Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘సహకార’ సందడి

$
0
0

శ్రీకాకుళం, డిసెంబర్ 9: సహకార సమరానికి తెరలేచింది. నామినేషన్లు, పోలింగ్ సంబంధించి అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. డిసిసిబి చైర్మన్ పదవితోపాటు 13 డైరెక్టర్ల పదవుల కోసం జిల్లాలో 50 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి. త్వరలో జరుగనున్న సహకార ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనవరి 21వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, అలాగే 24వ తేదీన నామినేషన్ల స్వీకరణ, 25న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ, 31న ఎన్నికల నిర్వహణతోపాటు అదేరోజు కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉంటుందని షెడ్యూల్‌లో ఖరారైంది. రెండు విడతలుగా ఈఎన్నికలు జిల్లాలో జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు కీలకమైన డిసిసిబి చైర్మన్ పదవులను చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల సైతం కోర్టు స్టే కారణంగా వాయిదా పడుతూ వస్తుండడం ఎట్టకేలకు సహకార నగారా మోగడంతో పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పరిస్థితులు ఈ మధ్యకాలంలో శరవేగంగా మారడంతో సహకార ఎన్నికలకు మరింత ప్రతిష్ఠ సంతరించుకుంది. కీలకమైన ఓట్లు కోసం నాయకులు రంగంలోకి దిగారు. సొంత డబ్బులతో రైతులను సభ్యులుగా చేర్పించి తద్వారా పిఎసిఎస్ డైరెక్టర్ల పదవులను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. కొత్త ఓటర్లుగా చేరాలనుకునే రైతులు ఈ నెల 21వ తేదీలోగా సభ్యత్వ నమోదు చేసుకోవాలని గడువు విధించారు. దీంతో రచ్చబండ రాజకీయాలు నెరుపుతూ పోటాపోటీగా సభ్యత్వాలు చేర్పించే పనిలో చోటా నాయకులు బిజీగా ఉన్నారు. గత ఏడేళ్లుగా ఈ ఎన్నికలపై ఎవరూ పట్టించుకోకపోవడంతో ఓటర్ల నమోదు ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇలాంటి వారంతా పిఎసిఎస్‌లో సభ్యత్వ నమోదుకు ముందుకు వస్తున్నారు. ఒక్కో రైతు 330 రూపాయలు సభ్యత్వ రుసుము చెల్లించాల్సి ఉండగా చాలామంది రైతులు వంతున రాజకీయ నేతలే ఆ పైకం చెల్లించి ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు జలక్ ఇచ్చి ఇక్కడి నుంచి పదవులు దక్కించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అధికార కాంగ్రెస్ పార్టీ డిసిసిబి చైర్మన్ పదవిని నిలబెట్టుకోవాలని చూస్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఆ కుర్చీని వసపరచుకోవాలని ఉత్సాహం ప్రదర్శిస్తోంది. మూడోరాజకీయ పార్టీగా అవతరించిన వైఎస్సార్ సీపీ ఉనికి చాటుకుని డిసిసిబిలో పాగా వేయాలని ఆశిస్తోంది. ఓ వైపు వ్యవసాయ పనుల్లో రైతాంగం తీరిక లేకుండా తలమునకలై ఉండగా రాజకీయ నేతలు మాత్రం సభ్యత్వాలు నమోదులో పడ్డారు.
గుర్తింపు లేకనే...
కాంగ్రెస్‌కు గుడ్‌బైపై కలమట వివరణ
కొత్తూరు/పాతపట్నం, డిసెంబర్ 9: కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన గుర్తింపు లేక పోవడం వలనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు వెల్లడించారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. తన రాజీనామాలేఖను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణకు ఫ్యాక్స్ ద్వారా పంపించినట్లు తెలిపారు. అభిమానులు, ముఖ్యులతో చర్చించి త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయములు శాసనసభ్యునిగా ఎన్నికైన మోహనరావుకు సుదీర్ఘరాజకీయ చరిత్ర ఉంది. కలమట మోహనరావు తన రాజకీయ ప్రస్తానాన్ని 1970-75 మధ్య కొత్తూరు సమితి అధ్యక్షునిగా ప్రారంభించారు. 1978లో పాతపట్నం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లుకలాపు లక్ష్మణదాసుపై స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1983లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి తోట తులసీదాసు నాయుడు చేతిలో ఓటమి చవిచూశారు. 1987లో తెలుగుదేశం పార్టీలో చేరి 1989, 1994,1999, 2004లో వరుసగా నాలుగు సార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. విజయనగరం ఆర్టీసి జోనల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2008 నవంబర్ 9న తెలుగుదేశం పార్టీకి రాజీనామాచేసి ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. 2009లో ప్రజా రాజ్యం టికెట్‌ను ఆశించి భంగపడడంతో పి ఆర్‌పికి రాజీనామా చేసి అదే ఏడాది ఆగస్టు 27న దివంగత నేత వై ఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తదనంతరం పరిణామాలు తరువాత సీనియర్ నేతగా తనకు తగిన ప్రాతినిధ్యం పార్టీ కల్పించడం లేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
కాగా, మోహనరావు తనయుడు కలమట వెంకటరమణ ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతుండడంతో సీనియర్ నాయకుడైన మోహనరావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అభిమానులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
వైకాపా వైపు కలమట చూపు?
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. అయితే కలమట మోహనరావు తనయుడు కలమట వెంకటరమణ ప్రస్తుతం పాతపట్నం నియోజక వర్గం టిడిపి ఇన్‌చార్జిగా కొనసాగుతున్న నేపథ్యంలో వైకాపా వైపు ఎంతవరకు మొగ్గుచూపుతారోనన్న అనుమానాలు లేకపోలేదు. ఎర్రన్నాయుడు మృతిచెందక ముందు తెలుగుదేశం పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాలకు కలమట మోహనరావు హాజరై సంఘీభావం తెలిపిన సందర్భాలున్నాయి. అయితే ఎర్రన్నాయుడు అకాల మరణంతో కలమట టిడిపికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ పరిస్థితిలో పాతపట్నం నియోజక వర్గం పరిధిలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేని కారణంగా ఆ పార్టీవైపు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎర్రన్న వారసునికే పగ్గాలు
శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, డిసెంబర్ 9: తెలుగుదేశం పార్టీ జిల్లా బిగ్‌బాస్‌గా ఫరిడిల్లి హఠాన్మరణం చెందిన దివంగత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు వారసుడు రామ్మోహన్‌నాయుడుకే శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించినట్లు అధినేత బాబు ఆదివారం వెల్లడించారు. ఇటీవవ జిల్లాకు చెందిన పలువురు నాయకులు కింజరాపు రామ్మోహన్‌నాయుడును వెంటబెట్టుకుని మీకోసం వస్తున్నా యాత్రలో ఉన్న చంద్రబాబు వద్దకు పరుగులు తీయగా త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జిల్లా పార్టీ పెద్దలతో నిర్వహించిన బాబు పంచాయితీకి మాజీ మంత్రులు తమ్మినేని సీతారాం, కిమిడి కళావెంకట్రావులు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. వీరితో మాట్లాడి ఇన్‌చార్జి బాధ్యతలు విషయమై నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేసిన బాబు అకస్మాత్తుగా కింజరాపు వారసునికే పగ్గాలు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంపై టిడిపిలో సీనియర్ నేతలుగా ఉన్న తమ్మినేని, కళాలు బాబు ఎలా స్పందిస్తారోనన్న చర్చ తమ్ముళ్లలో ప్రారంభమైంది.
పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తా
దివంగత ఎర్రన్నాయుడు అడుగుజాడలో నడిచి, కార్యకర్తలతో కలసికట్టుగా పనిచేసి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని ఎర్రన్న తనయుడు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం నాయుడును పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జిగా నియమించినట్లు పార్టీ అధిష్ఠానం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజాసదన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడతానన్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు, జిల్లా ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా తనను ప్రజా సదన్‌లో కలియవచ్చని, ప్రజాసదన్‌ను ప్రజావేదికగా మారుస్తానని చెప్పారు. తన తండ్రి అడుగుజాడలో నడిచి, పార్టీ కార్యకర్తలు, యావత్ జిల్లా నాయకులతో సమన్వయంగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం సంతరించుకునే విధంగా కృషి చేస్తానన్నారు. వయసులో చిన్నవాడినైనా నాపై నమ్మకముంచి నాకు పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. బాబు నమ్మకాన్ని ఏనాడూ వమ్ము చేయనని, జిల్లా నాయకుల అండదండలతో, కుటుంబ సభ్యుల ఆశీస్సులతో ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.
అవినీతిని అరికట్టేందుకు ఆర్‌టి యాక్టు

