న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వాల్‌మార్ట్ లాబీయింగ్, ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో ఎస్‌సి, ఎస్‌టి కోటా అంశాలపై పార్లమెంట్ ఉభయసభల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యుపిఎ అధినేత్రి సోనియాగాంధీ చర్చించారు. పరిష్కార మార్గాలను అనే్వషించారు. మంగళవారం ఉదయం రాజ్యసభ, లోక్‌సభ వాయిదాపడిన తర్వాత పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ గ్రూప్‌లోని యుపిఎ సీనియర్లంతా కలుసుకున్నారు. వీరిలో మన్మోహన్, సోనియాతోపాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మరికొందరున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కమల్‌నాథ్ ఉభయసభల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు. కాగా, రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గొడవ సద్దుమణిగిందనుకుంటే, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారత్‌లో జరిపిన లాబీయింగ్ తెరపైకి రావడంతో ఉభయసభల్లో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో ఎస్‌సి, ఎస్‌టి కోటాపై సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ వ్యక్తం చేస్తున్న ఆందోళన సైతం సభలను సజావుగా సాగనివ్వడం లేదు. దీంతో పార్లమెంట్‌లో వీటిపై వ్యవహరించాల్సిన తీరుపై కోర్ బృందం ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
గాంధీధామ్-పలాస మధ్య
సూపర్ ఫాస్ట్ రైలు వేయండి
రైల్వే మంత్రికి ఎంఏ ఖాన్ విజ్ఞప్తి
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: గుజరాత్‌లోని గాంధీ ధామ్ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వరకూ విజయవాడ, విశాఖ మీదుగా ఒక సూపర్ ఫాస్ట్ రైలును ప్రవేశపెట్టి ప్రవాసాంధ్రులను ఆదుకోవలసిందిగా కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. గుజరాత్‌లోని కచ్ పరిసర ప్రాంతాలలో సుమారు అరవైవేల మంది తెలుగువారు గత నాలుగు దశాబ్దాలుగా నివసిస్తున్నారని ఆయన తెలియచేశారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఈ కుటుంబాలవారు స్వస్థలాలకు వెళ్లటానికి నేరుగా రైలు బండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలియచేశారు. రిజర్వేషన్ కూడా లభించకపోవటంతో ప్రయాణం చేయటం నరకయాతనగా మారుతోందన్నారు. ప్రభుత్వం ప్రవాసాంధ్రులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గాంధీ ధామ్ నుంచి బల్లార్ష మీదుగా విజయవాడ జంక్షన్, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పలాస వరకూ రైలును నడపాలని ఖాన్ కోరారు. ఈ ప్రతిపాదనపై మంత్రి పవన్‌కుమార్ బన్సాల్ సానుకూలంగా స్పందించారని ఖాన్ తెలియచేశారు.
అనంతలో ఉక్కు పరిశ్రమ
ఏర్పాటు చేయండి
బేణీ ప్రసాద్‌కు రఘువీరా విజ్ఞప్తి
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: అనంతపురం జిల్లా రాయదుర్గంలో లభించే ఇనుప ఖనిజాన్ని సేకరించి ఉక్కు పరిశ్రమ స్థాపనకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణి ప్రసాద్‌కు రాష్ట్ర రెవిన్యూ మంత్రి రఘవీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ పథకాన్ని అమలు చేయటానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఖుద్రేముఖ్, రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మధ్య ఒక సంయుక్త ఒప్పందం కుదర్చుకోవటానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరారు. దీంతో ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డితో కలిసి రఘువీరా కేంద్ర ఉక్కుశాఖ మంత్రిని కలవగా, ఒప్పందం అమలైతే సంతకాలు జరిగే కార్యక్రమానికి రావలసిందిగా మంత్రి బేణి ప్రసాద్‌ను ఆహ్వానించినట్లు రఘువీరారెడ్డి తెలియచేశారు. కాగా, అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రైఫిల్ ఫైరింగ్ రేంజిని వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా ఆయన రక్షణ మంత్రి అంటోనీకీ విజ్ఞప్తి చేశారు.
గుర్గావ్ ఆస్పత్రిలో కాల్పులు
ఇద్దరికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తుపాకీతో ఆస్పత్రిలోకి చొరబడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతున్న ఇద్దరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన మంగళవారం గుర్గావ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి సన్‌రైజ్ హాస్పిటల్‌లో ఇది జరగగా బాధితులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్తి తగాదాల్లో భాగంగానే ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల్లో బాధితుల సంబంధీకులు కొందరు చెబుతున్నారు. కాల్పులకు గురైన ఇద్దరినీ సత్వీర్, జగింజర్‌లుగా గుర్తించగా, సత్వీర్ పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు పెదవి విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వాల్‌మార్ట్ లాబీయింగ్, ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో ఎస్‌సి, ఎస్‌టి కోటా అంశాలపై పార్లమెంట్
english title:
p
Date:
Wednesday, December 12, 2012