............
పర్యావరణ సదస్సులు మొక్కుబడి చందంగా మారడం వల్ల వాతావరణం మారిపోతోంది. సహజ సిద్ధమైన లక్షణాన్ని కోల్పోయి ప్రకృతిపరమైన బీభత్సానికే కారణం అవుతోంది. ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ధరిత్రీ సదస్సు నుంచి ఇప్పటి వరకూ ఎన్నో శిఖరాగ్ర భేటీలు జరిగినా పర్యావరణ సమతూకానికి రక్షణే లేకుండా పోయింది. ధనిక, పేద దేశాల మధ్య తలెత్తుతున్న విభేదాలు పుడమిని అగ్ని గుండం చేస్తున్నాయి..
................................
కాలుష్యం కాటేస్తోంది..పర్యావరణం విషతుల్యమవుతోంది.ప్రమాదకర ఉద్గారాలమయంగా మారుతున్న వాతావరణం జీవకోటి గుండెల్లో మరణ మృదంగమే అవుతోంది. పారిశ్రామిక విప్లవం నాటి నుంచి ఇప్పటి వరకూ భూతాపం భరించలేనంతగా పెరిగిపోయిందంటే అందుకు కారణం..అభివృద్ధి కాంక్షే తప్ప జగతి మనుగడ పట్టని మనిషి ఆలోచనే! వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల ధ్యాసే లేకుండా సాగుతున్న అభివృద్ధి యావ భూమికే ముప్పు తెస్తోంది.
............ సహజసిద్ధమైన పర్యావరణ సంపత్తినే హరిస్తోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న ప్రతికూల మార్పుల వల్లే ఉష్ణోగ్రత పెరిగిపోతోందన్న ధ్యాస పదేళ్ల క్రితమే మొదలైనా ఇప్పటి వరకూ అరకొర చందంగానే చర్యలు సాగుతూ వచ్చాయి. ధనిక, పేద అన్న తేడా లేకుండా ప్రపంచ దేశాలన్నింటికి ఇప్పుడు పర్యావరణ పరిరక్షణే పెను సవాలుగా మారింది. ఎప్పటికప్పుడు అత్యంత సంక్లిష్టమైనదిగా కూడా పరిణమిస్తోంది. మారుతున్న పరిస్థితుల వల్ల రాబోయే ముప్పు గురించి పర్యావరణ వేత్తలు హెచ్చరికలు చేయని రోజు లేదు..అయినా వాటిని పట్టించుకున్న నాథుడే కొరవడటంతో పరిస్థితి ఇప్పటికే చేయిజారిపోయింది! ఇప్పటికీ కళ్లు తెరవక పోతే పుట్టి మునిగిపోయే పరిస్థితీ దాపురించడం తధ్యమన్న హెచ్చరికలు దేశాధినేత చెవుల్లో మార్మోగడంతో దోహా పర్యావరణ చర్యలు మొదలయ్యాయి. అవి కూడా అంతంత మాత్రంగానే సాగడంతో ఇక మనిషి మనుగడ విషవలయంలోనేనన్న ఆందోళనా వ్యక్తం అవుతోంది. శిలాజ ఇంధనాలు, అడవులను తగుల బెట్టడం వల్ల ఉద్భవించే కార్బన్‌డై ఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ (గ్రీన్‌హౌస్ వాయువులు) వంటివి వాతావరణంలో అనూహ్యంగా పేరుకుపోతున్నాయి. గత ఏడాది నాటికే ప్రపంచ వ్యాప్తంగా కార్బన్ డై ఆక్సైడ్ విసర్జన ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి వాతావరణంలో దీని పరిమాణం ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఖాయమన్న హెచ్చరికలూ అందుతున్నాయి. ఇంతగా పరిస్థితి దిగజారుతున్నా..వాతావరణ మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా.. కర్బన ఉద్గారాల విసర్జన పరిమాణాన్ని తగ్గించుకునే ప్రయత్నాలేవీ చిత్తశుద్ధితో మొదలు కాలేదు. అంతర్జాతీయ స్థాయిలో శిఖరాగ్ర సదస్సులు నిర్వహించడం తప్ప వాటి వల్ల ఇంత వరకూ ఎలాంటి ప్రయోజనం ఒనగూడలేదు. అయితే అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాల విసర్జన పరిమాణాన్ని తగ్గించుకునే ప్రయత్నాలకు