హైదరాబాద్, డిసెంబర్ 12: ఆర్వీఎంలో ఉద్యోగులుగా నియమించి, అకస్మాత్తుగా తొలగించడంతో వివాదాస్పదం అయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలపై తగు చర్యలు వెంటనే తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖా మంత్రి శైలజానాధ్ చెప్పారు. ప్రాజెక్టు అధికారికి ఈ వ్యవహారం తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. 1216 మందికి ఉద్యోగాలిచ్చిన సంఘటనలో ఆర్వీఎం 6 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లిందని, మండల స్థాయి అకౌంటెంట్ల నియామకంపై కూడా ప్రభుత్వం విచారణ జరుపుతోందని చెప్పారు. ఉద్యోగాల కల్పన పేరుతో కోట్లాది రూపాయిలు నష్టంపై మంత్రి అయోమయ సమాధానాలు చెప్పారు. థర్టుపార్టీ ప్రమేయంతో ఈ విధంగా జరిగి ఉండొచ్చని మంత్రి చెప్పారు. ఉద్యోగాల నుండి తీసేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంపై తానేమీ చెప్పలేననని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నట్టు తాను గుర్తించానని రిజర్వేషన్ల వారీగా వెనుకబడిన వారికి అందాల్సిన వాటా ఇతరులు కొల్లగొట్టడంపై తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని చెప్పారు. అంతకుముందు మంత్రి ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. టెన్త్‌లో 44.6 శాతం, ఇంటర్‌లో 46.5 శాతం ఉత్తీర్ణులయ్యారని అన్నారు. ఎస్సెస్సీ పరీక్షలకు విద్యార్ధులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ 15 నుండి జనవరి 5వ తేదీలోగా చెల్లించాలని, 25రూపాయిల జరిమానాతో జనవరి 16 వరకూ, 50 రూపాయిల జరిమానాతో జనవరి 31 వరకూ ఫీజు చెల్లించవచ్చని డైరెక్టర్ ఎ. సత్యనారాయణ రెడ్డి చెప్పారు.
మంత్రి శైలజానాథ్ వెల్లడి
english title:
rvr
Date:
Thursday, December 13, 2012