నిజామాబాద్, డిసెంబర్ 10: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఛత్తీస్‌గడ్ తరహాలో సేద్యపు రంగానికి ఒకే విడతలో 8గంటల పాటు నిరంతరంగా ఉదయం వేళలో నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని, చేనేత కార్మికుల ప్రైవేట్ అప్పులపై మారటోరియం ప్రకటిస్తామని హామీల వర్షం గుప్పించారు. తెలంగాణ బిడ్డలు రుణ విముక్తులై, ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశ్యంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌కు సన్నిహితుడిగా కొనసాగిన ప్రముఖ వ్యాపారవేత్త బస్వా లక్ష్మీనర్సయ్యతో పాటు పలువురు టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు సోమవారం కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగిస్తూ, తన సహజశైలికి భిన్నంగా వాగ్దానాలతో హోరెత్తించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న రుణమాఫీ ప్రకటనలన్నీ కల్లిబొల్లి కబుర్లుగా ఓ వైపు కొట్టిపారేస్తూనే, తాను మాత్రం అన్ని అంశాలను కూలంకశంగా అధ్యయనం చేసిన మీదటే లక్ష రూపాయల్లోపు ఉన్న పంట రుణాలన్నింటిని మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ‘కెసిఆర్ మాట అంటే శిలాశాసనం..తన తల తెగిపడినా అది అమలు కావాల్సిందే’నంటూ ఉద్వేగపూరిత ప్రసంగం ద్వారా నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు.
సీమాంధ్ర దయాదాక్షిణ్యాలపై తెలంగాణ ప్రజలు ఆధారపడాల్సిన అవసరం లేదని, మన పరిస్థితులను చక్కదిద్దుకునే శక్తి సామర్థ్యాలు, అపార వనరులు మనకు ఉన్నందున టిడిపి, వైఎస్సార్‌సిపి హామీలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను మినహాయిస్తే తెలంగాణలోని తొమ్మిది జిల్లాలలో పంట రుణాలకు సంబంధించి 21లక్షల బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ప్రతి రైతుకు లక్ష రూపాయల చొప్పున రుణం మాఫీ చేసేందుకు 10 నుండి 12వేల కోట్ల రూపాయలు మాత్రమే అవసరమవుతాయని కెసిఆర్ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రానికి ప్రధాన శాఖల ద్వారా సమకూరుతున్న ఆదాయంలో సింహభాగం తెలంగాణ ప్రాంతం నుండే ఖజానాకు చేరుతోందని చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే చూసినా.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా మొత్తం 35వేల కోట్ల ఆదాయం రాగా, అందులో తెలంగాణలోని పది జిల్లాల నుండి 29,500కోట్లు సమకూరిందని, ఆంధ్రా ప్రాంతం నుండి కేవలం 5,500కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. ఇదే తరహాలో ఎక్సైజ్ శాఖ ద్వారా తెలంగాణ జిల్లాల నుండి 6300కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుండగా, ఆంధ్రా ప్రాంతం నుండి 3385కోట్లు, రవాణా శాఖపరంగా తెలంగాణ నుండి 1564కోట్లు ఆదాయం ఖజానాలో జమ అవుతుండగా, ఆంధ్రా ప్రాంతం నుండి 1426కోట్లు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా తెలంగాణ నుండి 2836కోట్ల ఆదాయం వస్తుంటే, ఆంధ్రా ప్రాంతం నుండి 2796కోట్లు సమకూరుతోందని అన్నారు. మొత్తంగా చూస్తే పై నాలుగు శాఖల ద్వారానే తెలంగాణ ప్రాంతం నుండి 39,900కోట్లు ఆదాయం వస్తుండగా, ఆంధ్రా ప్రాంతం నుండి కేవలం 13,178కోట్లు సమకూరుతోందన్నారు.
హాస్టళ్లలో కొనుగోలు కమిటీలు
మెనూ అమలుకు ప్రత్యేక ప్రణాళిక : పితాని
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 10: సంక్షేమ హాస్టళ్లలో మెనూ అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రధానంగా ఆహార పదార్థాల కొనుగోలులో అసమానతలు చక్కదిద్దేందుకు కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేస్తోంది. పౌర సరఫరాల శాఖ ద్వారా సబ్సిడీపై సరుకులను అందించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఇందులోభాగంగానే ప్రతి జిల్లాలోనూ కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం ఆయన శాసన మండలి ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ హాస్టళ్లలో మెనూ అమలుపై కఠిన వైఖరిని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఒకే రకమైన సరుకును ఒక ప్రాంతంలో ఒక ధరకు, మరొక ప్రాంతంలో వేరొక ధరకు కొనుగోలు చేసే విధానాన్ని నివారించేందుకు, అన్ని ప్రాంతాల్లో ఒక సరుకును ఒకే ధరకు కొనుగోలు చేసేలా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇదే సమయంలో హాస్టళ్లలో ఆహార పదార్థాల తయారీ భారాన్ని తగ్గించేందుకు సబ్సిడీపై సరుకులను అందించే కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నట్లు చెప్పారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. కాగా, అన్ని హాస్టళ్లలో ఒకే రకమైన మెనూ అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ఎస్టీ హాస్టళ్లు ఉన్న ప్రాంతంలో విద్యార్థులకు అక్కడి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా భోజనాన్ని అందించాల్సి ఉంటుందని, దీనికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్వర్యంలో అధికారులు అధ్యయనం చేస్తున్నారని మంత్రి పితాని వెల్లడించారు.