పెద్దపీట వేశాయి. ఇందుకు ఆర్థికపరమైన అంశాలతో పాటు ఉత్పాదక రంగాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయడం, పునర్వినియోగ ఇంధనంపై దృష్టి పెట్టడం వంటి అంశాలు దోహదం చేశాయి. సహజవాయు ఉత్పత్తి పెరగడం కూడా ఇందుకు కొంత మేర దోహదం చేసిందనే చెప్పాలి. అనేక విద్యుత్ కేంద్రాల్లో బొగ్గుస్థానే సహజవాయువే ప్రత్యామ్నాయం కావడం కూడా పెరుగుతున్న పర్యావరణ అవగాహనకు నిదర్శనం. అయితే, ధనిక దేశాలు తమ వంతు కర్తవ్యంలో భాగంగా కాలుష్య పరిమాణాన్ని తగ్గించుకున్నప్పటికీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరని పరిస్థితి తలెత్తింది. భారత్, చైనా సహా ఇతర దేశాలు ఈ దిశగా తగిన చర్యలు తీసుకోక పోవడం వల్ల, పర్యావరణ లాభం కాస్త నష్టంగానే మారుతోంది. బొగ్గు వినియోగం అత్యంత తీవ్రం కావడమే కాలుష్యం పెరిగిపోయి పర్యావరణ సమతూకం దెబ్బతినడానికి కారణం. శిలాజ ఇంథనాల్లో కర్బన పరిమాణం అత్యధికంగా ఉండేది బొగ్గులోనే..దీని వినియోగానికి అడ్డూ అదుపూ లేకపోవడం పరిస్థితి వేగంగా విషమించడానికి దారితీస్తోంది. బొగ్గుకు సంబంధించిన విష పదార్థాల విసర్జన పరిమాణం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. 2010 సంవత్సరంలో నమోదైన దాని కంటే 2011లో బొగ్గు ఆధారిత పరిశ్రమల నుంచి, ఇతరత్రా దాన్ని వినియోగించే ప్రక్రియల నుంచి ఉత్పన్నమైన కాలుష్యం ఐదు శాతం పెరిగిపోయిందని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఎవరి అవసరాలు వారివన్నట్టుగా శిలాజ ఇంధనాల వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగానే ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. పెరిగిపోతున్న భూగోళ ఉష్ణోగ్రతను అదుపు చేయాలంటే కాలుష్య కారక పదార్థాల వినియోగాన్ని కట్టడి చేయాలన్న స్పృహ మూడేళ్ల క్రితమే కలిగింది. అంతకు ముందు వరకూ హెచ్చరికలతోనే సరిపెట్టిన అంతర్జాతీయ సంస్థలు నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించాయి. ఇప్పటికే వేడెక్కిపోయిన భూతాపాన్ని తగ్గించాలంటే అంచనాలకు మించిన స్థాయిలోనే నిరోధక చర్యలు తీసుకోవాలన్న హెచ్చరికలకూ కొదవ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూతాపం 3.6డిగ్రీలకు పెరగడానికి వీల్లేదని, ఆ హద్దు దాటితే పరిస్థితులు అదుపుతప్పినట్టేనన్న హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేసిన పాపాన పోలేదు. కర్బన ఉద్గారాల శాతాన్ని తగ్గించే విషయంలో రెండు దశాబ్దాలకు పైగా ఎడతెరపి లేని చర్చలే జరిగాయి. పరిస్థితి తీవ్రతను గ్రహించిన అన్ని దేశాలు అందుకు సంబంధించిన ఒప్పందాన్నీ ఘనంగానే కుదుర్చుకున్నాయి. కానీ, ఆచరణ మాత్రం అరకొర చందంగానే మారింది. ఏ ఫలితమూ అంత తేలిగ్గా సిద్ధించదు. కాలుష్య పరిమాణాన్ని పరిమితం చేసుకునే విషయంలో కనబరిచిన ఆరాటాన్ని ప్రపంచ దేశాలు ఆచరణలో కనబరచలేకపోయాయి. ఎంత మేరకు నియంత్రణ చర్యలు తీసుకోవాలన్న అంశం వివాదాస్పదంగా మారింది. ఫలితం.. కాలుష్య ఉద్గారాల విసర్జన యథాతథంగా పర్యావరణాన్ని మరింత విషతుల్యం చేయడమే!
