పోర్చుగల్ దేశంలోని రెండో పెద్ద నగరం పోర్ట్ లేదా ఒపోర్ట్ చక్కటి పర్యాటక కేంద్రం. లిజ్బన్ తర్వాత ఇదే అక్కడి పెద్ద నగరం. దీని జనాభా సుమారు 2 లక్షల 38 వేలు. 389 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల ఈ నగరం యూరప్‌లోని అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. 1996లో యునెస్కో దీనికి వరల్డ్ హెరిటేజ్ స్టేట్ అని గుర్తింపునిచ్చింది. పోర్చుగల్ పేరు ఈ నగరం వల్లే వచ్చింది. దీన్ని పాలించిన రోమన్స్ దీన్ని ‘పోర్టిస్‌కేల్’ అనేవారు. పోర్చుగల్ పోర్టిస్ వేల్‌నుంచే వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైన్‌లోని ఓ విభాగం అయిన పోర్ట్‌వైన్ ఈ నగరంలోనే తొలుత తయారయ్యేది. ఆ రకం వైన్‌ని పోర్ట్ పేర ‘పోర్ట్‌వైన్’ అనే పేరు వచ్చింది. ఈ రోజుకీ పోర్చుగల్ నుంచి ఎగుమతి అయ్యే పోర్ట్‌వైన్ అత్యంత ఖరీదైంది, ప్రసిద్ధి చెందింది.
క్రీశ 4వ శతాబ్దంలో రోమన్స్ ఈ నగరాన్ని స్థాపించారు. క్రీస్తుకి పూర్వం275 నుంచే ఇక్కడ జన నివాసం ఉన్నదని తవ్వకాల్లో రుజువైంది. 14, 15వ శతాబ్దాల్లో ఈ నగరంలో ఓడ నిర్మాణ పరిశ్రమ జోరుగా సాగేది. ఇక్కడ చూడదగ్గ కొన్ని పర్యాటక విశేషాలు.
పలాషియోడి బోల్సా: 1842లో ఆరంభించబడి 1891లో నిర్మాణం పూర్తయిన ఈ నియోక్లాసిక్ స్టైల్ భవంతిని ఫ్రాన్సిస్కేన్స్ అనేవారికి కాన్‌వెంట్‌గా ఉపయోగించేవారు.తర్వాత అది అగ్ని ప్రమాదానికి గురై తిరిగి పునర్నిర్మించబడింది. ఈ భవంతిలోని అరబ్ ఛాంబర్‌లో అధికారిక రిసెప్షన్స్‌ని నిర్వహిస్తున్నారు. గోల్డ్‌రూంలో పోర్చుగల్ రాజుల చిత్రాలు చూడొచ్చు. ఈ భవంతిలోని రెండు బ్రాంచి షాండ్లియర్స్ ఆకర్షణీయమైనవి.
సేలొఫ్రాన్సిస్కో చర్చ్: 1383లో నిర్మించబడ్డ ఈ చర్చ్‌ని 1825 దాకా పెంచుతూనే ఉన్నారు. యనెస్కో ఈ భవంతిని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. బరొక్యుస్టైల్‌లో నిర్మించబడ్డ ఈచర్చ్ గోడలకి లోపల బంగారు తాపడం చేయడం విశేషం. ఇందుకోసం 200 కిలోల బంగారాన్ని ఖర్చు చేసారు. మొక్కలు, జంతువుల ఆకారాలతో బంగారు తాపడాన్ని ఛాపెల్ లోపలి భాగంలో చేసారు. అందులో ఓ మ్యూజియం కూడా నేడు నడుస్తోంది. మానవ ఎముకలని అందులో చూడచ్చు. దీన్ని ఇప్పుడు చర్చిగా కాక సంగీత కచేరీలని జరపడానికి వినియోగిస్తున్నారు.
