హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రపంచ ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ మృతి సంగీత ప్రపంచానికే తీరని లోటు అని ప్రముఖులు నివాళులు అర్పించారు. రవిశంకర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి భారతీయ సంగీత ప్రపంచానికి లోటుగా అభివర్ణించారు. భారతీయ సంగీతాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఘనత రవిశంకర్‌దేనని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మూడుసార్లు గ్రామీ అవార్డు పొందడంతోపాటు, 2013 సంవత్సరానికి కూడా ఇదే అవార్డుకు ఆయన ఎంపికయ్యారని ప్రస్తుతించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా రవిశంకర్ మృతికి సంతాపం ప్రకటించారు. సంగీతంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన రవిశంకర్ మృతి కళారంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు. భారతరత్న పురస్కారం, రాజ్యసభ సభ్యత్వం పొందిన రవిశంకర్ ధన్యజీవిగా చంద్రబాబు అభివర్ణించారు. రవిశంకర్ మృతికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా నివాళులు అర్పించారు. గ్రామీ అవార్డులు, భారతరత్న పురస్కారం అందుకున్న రవిశంకర్ తనదైన ముద్రతో భారతీయ శాస్ర్తియ సంగీతంతో ప్రపంచాన్ని మంత్రముగ్థం చేశారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. సితార్‌తో హిందుస్తానీ సంగీతానికి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టారని గుర్తుచేశారు. ఆయన మరణంతో సంగీత ప్రపంచం అత్యున్నత వ్యక్తిని కోల్పోయిందని నివాళులు అర్పించారు.
అఖిలపక్షంలో మాది
ఒకే వాణి: వైకాపా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 12: అఖిలపక్ష సమావేశానికి ఎవరు వెళ్ళినా, ఎంత మంది వెళ్ళినా తమ పార్టీ తరఫున ఒకే బాణి వినిపిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. అయితే అఖిలపక్షానికి హాజరుకావాల్సిందిగా తమకు ఇంత వరకూ కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే నుంచి లేఖ అందలేదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఆ ఒకే అభిప్రాయం ఏమిటీ? అని ప్రశ్నించగా, లేఖ అందిన తర్వాత పార్టీ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. అయినా ఆ అభిప్రాయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెబుతామని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళిక బిల్లుపై అసెంబ్లీ, కౌన్సిల్‌లో పార్టీ వేర్వేరుగా వ్యవహరించడంపై ప్రశ్నించగా, దీనిపై తమ పార్టీలో గందరగోళం ఏమీ లేదని ఆయన తెలిపారు. ఉప ప్రణాళికకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, టిడిపియే డ్రామా చేసిందని ఆయన దాట వేశారు. ఇటీవల తమ పార్టీలో చేరిన టిడిపి మాజీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పార్టీ రాజకీయ వ్యవహారాల సంఘం (పిఎసి)లో సభ్యునిగా పార్టీ నాయకత్వం నియమించినట్లు ఆయన తెలిపారు.
పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో
మూడు తీర్మానాలకు ఆమోదం
ఇలాఉండగా బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మూడు తీర్మానాలను ఆమోదించారు. సహకార ఎన్నికలను వెంటనే నిర్వహించాలని, దెబ్బతిన్న పత్తి, వేరు శనగ, చెరకు ఇతరత్రా పంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ఆమోదించారు. కాగా, పండిట్ రవిశంకర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించారు.
షర్మిల పాదయాత్రలో విజయమ్మ
బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హాజరుకాలేదు. రంగారెడ్డి జిల్లాలో తన కుమార్తె షర్మిల కొనసాగిస్తున్న పాదయాత్రలో పాల్గొనేందుకు విజయమ్మ వెళ్లడమే ఇందుకు కారణమని పార్టీ నాయకులు తెలిపారు. పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, బాలరాజు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రభృతులు పాల్గొన్నారు.
సంగీత ప్రపంచానికి తీరని లోటు .. ప్రముఖుల నివాళి
english title:
p
Date:
Thursday, December 13, 2012