లండన్, డిసెంబర్ 10: సామర్థ్యం, నైపుణ్యం, ఉన్నత ప్రమాణాలు అన్న అంశాలు టీమిండియా క్రికెటర్లలో మాయమైపోతున్నాయని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వంటి టోర్నమెంట్స్‌తోపాటు, వ్యాపార ప్రకటనలు, అండార్స్‌మెంట్లు, ఇతరత్రా మార్గాల ద్వారా కోట్లకు పడగలెత్తిన క్రికెటర్లు దేశం గురించిగానీ, దేశ ప్రతిష్ఠ గురించిగానీ, అభిమానుల ఆశల గురించిగానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్రవిడ్ గుర్తుచేశాడు. అయితే, అన్నిటినీ మించి సామర్థ్యం, నైపుణ్యం ఆటగాళ్లలో కొరవడడమే తనను ఆందోళనకు గురి చేస్తున్నదని అన్నాడు. దేశవాళీ పోటీల్లో నాణ్యత కొరవడిన కారణంగానే భారత క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్‌లలో విఫలమవుతున్నారని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ఓటమి కంటే, భారత జట్టు ఓటమిపాలవుతున్న తీరు అందరినీ బాధిస్తున్నదని అన్నాడు. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని ఇంగ్లాండ్ జట్టు ప్రత్యక్షంగా చూపిస్తున్నదని తెలిపాడు. ‘ఎ’ స్థాయి జట్ల పర్యటనలు అత్యవసరమని, ఈ విషయంలో క్రికెట్ బోర్డు అధికారులు దృష్టి సారించాలని అన్నాడు. యువ ఆటగాళ్లకు ముందుగా క్రికెట్ టెక్నిక్‌ను వివరించాల్సిన అవసరం ఉందన్నాడు. వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొన్న భారత జట్టు ఇప్పటికైనా పాఠాలు నేర్చుకొని, నాగపూర్ టెస్టులో ఎదురుదాడికి దిగాలని హితవు పలికాడు. కెరీర్‌లో 164 టెస్టులు ఆడిన ద్రవిడ్ 13,288 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల జాబితాలో సచిన్ తెండూల్కర్ తర్వాతి స్థానం అతనిదే. సచిన్, వివిఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, వీరేందర్ సెవాగ్ వంటి సహచరులతో కలిసి ద్రవిడ్ ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో పాతుకుపోయి, వికెట్లు పడకుండా అడ్డుకుంటాడు కాబట్టి అతనికి ‘ది వాల్’ అన్న పేరు స్థిరపడిపోయింది. వివాదాలకు, ప్రకటనలకు ఎప్పుడూ దూరంగా ఉండే ద్రవిడ్ ఇంత తీవ్రంగా స్పందించాడంటే, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో టీమిండియా ఎంత ఘోరంగా ఆడుతున్నదో ఊహించడం కష్టం కాదు.
టీమిండియా ఆటగాళ్లపై రాహుల్ ద్రవిడ్ ఆగ్రహం
english title:
s
Date:
Tuesday, December 11, 2012