను టిడిపి అంచెలంచెలుగా కోల్పోతోందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ప్రజల్లో పార్టీకి కాస్తంత మంచి పేరున్నా, నాయకుల చేష్టల వలన అదికాస్తా ప్రతికూలంగా మారిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకుల తీరు చూసి టిడిపి శ్రేణుల్లో చాలామంది పక్క పార్టీలకు జంప్ అయిపోతున్నారు.
మళ్లీ ఒకటే కమిటీ?!
ఇక్కడి పరిస్థితులపై ఆరా తీసిన చంద్రబాబు జిల్లా అంతటికీ ఒకే కమిటీని నియమించాలన్న ఆలోచనకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం నగర పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్న పీలా శ్రీనివాసరావు, విశాఖ వెస్ట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా నిర్వహించేవారు. టిడిపి నుంచి గణబాబు పీఆర్పీలోకి వెళ్లి, తిరిగి టిడిపిలోకి వచ్చిన తరువాత వెస్ట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో పీలా శ్రీనివాసరావు ఆ నియోజకవర్గంపై పెంచుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో పీలా శ్రీనివాసరావును అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించడం సమంజసం కాదని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. జిల్లా కమిటీని రెండుగా విభజిస్తే, అర్బన్ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతుంది. దీనివలన పార్టీలో ఇబ్బందులు మరింత పెరుగుతాయన్న ఆలోచనలో పార్టీ అధిష్టానం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. అందువలన జిల్లా అంతటికీ ఒకే కమిటీని ఉంచి, దానికి అయ్యన్నను అధ్యక్షునిగా నియమించాలన్న ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉందని తెలిసింది.
టన్ను చెరకు ధరను
రూ. మూడు వేలుగా ప్రకటించాలి
* రైతు సంఘం డిమాండ్
చోడవరం, డిసెంబర్ 9: టన్ను చెరకు ధరను మూడు వేల రూపాయలుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుసంఘం డిమాండ్ చేసింది. ఆదివారం చెరకు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ గోవాడ సహకార చక్కెర కర్మాగారం ఎదుట రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి అప్పారావు మాట్లాడుతూ చెరకు రైతుల వ్యవసాయ పెట్టుబడులు విపరీతంగా పెరిగినప్పటికీ గోవాడ సుగర్స్ యాజమాన్యం చెరకు టన్నుధరను 1800 రూపాయలు, ప్రోత్సాహక ధర 200 రూపాయలుగా చెల్లిస్తామని ప్రకటించడం విచారకరమన్నారు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సింది పోయి గిట్టుబాటుగాని ధరను చెల్లిస్తామని చెప్పడం చెరకు రైతులను కించపరచడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియమించిన స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సును అనుసరించి టన్ను చెరకు ధరను మూడువేల రూపాయలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెంటకోట జగన్నాథం మాట్లాడుతూ లాభాల బాటలో పయనిస్తున్న గోవాడ సుగర్స్ సభ్యరైతులకు టన్నుచెరకు ధరను మూడువేల రూపాయలుగా ప్రకటించడంతోపాటు ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహక ధరను 200 నుండి 600రూపాయలకు పెంపుదల చేయాలన్నారు. సభ్యరైతుల మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మద్దతు ధరను తగ్గిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.