ప్రపంచ పెద్దగా..అన్ని దేశాల బాగోగులనూ చూసే ఐరాస పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ నిబద్ధతాయుతంగానే వ్యవహరిస్తూ వస్తోంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వార్షికంగా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది. ధనిక, పేద అన్న తేడా లేకుండా అన్ని దేశాలనూ కార్యోన్ముఖం చేయడం ఇప్పటి వరకూ గణనీయమైన కృషి జరిగింది. వాతావరణ మార్పుల నిరోధానికి సంబంధించిన ఐరాస ఒప్పందంపై దాదాపు 200 దేశాలు సంతకాలు చేశాయి. ఐరాస ఆధ్వర్యంలో జరిగే ఈ శిఖరాగ్ర సదస్సుల్లో పర్యావరణ మార్పులతో పాటు వాటి ప్రభావానికి సంబంధించి కూడా లోతైన చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. ఈ విషయంలో ఐరాస చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేకపోయినా..ఇప్పటి వరకూ జరిగిన సమావేశాలేవీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడానికి కారణం..ఏకాభిప్రాయ ప్రాతిపదికన ఒప్పందాలు కుదరాలన్న నిబంధన ఉండటమే! అంటే..సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశం శిఖరాగ్ర సదస్సుల ప్రతిపాదనలను వ్యతిరేకించినా లేదా కొన్ని అంశాలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసినా మొత్తం ఒప్పందానికే ముప్పు ఏర్పడుతుందన్న మాట! ఈ ఏకాభిప్రాయ ముడి పెట్టడం వల్లే పర్యావరణ పరిరక్షణ లక్ష్యం ఎండమావిగా మారుతోంది. అన్ని సమావేశాలు, శిఖరాగ్ర సదస్సుల్లో లక్ష్యాల పటాటోపం తప్ప ఆచరణ మాత్రం పూజ్యంగానే మారుతోంది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరికీ అత్యవసరమేననడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు విభేదాలకు కారణం ఏమిటన్న ప్రశ్నా తలెత్తుతుంది. ఇప్పటి వరకూ పర్యావరణ పాపం ప్రధానంగా ధనిక దేశాలదే కావడం వల్ల నివారణ, నిరోధక చర్యల్లో వాటి బాధ్యత గణనీయంగా ఉండాలన్నది వర్ధమాన దేశాల వాదన. అంటే..ఎవరు ఎక్కువగా వాతావరణ మార్పులకు కారణమయ్యారో వారే ప్రధాన బాధ్యత వహించాలని, కాలుష్య నివారణ చర్యల అమలులో మిగతా దేశాలకూ సహకరించాలన్న వాదన ప్రతి సమావేశంలోనూ ప్రముఖంగానే వినిపిస్తూ వచ్చింది. వీటి చర్చలు విఫలం కావడానికీ ఇవే అంశాలు ఎప్పటికప్పుడు కారణమవుతూనే ఉన్నాయి. ఆంటే..సమస్య తీవ్రత గురించి, దాని స్వభావం గురించి ముందుగానే తెలిసినా దాన్ని పరిష్కరించుకునే విషయంలో ముందస్తు ప్రయత్నాలు జరగడం లేదు. తీరా శిఖరాగ్ర భేటీ మొదలైనప్పుడు దీని గురించి పట్టించుకోవడం వల్ల ఫలితం అందినట్టే అంది చేజారిపోతోంది.
