న్యూఢిల్లీ, డిసెంబర్ 10: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ఈనెల 18న జరిగే ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందని మార్కెట్ వర్గాలు ఆశతో చూస్తుండగా, మరోపక్క ఈసారి కూడా పాలసీ రేట్లలో మార్పు వుండబోదని, సిఆర్‌ఆర్‌లో స్వల్ప తగ్గింపునకు అవకాశం వుందని ఒక పరిశోధన నివేదిక వెల్లడించింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగం ఆర్‌బిఐ వద్ద జమచేసే నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్) మరో పావుశాతం తగ్గించే అవకాశం వుందని బ్యాంక్ ఆఫ్ అమెరికామెరిల్ లించ్ తమ నివేదికలో పేర్కొంది. 18నాటి ద్రవ్య పరపతి విధానంలో ఆర్‌బిఐ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సిఆర్‌ఆర్ 0.25% తగ్గించవచ్చని తెలిపింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే జనవరి నుంచి రెపోరేట్లపై ఆర్‌బిఐ దృష్టి సారిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం ఆమోదయోగ్యమైన స్థాయికి పరిమితమైతే వచ్చే జనవరి నుంచి జూలై వరకు 75 బేసిస్ పాయింట్ల పరిధిలో రెపోరేట్లను తగ్గించవచ్చని నివేదిక తెలిపింది. అయితే ఆర్‌బిఐ రేట్లు తగ్గించినా వ్యవస్థలో లిక్విడిటీ స్థితి మెరుగుపడే వరకూ రుణాల వ్యయం తగ్గే అవకాశం లేదని పేర్కొంది.
గడచిన మూడునెలల్లో ఆర్‌బిఐ సిఆర్‌ఆర్‌ను 0.50% మేరకు తగ్గించింది. ద్రవ్యోల్బణంపై చాలా కాలంగా పోరుతున్న రిజ ర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం 7.5 శాతం స్థాయిలో ఉన్న ప్రస్తుత తరుణంలో పాలసీ రేట్లు తగ్గించే సాహసం చేయదనే బిఒఎ ఎంఎల్ అభిప్రాయపడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ టోకుధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం గత మూడేళ్లుగా ఆర్‌బిఐ ఆమోద స్థాయి 5-5.5% కంటే ఎగువనే కొనసాగుతోంది.
* సిఆర్‌ఆర్ పావు శాతం కోతకు అవకాశాలు * ఆర్‌బిఐ పాలసీపై పరిశోధన నివేదిక వెల్లడి
english title:
v
Date:
Tuesday, December 11, 2012