హైదరాబాద్, డిసెంబర్ 12: తెలుగు భాష ఓ సంగీతం...మరో మాటలో చెప్పాలంటే కన్నతల్లి వంటిది, కన్నతల్లిని మనమే చూసుకోవాలి, పక్కవారు వచ్చి చూస్తారనుకోం కదా... అలాంటపుడు భాష కోసం ఇతరులపై ఆధారపడటం సరికాదు, మన భాషా సౌరభాలను మనమే గుబాళింపచేయాలి అని డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు అన్నారు. మలేసియా తెలుగు సంఘం అధ్యక్షుడిగా ఉన్న అచ్చయ్యకుమార్ రావు తిరుపతిలో డిసెంబర్ 27 నుండి జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మలేసియాలో తెలుగు పిల్లలు అందరికీ భాషను నేర్పిస్తున్నామని, తెలుగుభాషాభివృద్ధికి ఒక అకాడమిని కూడా ఏర్పాటు చేయడమేగాక, త్రిలింగ స్ఫూర్తితో వినూత్న భవననిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. తెలుగు మహాసభలకు చాలా చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తాను గమనించానని పేర్కొన్నారు. తాము మలేసియాలో తెలుగు వారంతా కలిసినా వేలల్లో ఉంటారని, అదే తిరుపతిలోని మహాసభలకు లక్షలాది మంది తెలుగువారు హాజరవుతారని, అక్కడ తెలుగువారితో కలిసి తెలుగుతనాన్ని బలపరిచే వీలు తమకు కలిగిందని చెప్పారు. మలేసియాకు తమ పూర్వీకులు 200 సంవత్సరాల పూర్వం వెళ్లారని, తాము మూడోతరం కాగా, తమ పిల్లలు నాలుగోతరం వారు ఉన్నారని, వారు తెలుగు భాషను మర్చిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తెలుగు మహాసభలను తెలుగు బ్రహ్మోత్సవాలుగా అచ్చయ్యకుమార్ అభివర్ణించారు. మలేషియాలో తెలుగు వారివి 30 శాఖలు ఉన్నాయని, అవన్నీ మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయని చెప్పారు. సంస్కృతిని, మతాన్ని ఎలా గుర్తుచేసుకుంటున్నామో, అదే విధంగా తెలుగు భాషోత్సవాలను నిర్వహించుకోవడం చాలా సముచితమని అన్నారు. మలేసియా నుండి 108 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొంటారని, వారందరూ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను కూడా ఇస్తారని పేర్కొన్నారు.
‘ఎంసెట్‌తో పాటు నీట్‌కూ సిద్ధంగా ఉండండి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్ట్రంలోని విద్యార్థులు ఎంసెట్‌తో పాటు ‘నీట్’ (వైద్య విద్య ప్రవేశ పరీక్ష)కు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్‌కు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరుతున్నామని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఈ ఏడాది ఎంసెట్ ఉంటుందని, లేకపోతే విద్యార్థులు ‘నీట్’ పరీక్ష రాయాల్సిందేనని ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు. మన రాష్ట్ర విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లామని, తీర్పు ఏ రకంగా వచ్చినా ప్రభుత్వం దానిని అమలు చేస్తుందని ఆయన తెలిపారు.