50వ దశకం నుంచి భూమి వాతావరణం క్రమానుగతంగా వేడెక్కిపోతూనే వస్తోందని ఇప్పటికే శాస్ర్తియ పద్ధతిలో జరిగిన అధ్యాయనాలెన్నో స్పష్టం చేశాయి. శిలాజ ఇంధనాల వినియోగం అపరిమితంగా పెరిగిపోవడంతో పాటు ప్రకృతి వరప్రసాదాలైన అడవుల్ని నరికి వేయడం వల్ల వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్‌తో పాటు తేలిగ్గా వేడిని ఇముడ్చుకునే గ్రీన్‌హౌస్ వాయువులూ ప్రవేశించాయి. కార్బన్ డై ఆక్సైడ్ తర్వాత వాతావరణంపై అంతటి తీవ్ర ప్రభావం కనబరిచేది మిధైన్ వాయువే! అనేక మార్గాల ద్వారా ఈ వాయువు వాతావరణంలోకి ప్రవేశించి ఎప్పటికప్పుడు పరిస్థితులను మరింత విషమయంగా మారుస్తోంది. ఈ విషతుల్య వాయువుల పరిమాణం రెండింతలైపోతే మాత్రం భూమి ఉష్ణోగ్రత తీవ్రత 3.6డిగ్రీల సెల్సియస్ నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత పరిస్థితులు ఇంత కంటే ఎక్కువే ఉన్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఐరాస అనుబంధ సంస్థ చేసిన హెచ్చరికల్ని విస్మరించడానికీ వీల్లేదు. భూతాపం పరిమితంగా ఉన్నంత వరకే మనిషి మనుగడ సాగించగలుగుతాడు. అదే అపరిమితమైతే మాత్రం తలెత్తే పరిణామాలను తట్టుకోవడం ఎవరితరం కాదన్నది ఎంతైనా నిజం. ఇదే జరిగితే అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అనూహ్యంగా దెబ్బతింటాయి. అన్ని రకాల జీవజాతులకూ వెన్నుదన్నుగా నిలుస్తున్న పర్యావరణ వ్యవస్థ బలహీనపడిపోతుంది. భూ ఉష్ణోగ్రత ప్రభావం వల్ల అనేక హిమానీనదాలు, మంచుమయ ప్రాంతాలు కరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి సముద్ర ఉపరితలాలు ఎంత మేర పెరిగిపోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇదే జరిగితే తీర ప్రాంతాల్లో ఉన్న దేశాలన్నీ ముప్పు ముంగిట్లో చిక్కుకున్నట్టే అవుతుంది. ముఖ్యంగా భారత్‌లో ముంబయి, కోల్‌కతా వంటి పట్టణాలకు సముద్ర ఉపరితలం పెరిగిపోవడం వల్ల ముప్పేనన్న హెచ్చరికలు ఇప్పటికే అందాయి. వాతావరణంలోనూ, సముద్రాల్లోనూ ఉష్ణోగ్రత తీవ్రత పెరిగిపోవడం వల్ల తలెత్తే హరికేన్లు మరింత భీకరంగానే ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం హరికేన్లు, తుపాన్లను వాటివాటి తీవ్రతను బట్టి అంచనా వేస్తున్నారు. వీటన్నింటికీ మించిన స్థాయిలోనే వాతావరణ మార్పు ప్రభావం వల్ల ఈ ఉపద్రవాలు సంభవించే అవకాశం కళ్లకు కడుతోందని చెబుతున్నారు. తరచు దావానలాలు వ్యాపించడం, కొన్ని ప్రాంతాల్లో దీర్ఘకాల దుర్భిక్ష పరిస్థితులు తలెత్తడం కూడా పర్యావరణ మార్పుల ఫలితంగా సంభవించే పరిణామాలు. హిమానీ నదాలు ఇప్పటికే ఆందోళనకర స్థాయిలో కరిగిపోయాయి. వాటిలో ఒకప్పుడు గణనీయంగా ఉండే మంచు పొరలు