న్యూఢిల్లీ, డిసెంబర్ 11: గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన సుమారు 17వేల మంది కార్మికులను ఆదుకోవటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎన్నారై శాఖ మంత్రి వాయిలార్ రవి రాజ్యసభలో ప్రకటించారు. ఇప్పటికే అక్కడి మన దేశ రాయబారితో ఈ విషయమై సంప్రదించి ఒక నివేదికను అందచేయవలసిందిగా ఆదేశించినట్లు ఆయన తెలియచేశారు.
గల్ఫ్ దేశాలకు పని కోసం వెళ్లి వివిధ కారణాల వల్ల సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించటానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ తెలుగుదేశం సభ్యుడు సిఎం రమేష్ ప్రతిపాదించిన తీర్మానానికి రాజకీయాలకు అతీతంగా సంపూర్ణ మద్దతు లభించింది. గల్ఫ్ దేశాల్లో నానా ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని ఆదుకోవాలని ఆయన కోరారు. పని కోసం వెళ్లిన వీరి పాస్ పోర్టులను పని ఇచ్చిన సంస్థలు, ఏజెంట్లు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. జీతాలు కూడా సక్రమంగా అందటం లేదని ఆయన తెలిపారు. వీరి వీసా కాలపరిమితి ముగిసిపోయినందున మూడు నెలల్లో తిరిగి స్వదేశానికి వెళ్లకపోతే అరెస్టు చేస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ఇక్కడి వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ దశలో బిజెపి సభ్యుడు వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని బాధితులను ఆదుకోవటానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమయంలో మంత్రి వాయిలార్ రవి సభలోకి రావటంతో ఆయన జవాబు చెప్పాలని వెంకయ్య డిమాండ్ చేశారు. యుఎఇ ప్రభుత్వంతో సంప్రదించి వీలుంటే వీసాను పొడిగించవలసిందిగా కోరుతామని ఈ సందర్భంగా వాయిలార్ రవి భరోసా కల్పించారు.
వీసాను పొడిగించటానికి ప్రభుత్వం అంగీకరించని పక్షంలో బాధితులను తీసుకురావటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. విదేశీ వ్యవహారాలు, పౌర విమానయాన శాఖ మంత్రులతో చర్చించి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామన్నారు.
రాజ్యసభకు సమర్పించాల్సిందే!
ఫెమా చట్టం సవరణలపై సీతారాం ఏచూరి స్పష్టీకరణ
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఎఫ్‌డిఐపై జరిగిన ఓటింగ్‌లో నానా గడ్డి కరిచి పార్లమెంట్ ఉభయసభలలో విజయం సాధించిన ప్రభుత్వం గురువారం లోగా ఈ పెట్టుబడులకు చట్టబద్ధత కల్పిస్తూ ఫెమా చట్టంలో చేసిన సవరణలను రాజ్యసభకు సమర్పించని పక్షంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని సిపిఎం రాజ్యసభ నాయకుడు సీతారామ్ ఏచూరి అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫెమా చట్టంలో రిజర్వ్ బ్యాంక్ చేసిన సవరణలను ప్రభుత్వం పార్లమెంట్ ఉభయసభలకు సమర్పించవలసి ఉండగా లోక్‌సభకు మాత్రమే అందచేసిందని ఆయన మంగళవారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. సవరణలను రాజ్యసభలో ప్రతిపాదిస్తే ఓటమి తప్పదన్న భయంతోనే ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పార్లమెంట్ ఉభయసభలకు సరిసమానమైన ప్రాముఖ్యతను ఇవ్వకుండా రాజ్యసభను చిన్నచూపు చూస్తోందన్న అభిప్రాయాన్ని కలిగిస్తోందని ఆయన చెప్పారు. ఓటమి తప్పించుకునే ప్రయత్నంలో రాజ్యసభను నిర్లక్ష్యం చేస్తే న్యాయస్థానం రంగంలోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎఫ్‌డిఐపై జరిగిన ఓటింగ్‌లో సాధించిన విజయం ప్రతిసారి సాధ్యపడదన్నారు. కాగా, ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనేక కీలక విషయాలలో మ్యాచ్ ఫిక్సింగ్‌లు కుదిరాయని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ఓటింగ్‌తోకూడుకున్న చర్చకు ప్రభుత్వం అంగీకరించినందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బ్యాంకింగ్, పెన్ష్‌న్ నిబంధనల సవరణల బిల్లులకు మద్దతు తెలియచేయాలని బిజెపి నిర్ణయించిందన్నారు. బ్యాంకింగ్ బిల్లును స్థాయి సంఘానికి పంపవలసిందిగా కొన్ని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌కు బిజెపి మద్దతు తెలపకపోవటం అనేక అనుమానాలకు దారి తీస్తోందని ఆయన చెప్పారు. మన బ్యాంకులలో విదేశీ పెట్టుబడుల శాతంతోపాటు విదేశీ డైరక్టర్ల సంఖ్యను పెంచటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టని పక్షంలో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలటం ఖాయమని ఆందోళన వ్యక్తంచేశారు. అదేవిధంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛన్‌ను విదేశీ సంస్థల్లో పెట్టుబడి పెట్టడం క్షేమదాయకం కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. మెక్సికోలో ఈ ప్రయోగం వికటించిందని గుర్తుచేశారు. చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించటంలో భారీస్థాయిలో అవినీతి జరిగినట్లు వాల్‌మార్ట్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించటానికి ప్రభుత్వం అంగీకరించినందున నిర్ణీత వ్యవధిలో విశ్వసనీయమైన పంధాలో ఈ విచారణ జరగాలని ఆయన కోరారు.
న్యాయ విచారణకు లేదా కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం కింద ఈ విచారణ జరిగితే బాగుంటుందని ఎచూరి అభిప్రాయ పడ్డారు.