మంత్రి కోండ్రు
రేగిడి, డిసెంబర్ 9: దేశంలో అవినీతిని అరికట్టేందుకు యుపిఎ ప్రభుత్వం ఆర్‌టి యాక్టును ప్రవేశ పెట్టిందని రాష్ట్ర వైద్యవిద్యాశాఖా మంత్రి కోండ్రు మురళీమోహన్ పేర్కొన్నారు.ఆదివారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకునేందుకు ఈ చట్టాన్ని అమలు చేశారన్నారు.ప్రతి నిరుపేద కుటుంబానికి 35కిలోల బియ్యం, గోదుమలు సరఫరాకు బిల్లు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలని శాసనసభలో ప్రవేశపెట్టారన్నారు. సోనియా నాయకత్వంలో సుస్థిర పాలన కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కాంగ్రెస్‌కు 2014లో పట్టం కట్టాలని కోరారు. రాష్ట్రంలో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వైద్యవిద్యకు పెద్దపీట వేయడంతో పాటు పలు సంక్షేమ పథకాల అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. విద్యకోసం రాష్ట్ర ప్రభుత్వం 22వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నట్లుతెలిపారు. ఒకటవ తరగతి నుండి పి జి విద్యార్థులకు సంబంధించి ఐదు లక్షల మందికి పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికి 6500కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు.

