హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి పార్టీకి ఇద్దరేసి సభ్యులను ఆహ్వానించడంపై టిఆర్‌ఎస్, బిజెపి, టిజెఎసి, తెలంగాణ నగారా సమితి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తోందని వారు మండిపడ్డారు. అఖిల పక్ష సమావేశానికి పార్టీల నుంచి ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానించడం ద్వారా కేంద్రానికి ఈ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధిలేదని తేలిపోయిందని టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకుడు టి హరీష్‌రావు విమర్శించారు. పార్టీకి ఇద్దరు సభ్యులను ఆహ్వానించడం అంటే, రాష్ట్ర విభజన అంశాన్ని తేల్చడానికి కాదు, నాన్చడానికేనని తేలిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ డిమాండ్‌పై కాంగ్రెస్, టిడిపిలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలనీ, రెండు కళ్లు, రెండు నాలుకలంటే చెల్లదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చడానికి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి రాసిన టిడిపి అధినేత చంద్రబాబు తన వైఖరిని భేటీకి ముందే స్పష్టం చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. అఖిల పక్షానికి ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన అనైతికతను మరోసారి బయటపెట్టుకుందని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె తారకరామారావు దుయ్యబట్టారు. తెలంగాణపై కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలకు చిత్తశుద్ధి ఉంటే, బొత్స సత్యనారాయణ, చంద్రబాబు, విజయమ్మ అఖిలపక్షానికి హాజరై తమ పార్టీల వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బూటకపు మాటలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం మానుకొని ఒక పార్టీ ఒకే వైఖరి చెప్పకపోతే, తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని కెటిఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్, టిడిపిలు అఖిల పక్ష సమావేశంలో ఒకే అభిప్రాయాన్ని చెప్పకపోతే ఆ పార్టీలను తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయమని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. నియంతలకు పట్టిన గతే ఆ పార్టీలకు పడుతుందని ఆయన పేర్కొన్నారు. అఖిల పక్ష సమావేశానికి పార్టీల తరఫున ఎంత మంది ప్రతినిధులు వెళ్లినా ఒకే అభిప్రాయం చెప్పాలని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు.
మండిపడ్డ టిఆర్‌ఎస్, బిజెపి, టిజెఎసి
english title:
i
Date:
Thursday, December 13, 2012