హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రపంచ తెలుగు మహాసభల ఇతివృత్త గాధాంశ గీతంగా సి. నారాయణ రెడ్డి రాసిన ‘కడలి అంచులు దాటి... కదిలింది తెలుగు’ అనే పాటను ఎంపిక చేసినట్టు సాంస్కృతిక మండలి చైర్మన్ డాక్టర్ ఆర్వీ రమణమూర్తి చెప్పారు. ఈ పాటకు ప్రముఖ సినీ సంగీత దర్శకులు కోటి, వాసూరావులు సంగీతం అందిస్తుండగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నారని అన్నారు. డిసెంబర్ 12, మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు (12-12-12) ఈ గీతం ట్రాక్‌ను పూర్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఇతివృత్తగీతం రాసిన వారికి పారితోషికాన్ని సైతం ప్రకటించామని, దానికి స్పందిస్తూ 94 మంది తమ పాటలను పంపించారని అన్నారు. ఈ పాటల పరిశీలనకు వేదవతి ప్రభాకర్, ఆదిత్యప్రసాద్, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బలరామయ్యలతో ఒక కమిటీని వేశామని, ఆ కమిటీ ఈ పాటలను పరిశీలించి మహాసభల స్థాయిని ప్రతిబింబించేవిగా లేవని తేల్చిందని అన్నారు. దాంతో మరో నాలుగైదు పాటలను ఇతరులతో రాయించి వాటిని రికార్డు చేయాలని యోచిస్తున్నట్టు రమణమూర్తి చెప్పారు. సాంస్కృతిక మండలి కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలను దిగ్విజయం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెప్పారు. చాలా దేశాల నుండి ఎవరికి వారు తమ సొంత ఖర్చులతో తిరుపతి రావాలని నిర్ణయించుకున్నారన్నారు. చలనచిత్రసీమ కమిటీ సమావేశాన్ని నిర్వహించామని, చాలా మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారని అన్నారు. అన్ని తరాల నటీనటులను సభల్లో భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు. కొంత మంది ప్రముఖులను సత్కరించనున్నట్టు రమణమూర్తి తెలిపారు. తిరుపతిలో రెండు మూడు సినిమాహాళ్లను గుర్తించి, వాటిలో తెలుగు భాష, చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించిన చిత్రాలను ప్రదర్శించాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు.
తెలుగు మహాసభల ఇతివృత్త గీతంగా సినారె పాట
english title:
k
Date:
Thursday, December 13, 2012