కాంగ్రెస్‌లో కొరవడిన ‘సహకారం’

పలాస నియోజకవర్గంలో పిఎసిఎస్ అధ్యక్ష పీఠానికి పోటాపోటీ
పలాస, డిసెంబర్ 9: ఎట్టకేలకు సహకార పరపతి సంఘాల ఎన్నికలకు సర్కార్ గంట మోగించడంతో రాజకీయనేతల్లో ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది. దీంతో ఆధిపత్య పోరుతో పాటు వర్గ రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. నియోజకవర్గంలో ఉన్న పలాస, మందస, వజ్రపుకొత్తూరు పిఎసిఎస్ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్‌లో నేతలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా పలాస సహకార పరపతి సంఘం అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంది. స్వయంగా కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుందామని సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జగన్నాయకులు ఎదుటే నేతలు తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత తమ వర్గీయులకే అధ్యక్ష పదవి కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే సమక్షంలో కార్యకర్తలు మనోభావాలు వెల్లబుచ్చినప్పటికీ ఎమ్మెల్యే కార్యకర్తల మనస్సులను నొప్పించకుండా ఉండేందుకు గాను ప్రత్యక్షంగా గెలుపొంది రావాలని సూచించినట్లు భోగట్టా. అధ్యక్ష పదవి పోటీ పడే వారి పేరు ప్రకటించినట్లైతే సహకార పరపతి సంఘంలో పలువురు రైతులను సభ్యులుగా చేర్పించే బాధ్యత వారు భుజాన వేసుకుంటారని, కార్యకర్తలు పట్టుబట్టడంతో ఎమ్మెల్యే దీనిపై ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ జిల్లాకు చెందిన కేంద్రమంత్రి, మరో ముగ్గురు రాష్ట్ర మంత్రులతో పాటు డిసిసి అధ్యక్షుడు సూచనల మేరకు అధ్యక్ష పేరును ప్రకటించడం జరుగుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదిలావుండగా అధ్యక్ష పదవి కోసం క రూరల్, అర్బన్ నుంచి పార్టీలో పోటీ ప్రారంభమైంది. రూరల్‌కు చెందిన నాయకుడు కీలకమైన రాజకీయ పదవిలో కొనసాగుతూ తన భార్యను పిఎసిఎస్ ఎన్నికల రంగంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆ నేతకు రూరల్‌లో కార్యకర్తలతో సత్స్‌ంబంధాలు ఉండడంతోపాటు స్వతహాగా రైతు కావడంతో కార్యకర్తలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదే స్థాయిలో పార్టీలో కీలకంగా ఉంటున్న మరోనేత తన అనుచరుడికి అధ్యక్ష పదవి వచ్చేలా చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఇదే విధంగా మందస, వజ్రపుకొత్తూరు పిఎసిఎస్ అధ్యక్ష స్థానం కోసం కార్యకర్తల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇదే జరిగితే సహకార ఎన్నికలలో పార్టీకి తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశే్లషికులు భావిస్తున్నారు.

వైభవంగా ఆదిత్యుని కల్యాణం
శ్రీకాకుళం(కల్చరల్), డిసెంబర్ 9: కార్తీకశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానంలో ఆదివారం ఆదిత్యుని కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నిర్వహణలో స్వామివారికి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి అనివేటి మండపం వద్ద స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. స్థానిక భక్తులతోపాటు సుధూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ ఇఒ ప్రసాద్‌పట్నాయిక్, ట్రస్టు బోర్డు సభ్యులు సూర్యనారాయణ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారికి నిర్వహించిన దీపారాధన పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

