పెద్దల అమానుషత్వానికి బలైపోయిన తన భర్త జ్ఞాపకార్థం ‘ప్రేమాలయం’ నిర్మించాలని ఆమె సంకల్పించడం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహార్ జిల్లాలో సంచలనం సృష్టించింది. తన భర్తను నిత్యం జ్ఞప్తికి తేవడమే గాక, ప్రేమికులకు ఈ నిర్మాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆమె ఆక్షాంక్షిస్తోంది. బులంద్‌షహార్‌కు చెందిన మెహ్‌విష్, అబ్దుల్ హకీం ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే మతానికి చెందినవారైనా, అబ్దుల్ మాత్రం కిందిస్థాయి సామాజిక వర్గానికి చెందినవాడు. దీంతో వీరి పెళ్లికి మెహ్‌విష్ కుటుంబ సభ్యులు, ఇతర పెద్దలు అంగీకరించలేదు. మరో సామాజిక వర్గానికి చెందిన అబ్దుల్‌ను ప్రేమించి పెళ్లాడడంతో తమ పరువు పోయిందని ఆమె బంధువులు నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో జరిగిన ‘పరువు హత్య’లో అబ్దుల్ హకీం ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న మెహ్‌విష్, అబ్దుల్ హకీం 2010లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. ఏడాదిన్నర పాపతో ఈ దంపతులు గత నెలలో తమ గ్రామానికి చేరుకోగా పెద్దలు ఆదరించలేదు. మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆమె నిండుచూలాలిగా పుట్టింటికి వచ్చినా పెద్దల మనసు కరగలేదు. గత నెల 22న అబ్దుల్ హత్యకు గురయ్యాడు. దీనిపై న్యాయ విచారణ జరిపించి, తనను అన్ని విధాలా ఆదుకోవాలని మెహ్‌విష్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఈమె సోదరులు, బంధువులే ఈ హత్యకు పాల్పడ్డారని అబ్దుల్ కుటుంబీకులు ఆరోపించారు.
ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కొద్దిరోజుల క్రితం నిర్వహించిన ‘సత్యమేవ జయతే’ టీవీ షోలో ఈ దంపతులిద్దరూ పాల్గొని తమ మనోభావాలను అందరితో పంచుకున్నారు. తనను హతమార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా అబ్దుల్ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘పరువు హత్యల’ను నిరసిస్తూ జరిగిన టీవీ షోలో పాల్గొన్న కొద్ది రోజులకే అబ్దుల్ ‘పరువు హత్య’కు గురికావడం విషాదాన్ని నింపింది. అబ్దుల్ హత్యకు గురైన కొద్ది రోజులకే మెహ్‌విష్ రెండో కాన్పులో ఆడశిశువుకు జన్మనిచ్చింది. పరువు హత్యలో భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఈమెకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు అయిదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాయి. ఈ డబ్బుతో తాను కలలు గన్న ‘ప్రేమాలయం’ నిర్మాణం పూర్తవుతుందని ఈమె చెబుతోంది.
పెద్దల అమానుషత్వానికి బలైపోయిన తన భర్త జ్ఞాపకార్థం ‘ప్రేమాలయం’
english title:
b
Date:
Monday, December 17, 2012