నల్లపాటి సురేంద్ర, క్రొత్త గాజువాక
గోవా ఫిలిం ఫెస్టివల్‌లో ఒక తెలుగు చలనచిత్రం కూడా ఎంపిక అవ్వలేదని బాధపడాలో లేక తెలుగు పరిశ్రమ ప్రపంచ స్థాయిలో అధిక థియేటర్లలో రిలీజ్ అవుతుందని ఆనందపడాలో తెలియడంలేదు.
ఎందుకు ఆనందం? అదో సినిమాయాజూదం.
డిసెంబర్ 21, 2012 ప్రపంచం నాశనం అయిపోతుందని, విధ్వంసాలు జరుగుతాయని టీవి న్యూస్ చానెళ్లలో చెప్పి భయపేట్టేవారిని ఏమి చేయాలి?
22న చొక్కా పట్టుకోవాలి.
సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసే స్థానాలకు ఆర్నెల్లలోపే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రజాజీవితంలో కీలకపాత్ర పోషించే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అటువంటి నిబంధన ఎందుకు ఏర్పరుచుకోలేకపోయాం?? రెండేళ్లనుండి స్పెషల్ ఆఫీసర్ల సాయంతో స్థానిక సంస్థలను నడపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
రాజ్యాంగపరమైన కట్టడి సరిగా లేక.
గవర్నర్లు మంత్రులచేత ప్రమాణ స్వీకారాలు చేయించి మిన్నకుండిపోతున్నారు తప్ప ప్రమాణం చేసిన విధంగా ఆశ్రీత పక్షపాతానికి, అవినీతికి పాల్పడకుండా విధులు నిర్వహిస్తున్నారా లేదా అన్న కనీస కర్తవ్యాన్ని ఎందుకు పాటించడం లేదు??
గవర్నర్లే ఉత్సవ విగ్రహాలు.
వి.మంజుల వెంకటేష్, గుంతకల్
హిందూ సమాజంకోసం నిర్భయంగా సంకోచం లేకుండా ఎవరికి భయపడకుండా తను నమ్మిన సిద్ధాంతంకోసం నిరంతరం హిందువులకోసం గర్జించే పులి బాల్‌థాకరే కన్నుమూసిన తరువాత శివసేన పార్టీని అదే పద్ధతిలో నడిపించే శక్తి ఆ పార్టీవారికి వుంది అంటారా?
ఆ శక్తి ఆయన ఉండగానే సన్నగిల్లింది.
రఫీ, శ్రీకాకుళం
మొన్న, నిన్న, నేడు రోజుకో చిత్రాలపై జనం తిరగపడుతున్నారు... తప్పు జనందా? సెన్సార్‌దా??
కళ్లులేని సెన్సార్లది.
బావన సీతారాం, మందసా
బ్రతికియున్నవారు పుట్టినరోజు పండుగలు జరుపుకోవడం సహజం. చనిపోయిన వారికి జయంతి, వర్ధంతి రెండూ జరపడం అవసరమంటారా?
అవీ లేకుంటే పెద్దలు బొత్తిగా గుర్తుండరు.
మహమ్మద్ యూసుఫ్, కాజీపేట
సినిమా రిలీజైన రెండవ రోజే సూపర్ డూపర్ హిట్, ది బిగ్గెస్ట్ హిట్ అని నిర్మాతలు పేపర్లో ప్రకటిస్తారు ఎందుకు? ఒక్కరోజుల్లోనే తెలిసిపోతుందా?
అదో పబ్లిసిటీ స్టంటు.
బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
బస్‌స్టాప్ లాంటి సినిమాలు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తుంటే అలనాటి సాగర సంగమం, శంకరాభరణం లాంటి చిత్రాలు నిర్మించడానికి ఎవరైనా సాహసిస్తారా?
శంకరాభరణంరాకముందూ ఇలాగే అనుకునేవాళ్లు.
టిఆర్‌యస్ అన్నట్లు కాంగ్రెస్, టిడిపి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే పరస్పర ఆరోపణలు ఎందుకు చేసుకుంటారు?
మీలాంటి వారిని మభ్యపెట్టేందుకు.
పి.రామకృష్ణ, రాజమండ్రి
భవిష్యత్తులో చంచల్‌గూడా జైలు హైదరాబాద్ చూడదగ్గ ప్రదేశాల (టూరిస్టు స్పాట్) లిస్టుకి చేరేట్టుంది. మీ కామెంట్?
తథాస్తు.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : mvrsastry@deccanmail.com
*