యువతతోనే అవినీతి రహిత పాలన
యువసత్తా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంబాబు
శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 9: అవినీతి రహిత పాలన యువతతోనే సాధ్యమని యువసత్తా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచాది రాంబాబు అన్నారు. ఆదివారం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని యువసత్తా ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సు నుండి సాగిన ర్యాలీ డే అండ్ నైట్ కూడలి వరకు సాగింది. ర్యాలీ ఆసాంతం విద్యార్థులు అవినీతి వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం డే అండ్ నైట్ కూడలి వద్ద అవినీతి రాక్షసి పేరుతో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ అవినీతి తాయిలాల చుట్టూ తిరుగుతున్న రాజకీయాన్ని మార్చి ప్రజల చుట్టూ తిప్పే శక్తి యువతతోనే సాధ్యమవుతుందన్నారు. అవినీతి అంతానికి బలమైన లోకాయుక్త చట్టం ఎంతో అవసరమని అందుకోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తకోట పోలినాయుడు, రాష్ట్ర కార్యదర్శి ప్రొపెషర్ డి.విష్ణుమూర్తి, సురాజ్య ఉద్యమ కమిటీ అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, లోక్‌సత్తా జిల్లా నాయకులు బి.పల్గుణరావు, బి.జగదీష్, వి.అప్పలరాజు, టి.అన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

కిడ్నీ బాధిత గ్రామాలలో చైతన్యశిబిరాలు
* డిఎంహెచ్‌ఒ గీతాంజలి
సారవకోట, డిసెంబర్ 9: జిల్లాలో కిడ్నీ సంబంధిత రోగాలతో బాధపడుతున్న గ్రామాల్లో ప్రత్యేక చైతన్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి ఆర్.గీతాంజలి తెలిపారు. మండలంలో బుడితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం సందర్శించిన ఆమె విలేఖరులతో మాట్లాడారు. మండలంలో కూర్మనాథపురం, జమచక్రం, అలుదు గ్రామాలలో కిడ్నీ రోగులు అధిక సంఖ్యలో ఉన్న విషయాన్ని ప్రస్తావించగా ఆమెపై విధంగా స్పందించారు. కేవలం తాగునీటి వలన మాత్రమే కిడ్నీరోగాలు వస్తాయనడం సమంజసం కాదన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరునెలలుగా ఐరన్ మాత్రలు లేవన్న విషయాన్ని తెలుసుకున్న ఆమె ఆశ్యర్యం వ్యక్తం చేశారు. గతంలో వివిధ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మందులు కొనుగోలుకు 52 లక్షలు కేటాయిస్తే ప్రస్తుతం 1.62 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. అదే విధంగా సర్జికల్ బడ్జెట్ కూడా మూడురెట్లు పెరిగిందని చెప్పారు. నిధుల నుండి అత్యవసర మందులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్‌పిహెచ్‌ఒ కృష్ణమోహన్‌ను ఆయన ఆదేశించారు. సక్రమంగా పనిచేయని వైద్యాధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. జిల్లా జవహర్‌బాలల ఆరోగ్యరక్ష కోఆర్డినేటర్ మెండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మోగిన అయ్యప్ప శరణుఘోష

శ్రీకాకుళం(కల్చరల్), డిసెంబర్ 9: హరిహర సుతుడైన అయ్యప్పస్వామికి చేసే కలశహరణ పూజల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. పట్టణ పరిధి బలగ అయ్యప్పస్వామి దేవాలయంలో ఆదివారం ఆలయ ప్రధానార్చకులు దేవరకొండ శంకరనారాయణశర్మ నిర్వహణలో సహస్తక్రలశారాధన, పూర్ణకలశ స్థాపన మండపారాధన పూజలు జరిగాయి. గృహనిర్మాణ శాఖకు చెందిన 141 మంది స్వాములు, ఇతర భక్తులు, మహిళలు పవిత్ర కలశాలను చేపట్టి అయ్యప్పస్వామి గర్భగుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షణలు చేసి శరణఘోష చదివారు. ఆరాట్టు ఉత్సవంలో భాగంగా స్వామి మూలవిరాట్‌కు నవవిధ ద్రవ్య అభిషేకాలు, అలంకారసేవలు జరిగాయి. అర్చకులు దబ్బముళ్ల ప్రభాకరశర్మ పూర్ణకలశంతో స్వామికి క్షీరాభిషేక పూజలు చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పి.డి పి.శ్రీరాములు, ఎం.రాధాకృష్ణ, గణపతి, నాగేశ్వరరావులతోపాటు స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

* వచ్చే నెల 21న నోటిఫికేషన్ * 31న ఎన్నికలు * సభ్యత్వ నమోదులో పార్టీలు బిజిబిజీ
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>