న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తమను అరెస్టు చేసి పనె్నండు గంటల పాటు పోలీసు స్టేషన్‌లో నిర్బంధించటంతోపాటు ఈ విషయాన్ని లోక్‌సభ కార్యాలయానికి తెలియజేయకుండా తొక్కిపెట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని తెలంగాణ ఎంపీలు లోకసభ స్పీకర్ మీరాకుమార్‌ను కోరారు. టి-ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, రాజయ్య, మందా జగన్నాథ్ మంగళవారం మీరాకుమార్‌ను కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. వారు ఇప్పటికే కిరణ్‌కుమార్ రెడ్డిపై సభా హక్కుల నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు పోలీసులు తమపట్ల చాలా దురుసుగా వ్యవహరించారని టి-ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తమను దాదాపు పనె్నండు గంటల పాటు పోలీసు స్టేషన్‌లో నిర్బంధించిన విషయం మీకు తెలియజేయకపోవటం సభా హక్కుల ధిక్కారం కాదా? అంటూ ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. వారు చెప్పినదంతా సావకాశంగా విన్న మీరాకుమార్ దీనిపై తగు దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని ఆమె టి-ఎంపీలకు స్పష్టం చేశారు.
సోనియాతో మంత్రులు, ఎంపీల భేటీ
కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి, కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి డి.పురంధేశ్వరి, కేంద్ర సాంఘీక సంక్షేమ శాఖ సహాయ మంత్రి పి.బలరాం నాయక్‌లు మంగళవారం పార్లమెంటు ఆవరణలోని సిపిపి కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని విడివిడిగా కలిసి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల గురించి వివరించారు. పనబాక లక్ష్మి షెడ్యూల్డు కులాల వారికి ఉపప్రణాళికను ఇచ్చినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పటంతోపాటు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల గురించి కూడా ఆమె పార్టీ అధ్యక్షురాలికి వివరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ సంస్థాగత అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్ఠించే అంశంపై నెలకొన్న వివాదం గురించి సోనియా గాంధీకి వివరించారని భావిస్తున్నారు. ఆమె తన నియోజకవర్గ రాజకీయాలను కూడా సోనియా దృష్టికి తెచ్చారని చెబుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా దాదాపు పది లక్షల మంది బంజారాలను మీరు గౌరవించారని కేంద్ర మంత్రి బలరాం పార్టీ అధ్యక్షురాలికి వివరించారు. బంజారా వర్గాలకు మీరిచ్చిన ప్రాధాన్యతను మరచిపోలేమంటూ ఆయన సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే టి-ఎంపి పొన్నం ప్రభాకర్ పార్టీ అధ్యక్షురాలిని కలుసుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై ఈనెల 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన పార్టీ అధ్యక్షురాలికి విజ్ఞప్తి చేశారు.
మీరాకుమార్‌కు తెలంగాణ ఎంపీల వినతిపత్రం
english title:
kiran
Date:
Wednesday, December 12, 2012