సెర్రాల్ప్స్: పోర్ట్‌లోని సెర్రాల్ప్స్ విల్లాలోగల యూరోపియన్ కల్చర్‌ల్ ఇనిస్టిట్యూషన్ ఇందులో నడుస్తోంది. 1997లో దీనికి హెన్రీ ఫోర్డ్ ప్రైజ్ ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్‌విరాన్‌మెంట్ బహుమతి లభించింది. పోర్చుగల్ కళగురించిన పుస్తకాలని ఈ సంస్థ ముద్రించి అమ్ముతోంది. ఇక్కడో చక్కటి పార్క్ కూడా ఉంది. మ్యూజియం పుస్తకాల దుకాణంలో కళల మీద అనేక భాషల్లో పుస్తకాలు లభ్యం అవుతాయి కాబట్టి యూరప్‌లోని కళాకారులంతా దీనికి తరచూ వస్తుంటారు. ఇక్కడి టాకీస్, రెస్టారెంట్లలో పోర్చుగల్ సాంప్రదాయ భోజనం లభిస్తుంది.
లివ్ కేరియకెలో: ఇది కేవలం ఓ భవంతిలోని మెట్లు మాత్రమే. ఎర్రటి కార్పెట్ పరిచిన, చెక్కతో ఏర్పరిచిన పిట్టగోడతో గల ఇది మ్యూజియం బుక్‌స్టోర్‌లో ఉంది. చాలామంది దీనిమీద నిలబడి ఫోటోలు తీసుకుంటారు. కాని ఫోటోలు తీసుకోవడం నిషిద్ధం! హేరి పోటర్ సినిమా ఒకటి ఇక్కడ తీయబడింది. ఈ మెట్లు గాల్లో వేలాడుతున్నట్లుగా ఉండడం విశేషం.
సేంట్ క్లారా చర్చ్: 1416లో ఆరంభించబడిన ఇది 1456లో పూర్తయిన చర్చ్. 18వ శతాబ్దంలో దీన్ని పెంచారు. నన్స్ నివసించే కానె్వంట్ కూడా ఇక్కడ ఒకటి ఉండేది. బరొక్యూ, రోమ్‌స్టైల్స్‌లో నిర్మించబడ్డ ఈ చర్చి యూరప్‌లోని మాస్టర్‌పీస్ చర్చిల్లో ఒకటి.
కసాడ మ్యూజిక్: చక్కటి ఆర్కిటెక్చర్‌తో నిర్మించబడ్డ ఇక్కడ సంగీత కచేరీలు జరుగుతుంటాయి. ప్రవేశ రుసుం రెండున్నర యూరోలు. ప్రత్యేక స్పీకర్ల అమరిక వల్ల శబ్దం ఎంతో శ్రావ్యంగా వినపడుతుంది.
పోర్ట్‌లో చూడదగ్గ మరికొన్ని విశేషాలు రెమ్‌మాల్ హౌస్ భవంతి, బాస్కెట్ బాల్ ఆటలు నిర్వహించే ఎస్టాడియో డొడ్రాగోల్, ఫునికులర్ డోస్ గేరోన్ డియాస్ భవంతి, పోరోట కెథడ్రిల్ కపెలడస్ ఆర్శాస్ చర్‌చ, పలాసియో డి క్రిస్టల్ భవంతి, మ్యూజియం రొమాంటిక్, హవుస్ ఆఫ్ ప్రిన్స్ మొదలైనవి. లిజ్బన్‌నించి ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. బస్‌లు ఉంటాయి. రైల్లో కూడా చేరుకోవచ్చు. లేదా పమ్‌స్టర్ డామ్, బ్రసెల్స్, మేడ్రిడ్, పేరిస్‌లనుంచి ఎయిర్ బెర్లిన్ ద్వారా ఫ్రాన్సిస్కో సకార్నైరో ఎయర్‌పోర్ టకి చేరుకుని, సమీపంలోని పోర్టోకి టేక్సీలో చేరుకోవచ్చు. మే నుంచి సెప్టెంబర్ దాకా పర్యాటకానికి అనువైన సమయం.
పర్యాటకం
english title:
porchugal
Date:
Sunday, December 16, 2012