హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయవద్దని డిమాండ్ చేస్తున్నట్టు టిడిపి తెలిపింది. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని, ఒక్కో పార్టీ నుంచి ఒక్కరినే ఆహ్వానించాలని, టిడిపి నుంచి ఒక్కరే వెళతారని టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పత్తి రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌పై టిడిపి ఎమ్మెల్యేలు టిడిఎల్‌పి కార్యాలయంలో సోమవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దు కృష్ణమనాయుడు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, సండ్ర వెంకటవీరయ్య తదితరులు విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణపై అఖిలపక్ష సమావేశం గురించి విలేఖరులు ప్రశ్నించగా, వాయిదా వేయాల్సిన అవసరం లేదని దయాకర్‌రావు తెలిపారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రికి లేఖ రాసింది తమ పార్టీయేనని, ఈ సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఒక్కరినే పిలవాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరిని చెప్పినా చెప్పకపోయినా టిడిపి వైఖరి మాత్రం స్పష్టం చేస్తామన్నారు. ఈ అంశాన్ని ఇతర పార్టీలపైకి రుద్దడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని తర్వాత చెబుతామంటే అది తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడమే అవుతుందన్నారు. తెలుగు సభల కోసం అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి చేసిన డిమాండ్ సరికాదని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిందేనని అన్నారు. అన్ని పార్టీలు కోరితే అఖిలపక్షం వాయిదా వేస్తామని హోంమంత్రి షిండే చేసిన ప్రకటనను విలేఖరులు ప్రస్తావించగా, టిడిపి వాయిదా కోరబోదని, అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిందే తామని అన్నారు. అఖిలపక్షంలో కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించకుండా ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టాలని కుట్ర పన్నుతోందని దయాకర్‌రావు అన్నారు.కామన్‌వెల్త్ యువజన సదస్సుకు
భాగ్యనగరం ఆతిథ్యం
నిరుద్యోగం, విద్యపై చర్చ : స్పీకర్ మనోహర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 10: కామన్‌వెల్త్ యువజన సదస్సుకు (6వ) రాష్ట్ర రాజధాని భాగ్యనగరం వేదిక కాబోతున్నది. ఇటీవల లండన్‌లో జరిగిన సిపిఎ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించేందుకు చేసిన కృషి ఫలించింది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత కామన్‌వెల్త్ యువజన సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. సుమారు 54 దేశాల నుంచి, 175 బ్రాంచ్‌ల నుంచి ఇద్దరేసి సభ్యులు చొప్పున అంటే సుమారు 350 నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే దీనిపై తాను ఇంకా లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌తో, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో ఇంకా చర్చించాల్సి ఉందని ఆయన చెప్పారు. నిరుద్యోగం, ఉచిత విద్య అవశ్యకత అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సు వేదికను ఖరారు చేయాల్సి ఉందని అన్నారు. నిరుద్యోగంపై చర్చించాలనుకుంటున్నందున వివిధ వర్సిటీలకు చెందిన విద్యార్థులకూ ఈ సదస్సులో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలనుకుంటున్నట్లు సూత్రప్రాయంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీల విద్యార్థులకేనా? లేక దేశంలోని వివిధ వర్సిటీలకు చెందిన విద్యార్థులకూ అవకాశం కల్పించాలా? అనేది నిర్ణయం కాలేదని అన్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన సదస్సు
పార్లమెంటు తరహాలో త్వరలో ఏర్పాటు చేయబోతున్న స్టాండింగ్ కమిటీల గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు జనవరి 7 నుంచి రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
సభ గౌరవం పెంచే విధంగా..