పలుచబడి ప్రపంచ వ్యాప్తంగా అనేక సముద్రాల ఉపరితలం అనూహ్యంగా పెరిగిపోయిన దాఖలాలెన్నో ఉన్నాయి. మారుతున్న పరిస్థితుల్ని తట్టుకోలేక అనేక జంతుజాతులు తమ ఆవాసాలనే మార్చుకునే పరిస్థితులు తలెత్తాయి. ప్రత్యేక రుతువుల్లో పూసే పూలు ముందుగానే పుష్పించే విపరిణామాలకు పర్యావరణ మార్పు కారణమవుతోంది. ఒకప్పుడు వాతావరణ మార్పు అంటే కేవలం ప్రకృతిపరమైన పరిణామంగానే భావించే వారు. దీని విపరిణామాల గురించి శాస్తవ్రేత్తలు ఎంతగా హెచ్చరించినా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా వాతావరణం అనూహ్యంగా వేడెక్కిపోవడంతో అందరి దృష్టి అందుకు సంబంధించిన కారణాలపై కేంద్రీకృతమైంది. గతంలో శాస్తవ్రేత్తలు చేసిన హెచ్చరికలు ఎంత నిజమైనవో స్పష్టమైంది. భూగోళ ఉష్ణోగ్రత ఎంత పెరిగితే అంతగానూ అన్ని విధాలుగా కష్టనష్టాలు తప్పవు. ఇరవై ఏళ్ల క్రితం రియోడి జెనీరోలో జరిగిన తొలి ధరిత్రీ సదస్సు నాటి నుంచీ పర్యావరణ చర్చలు జరుగుతూనే ఉన్నా..ఎంత శాతం మేర కాలుష్య ఉద్గారాలను విసర్జించవచ్చు, ప్రమాదకర స్థాయి ఏమిటన్నది ఇప్పటికీ తేలకుండానే ఉంది. ప్రమాద తీవ్రతకు సంబంధించి గరిష్ఠ,కనిష్ఠ పరిమితుల నిర్ధారణ జరుగక పోవడం కూడా ప్రస్తుత అనిశ్చితికి కారణం అవుతోంది. ఫలితంగా రియో సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందం నిరుపయోగంగానే మారింది. 1997లో జపాన్‌లోని క్యోటోలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అమెరికా మినహా మిగతా దేశాలన్నీ విషవాయువుల విసర్జన విషయంలో పరిమితులు విధించుకున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక దేశాలే అందుకు ముందుకొచ్చాయి. 2005లో అమలులోకి వచ్చిన క్యోటో ఒప్పంద లక్ష్యాలు ఇంకా నెరవేరక పోవడంతో దాన్ని పొడిగించే అంశంపై దీర్ఘకాలంగానే చర్చ జరుగుతూ వస్తోంది. ఈ ఒప్పందంపై అమెరికా సంతకం చేసినా చైనా తదితర వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ధృవీకరించలేదు కాబట్టి సెనేట్ సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటనే ఎదురవుతోంది. 2009 వరకూ కూడా పర్యావరణ మార్పుల ప్రమాదం పుట్టి ముంచుతోందన్న జ్ఞానోదయం పారిశ్రామిక దేశాలకు కలుగలేదు. 2050కల్లా 50శాతం మేర కాలుష్య ఉద్గారాల విసర్జనను తగ్గించుకుంటామని ఎనిమిది పారిశ్రామిక దేశాలు నిర్ణయించుకున్నాయి. ధనిక దేశాలు మరింత పెద్ద మనసు కనబరిచి ఎనభై శాతం వరకూ విషవాయువుల విసర్జనను తగ్గించుకుంటామని వెల్లడించాయి. అంత వరకూ బాగానే ఉంది కానీ, ఏ స్థాయి నుంచి 80శాతం వరకూ కాలుష్య ఉద్గారాలను నియంత్రించుకునేదీ వెల్లడించలేదు. కానీ, భారత్, చైనా వంటి దేశాలపై మాత్రం బలవంతంగా కాలుష్య నివారణ లక్ష్యాలను రుద్దే ప్రయత్నం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలకు తదుపరి ప్రగతి ఆవశ్యకత ఉండదు కాబట్టి..