
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: గాయంతో బాధపడుతున్న భారత యువ ఆటగాడు మనోజ్ తివారీకి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు. దీనితో అతను ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌కు అందుబాటులో ఉండడు. పాకిస్తాన్‌తో జరిగే సిరీస్‌లోనూ అతను ఆడడం అనుమానంగానే ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న తివారీ ఇటీవల గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ తరఫున 191 పరుగులు సాధించాడు. అంతకు ముందు ఇంగ్లాండ్‌ను ఢీకొన్న బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ తరఫున ఆడినప్పుడు 93 పరుగులు చేశాడు. బెంగాల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న తివారీకి ఇంగ్లాండ్‌తో జరిగే టి-20 సిరీస్‌లో స్థానం ఖాయంగా కనిపించింది. కానీ, వీపు కండరాలు చిట్లడంతో అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సిఎ)లో ఫిజియోథెరపిస్టు నితిన్ పటేల్ పర్యవేక్షణలో చికిత్స పొందనున్నాడు. ఇలావుంటే, తివారీ స్థానంలో మరో ఆటగాడిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఇంకా ప్రకటించలేదు.