జామ్‌నగర్, డిసెంబర్ 11: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా పాల్గొన్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్రంలో అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్న ‘మార్కెటీర్’గా అభివర్ణించారు. ‘గుజరాత్‌లో ప్రజల గొంతు వినిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మీ బాధలు వినాలనుకోవడం లేదు. ఆయన గొంతు మాత్రమే వినపడాలనుకుంటున్నారు. ఆయనకు ఒక కల ఉంది. ఆయన తన కల గురించే ఆలోచిస్తారు. నిజమైన నాయకుడు ప్రజలు తమ సొంత కలలు కనాలనుకుంటాడు’ అని మంగళవారం సౌరాష్టల్రోని జామ్‌నగర్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ రాహుల్ అన్నారు. గుజరాత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అంటూ, అయితే వాస్తవానికి రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరి పోయిందని, నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉందని, అన్ని రంగాల్లోను వైఫల్యం ఉందని అన్నారు. ‘గుజరాత్ వెలిగిపోతోందని మార్కెటీర్ అంటున్నారు. అయితే ప్రజలకు ఎన్ని గంటలు తాగునీళ్లు లభిస్తున్నాయో చెప్పండి? మూడు రోజులకోసారి 25 నిమిషాలు మాత్రమే జనానికి నీళ్లు వస్తున్నాయి. అంతేకాదు, రాష్ట్రంలో పదిలక్షల మంది నిరుద్యోగ యువకులున్నారు. అయినప్పటికీ మార్కెటీర్ మాత్రం గుజరాత్ వెలిగి పోతోందంటున్నారు’ అని ఆయన అన్నారు. పేదలు, అట్టడుగు వర్గాల గొంతులను నొక్కేస్తున్నారని, ఎందుకంటే ముఖ్యమంత్రి సామాన్య ప్రజల బాధలు వినాలనుకోవడం లేదని రాహుల్ అన్నారు. ‘గాంధీజీ, నెహ్రూజీ ఎప్పుడు కూడా ప్రజల వాణిని వినాలనుకునేవారు. వాళ్లు నిజమైన నాయకులు’ అని కూడా ఆయన అన్నారు. చివరికి ప్రతిపక్షాల గొంతును కూడా అడ్డుకుంటున్నారని, ఎందుకంటే రాష్ట్రంలో అసెంబ్లీ ఏడాదికి 25 రోజులు మాత్రమే సమావేశమవుతోందని, ప్రతిపక్షాల నాయకులను తరచూ సభ నుంచి గెంటివేస్తున్నారని ఆయన అన్నారు. గుజరాత్‌లో లోకాయుక్త లేనే లేదని, 14 వేల ఆర్‌టిఐ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఎందుకంటే ఏదయినా సమాచారం ఇస్తే అది తమ అసలు రంగును బయటపెడుతుందేమోనని ప్రభుత్వానికి భయమని ఆయన అన్నారు. ప్రతి భారతీయుడి గొంతేకాదు, ప్రపంచంలోని అందరి వాణి వినాలనే ఒకే సిద్ధాంతం గాంధీజీకి ఉండేది. అతను పేదవాడా, ధనవంతుడా.. ప్రాంతం, మతం, కులంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి వాదనను గౌరవించాలనే వాడని ఆయన అంటూ, ‘నాకు రాజకీయాల్లో ఎవరైనా గురువు ఉన్నాడంటే అది గాంధీ మహాత్ముడే’నని చెప్పారు. అయితే గాంధీ పుట్టిన గడ్డ అయిన గుజరాత్‌లో మహాత్ముడి బోధనలను అనుసరించడం లేదని ఆయన అన్నారు. ‘యుపిఏ ప్రభుత్వ కార్యక్రమాలే కాదు, గత అరవై, డెబ్భై ఏళ్ల కార్యక్రమాలు ఏవయినా తీసుకోండి. ఎవరి గొంతునైనా నొక్కే ఒక్క కార్యక్రమమైనా ఉందేమో చెప్పండి’ అని రాహుల్ గాంధీ అన్నారు. గాంధీజీ సిద్ధాంతమే గుజరాత్ సిద్ధాంతమని, మీ వల్ల, మీ సిద్ధాంతాల వల్ల మాత్రమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని రాహుల్ గాంధీ సభకు హాజరయిన జనాన్ని ఉద్దేశించి అన్నారు.
రాష్ట్భ్రావృద్ధిపై తప్పుడు ప్రచారం జామ్‌నగర్ ఎన్నికల సభలో రాహుల్ ధ్వజం
english title:
modi
Date:
Wednesday, December 12, 2012