తమపై పారిశ్రామికంగా ఎలాంటి ఆంక్షలు విధించినా ఒప్పుకునేది లేదని భారత్, చైనాలు స్పష్టం చేశాయి. అంతే కాదు, తమతమ ఆర్థిక వ్యవస్థలు సహకరించే మేరకే కాలుష్య ఉద్గారాల విసర్జన నియంత్రణ చర్యలు తీసుకుంటామనీ తెగేసి చెప్పాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వాతావరణ విధానం అన్నది దేశాల మధ్య పర్యావరణ పరంగా విభేదాలకే ఆస్కారం ఇస్తోంది. అయితే, అంతర్జాతీయ పర్యావరణ సంస్థల నుంచి వ్యక్తమవుతున్న హెచ్చరికల నేపథ్యంలో కొంత మేర వాస్తవ పరిస్థితులు ధనిక దేశాల చెవులకెక్కాయి. వాతావరణంలో మార్పులు తీసుకు వచ్చే విషవాయువుల పరిమాణాన్ని తగ్గించుకునే విషయంలో కొన్ని దేశాలు నిర్ణయాత్మకంగానే వ్యవహరించాయి. పర్యావరణ లక్ష్యాలను ఉమ్మడిగా సాధించేందుకు వీలుగా 2020కల్లా ఏటా వంద బిలియన్ డాలర్లను సమకూరుస్తామని హామీ ఇచ్చాయి. అలాగే, ఎంత మేర పర్యావరణం కలుషితమవుతోందో..దాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించే పరిశీలక వ్యవస్థను ఏర్పాటు చేయడానికీ ముందుకొచ్చాయి. ముఖ్యంగా అడవుల నిర్మూలన వల్ల ప్రధానంగా నష్టం వాటిల్లుతోంది కాబట్టి ఆ దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సంకల్పించాయి. ప్రస్తుత దోహా సదస్సు కొంత మేర ఆశ కల్పించినా..పూర్తి స్థాయిలో పుడమికి పర్యావరణ రక్షణ కవచాన్ని అందించే అవకాశం మాత్రం సమీప భవిష్యత్‌లో కనిపించడం లేదు. *
.................................
సాధించింది గోరంతే!
పర్యావరణ పరిరక్షణకు ఎన్నో సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నా.. ఫలితం మాత్రం ఎండమావిగానే మారుతోంది. అసలు తక్కువ ఆర్భాటం ఎక్కువ అన్న చందంగా ఈ చర్చలు జరగడం వల్ల పర్యావరణ సమతూకం ఎప్పటికప్పుడు క్షీణిస్తోందే తప్ప ఎలాంటి నిరోధక చర్చలకూ నోచుకోవడం లేదు. ముఖ్యంగా డర్బన్, కాకున్, కోపెన్‌హగన్‌లలో జరిగిన పర్యావరణ సదస్సులు పూర్తి స్థాయి నిరాశాజనక వాతావరణానే్న కలిగించాయి. చివరి క్షణంలో చోటు చేసుకున్న హైడ్రామా మొత్తం అంచనాలను నీరుగార్చింది. లేశప్రాయమైన పురోగతి లేకుండానే ఇప్పటి వరకూ జరిగిన చర్చలన్నీ ముగిశాయి. పరిస్థితి విషమిస్తున్నా.. అన్ని దేశాలు బాధ్యతలను విస్మరించి వ్యవహరించడం వల్ల ఒనగూడేది ఏమీ ఉండదు. పర్యావరణ నష్టం మానవాళి ఉనికికే ప్రమాదమన్న వాస్తవ స్పృహను కనబరచకపోతే.. చర్చలు వృథా అవుతాయి. లక్ష్యాల్లోనూ డొల్లతనమే కనిపిస్తుంది తప్ప ఆచరణయోగ్యత కనిపించదు.
..........................