స్పీకర్‌గా తాను అసెంబ్లీ గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ నెల 2న అసెంబ్లీలో ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికపై చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాల కోరిక మేరకు 12వ సవరణపై ఓటింగ్‌కు అనుమతించానని చెప్పారు. ఓటింగ్ సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీయడానికి అనుమతించరాదన్న నియమం ఏమీ లేదని అన్నారు. అసెంబ్లీకి వచ్చే ముసాయిదా బిల్లులు, ఇతరత్రా అంశాల లోటుపాట్ల గురించి సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. అసెంబ్లీ కార్యాలయం కూడా అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఎక్కడెక్కడ కోర్టు పరిథిలో ఏయే అంశం ఉందన్న సమాచారం సమగ్రంగా ఉండే అవకాశం లేదని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృత్తం కాకుండా ఉండేందుకు ఒక ప్రొటోకాల్, పద్ధతిని అనుసరించబోతున్నామని అన్నారు.
ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఎస్‌సి రిజర్వేషన్ల అంశాన్ని సుప్రీంకోర్టు కేంద్రానికి పంపుతూ రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చని సూచించడం వంటి అంశాల విషయంపై సలహా తీసుకునేందుకు అడ్వకేట్ జనరల్‌ను సభకు పిలిపించాలని సభ్యులు చేసిన డిమాండ్ గురించి ప్రశ్నించగా, అన్ని పార్టీల అభిప్రాయాల మేరకు సమస్య పరిష్కారమైందని స్పీకర్ తెలిపారు. అయితే అత్యవసరమైనప్పుడు అడ్వకేట్ జనరల్‌ను అసెంబ్లీకి పిలిపించి సూచనలు, సలహాలు తీసుకోవచ్చని ఆయన చెప్పారు.
మోడీ విజయం కోసం గుజరాత్ చూపు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 10: గుజరాత్ రాష్ట్రం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి అఖండ విజయం కోసం ఎదురుచూస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు కిషన్‌రెడ్డి పాత్రికేయులతో మాట్లాడారు. సోమవారం నాడు సూరత్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఈ నెల 13, 17 తేదీల్లో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా వస్తాయన్నారు. దేశంలోని మేథావులు, పారిశ్రామిక వేత్తలు, యువకులు, సామాజిక కార్యకర్తలు, రైతులు, మహిళలు మోడీ విజయాన్ని మనసారా కోరుకుంటున్నారని, గుజరాత్ సర్వతోముఖాభివృద్ధికి గత దశాబ్దకాలం పాటు మోడీ చేసిన నిర్విరామ కృషి శ్లాఘనీయమని చెప్పారు. మోడీని ఓడించే సత్తా ఏ పార్టీకీ లేదని, ఆయనపై కాంగ్రెస్ పసలేని విమర్శలు చేస్తోందని వ్యాఖ్యానించారు. కుహనా లౌకికవాదంతో ప్రజలను విడగొట్టి పరిపాలించే నైజం కాంగ్రెస్ పార్టీదేనని, ప్రజల జీవితాలతో ఆ పార్టీ చెలగాటమాడుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గత పదేళ్లలో ఒక్క మత ఘర్షణ కూడా గుజరాత్‌లో చోటు చేసుకోలేదని, కాని మోడీని మతవాదిగా చిత్రీకరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, మహాత్మాగాంధీ ఆశయాలను తుంగలో తొక్కి విదేశీ కంపెనీల ముందు మోకరిల్లుతోందని అన్నారు. గుజరాత్‌లో లక్షలాది మంది తెలుగు ప్రజలు, ముఖ్యంగా నేత కార్మికులు, వస్తవ్య్రాపారులు మోడీపాలన పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పారు.
ఎన్టీఆర్‌కు ‘్భరత రత్న’ ఇప్పించాలి
దగ్గుబాటికి టిడిపి సవాల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 10: కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావులకు దమ్ముంటే ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ప్రకటింపజేయాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇ పెద్దిరెడ్డి సవాల్ చేశారు. తొమ్మిదేళ్ల పాటు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకున్నారు కానీ కనీసం ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటుకు ప్రయత్నించలేదని దగ్గుబాటి దంపతులు చేసిన విమర్శలను పెద్దిరెడ్డి ఖండించారు. దగ్గుబాటి దంపతులకు దమ్ముంటే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించాలని, అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టించాలని డిమాండ్ చేశారు.