హైదరాబాద్, డిసెంబర్ 10: ‘హస్తిన రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నానంటూ తమరు గొప్పగా చెప్పుకునే రోజుల్లో పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టాపన చేయించలేదు?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరుతూ తన సతీమణి, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి ఇప్పటి వరకు 12 లేఖలు రాశారని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన జరగకుండా పురంధ్రీశ్వరి అడ్డుపడ్డారని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు సోమవారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. 11 సంవత్సరాలుగా చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసినా తాము ప్రతిస్పందించలేదని ఆయన తెలిపారు. ఇప్పుడు వాస్తవాలు ఏమిటో ప్రజలకు చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చానన్నారు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం కుటుంబ సభ్యులందరి సంతకాలు తీసుకున్నప్పుడు పురంధ్రీశ్వరి సంతకం చేయలేదని చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సంతకం కోసం మీరు ఎవరిని పంపించారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. పురంధ్రీశ్వరిని దోషిగా నిలబెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ‘చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నానని గొప్పగా చెప్పుకునే రోజుల్లో ఏమి చేశారు? గుడ్డి గుర్రానికి పండ్లు తోమారా? లేక కుంభ కర్ణుని తరహాలో నిద్ర పోయారా? అని ఆయన ప్రశ్నించారు. నాడు జిఎంసి బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడు, దేవేగౌడ, ఐకె గుజ్రాల్ ప్రధాన మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టించేందుకు చంద్రబాబు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఏమిటని ఆయన ప్రశ్నించారు. పురంధ్రీశ్వరి 2006 సంవత్సరం కంటే ముందు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారని ఆయన తెలిపారు. 2009 సంవత్సరంలో మీరాకుమార్ లోక్‌సభ స్పీకర్ అయిన తర్వాత కూడా లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.
శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టించలేదని దగ్గుబాటి ప్రశ్నించారు. బేగంపేట టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు బిజెపి నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు చొరవ తీసుకున్నారని ఆయన తెలిపారు. కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా వక్రభాష్యాలు చెప్పడం మానుకోవాలని, లేదంటే ప్రజలు హర్షించరని ఆయన అన్నారు. బాబు చేపట్టిన పాదయాత్ర గురించి తాము ఏమీ మాట్లాడలేదని ఆయన చెప్పారు. తాను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకునే రోజులు పోయాయని, ఏది మాట్లాడినా రాసే మీడియా ఉందని చంద్రబాబు అనుకోవడం సరికాదని, అధికారం కోసమే ఆయన తమను విమర్శిస్తున్నారని దగ్గుబాటి అన్నారు.
రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు కొన్ని పార్టీలు ఎన్టీఆర్‌ను విమర్శిస్తే పురంధ్రీశ్వరి సహించలేదని ఆయన గుర్తు చేశారు. అప్పుడు జరిగిన ఓటింగ్‌లో పురంధ్రీశ్వరి పాల్గొనకుండా పార్టీ జారీ చేసిన ‘విప్’ను కూడా ధిక్కరించారని అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం రాబోతున్న సమయంలో ఓటింగ్‌కు గైర్హాజర్ కావద్దంటూ జైరాం రమేష్ ప్రభృతులు సూచించినా ఖాతరు చేయలేదని ఆయన తెలిపారు. దీంతో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోపగించుకోలేదని, పైగా తండ్రి మీద గౌరవం అంటే ఇలా ఉండాలని వ్యాఖ్యానించారని ఆయన చెప్పారు. బాలయోగి స్పీకర్‌గా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల గురించి ఇప్పుడు చెబితే ఆయనకు కోపం వస్తుందని, ఎన్టీఆర్‌ను మరిపించేందుకు సభ్యత్వ నమోదు రశీదులు, ఇతరత్రా పుస్తకాలు, ప్రచార సామాగ్రిపై ఎన్టీఆర్ బొమ్మ వేయరాదని చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారని దగ్గుబాటి చెప్పారు.
పార్లమెంట్‌లో ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయంచలేదు?.. బాబుపై దగ్గుబాటి ‘ఫైర్’
english title:
a
Date:
Tuesday, December 11, 2012