న్యూఢిల్లీ, డిసెంబర్ 11: గృహిణులకో శుభవార్త. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల పరిమితిని ఇప్పుడున్న ఏడాదికి ఆరునుంచి తొమ్మిది సిలిండర్లకు పెంచాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. ‘ఖచ్చితంగా ఆరునుంచి తొమ్మిదికి పెరిగే అవకాశం ఉంది’ అని మొయిలీ మంగళవారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. అయితే మంత్రి ఈ ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఎన్నికల కమిషన్ సమావేశమై, గుజరాత్ ఎన్నికలు మరో రెండు రోజుల్లో జరగనుండడం, అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, తక్షణం ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లను ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరుకు పరిమితం చేయాలని రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ గత సెప్టెంబర్ 13న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా గృహిణులనుంచి తీవ్రనిరసన వ్యక్తం కావడం, ఈ పరిమితిని పెంచాలని కాంగ్రెస్ పార్టీలోనూ ఒక వర్గం బలంగా అభిప్రాయ పడుతూ ఉండడంవిదితమే. దీంతో ఈ పరిమితిని పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు మొయిలీ పార్లమెంటులో సైతం చెప్పారు. కాగా, సిలిండర్ల పరిమితిని పెంచే నిర్ణయం కూడా రాజకీయ వ్యవహారాల కమిటీయే తీసుకోవలసి ఉంటుందని మొయిలీ మంగళవారం విలేఖరులకు చెప్పారు. ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారని అడగ్గా, వీలయినంత త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్తూ, పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంపై పడనున్న భారంపై తాను ఇప్పటికే ఆర్థికమంత్రి చిదంబరంతో రెండు దఫాలు చర్చలు జరిపినట్లు తెలిపారు. ఒక వేళ సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తొమ్మిదికి పెంచితే ప్రనుత్వం ఏడాదికి అదనంగా 9 వేల కోట్ల రూపాయలను చమురు కంపెనీలకు అందించాల్సి ఉంటుంది. కాగా, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను ఆరునుంచి తొమ్మిదికి పెంచనున్నట్లు మొయిలీ ప్రకటన చేయగానే ఎన్నికల ప్రధానాధికారి విఎస్ సంపత్ అధ్యక్షతన ఇసి అత్యవసరంగా సమావేశమై ఈ నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని చమురు, సహజవాయువుల మంత్రిత్వ శాఖను కోరాలని నిర్ణయించింది.
మీడియా ద్వారా ప్రభుత్వ ఆలోచన తమకు తెలిసిందని, అందువల్ల అలాంటి ఆలోచన ఏదయినా ఉంటే తక్షణం మానుకోవాలని పెట్రోలియం శాఖకు రాసిన లేఖలో ఇసి కోరింది.
ఏడాదికి తొమ్మిదికి పెంచే అవకాశం: మొయిలీ నిర్ణయం వాయిదా వేసుకోవాలని ఇసి ఆదేశం
english title:
s
Date:
Wednesday, December 12, 2012