‘అందమె ఆనందం- ఆనందమె జీవిత మకరందం’ అన్నాడో సినీ కవి. నిజమే... అందం మనిషి జీవితంలో ఒక భాగమే! మనం అందంగా వున్నదీ, లేనిదీ చెప్పాల్సింది ఎదుటివాళ్లే! అద్దం ముందు నిల్చుంటే అందరూ హీరోలు, హీరోయినే్ల! అందం మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే గాకుండా అహంకారాన్ని సృష్టిస్తుందని సైకాలజిస్టులంటారు. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. ఒకప్పుడు అందంగా ఉండటానికి కేవలం ఆడవాళ్ళే ఆరాటపడేవాళ్ళు. కానీ, ఇప్పుడు మగవాళ్ళూ అందంగా ఉండాలని తెగ ఉబలాటపడుతున్నందున మెన్స్ ప్లార్లర్స్ సైతం వెలిశాయ. అందంగా ఉ న్నామని కొందరు గర్వంగా ఉంటారు. అందంగా లేమని ఇంకొందరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడిపోతుంటారు.
అందమంటే శరీరానికి సంబంధించినదే కాదు. చాలామంది బాహ్య సౌందర్యం మీదే ఎక్కువ దృష్టి పెట్టి, అందుకోసం నానాపాట్లు పడుతుంటారు. అంతః సౌందర్యాన్ని కూడా కాపాడుకోవాలని అస్సలనుకోరెందుకో? మంచి రంగు, చూడచక్కని అంగ సౌష్టవం.. అదే అందమనుకుంటారు. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కానట్టే అందం కూడా శాశ్వతం కాదు. అందంగా వున్నవాళ్ళే మనుషులు- అది లేనివాళ్ళు మనుషులు కారా?
ఏ రంగంలో రాణించాలన్నా అందం ముఖ్యం కానే కాదు. సంకల్ప బలం, సృజనాత్మకతతోనే ఎవరైనా విజయాలు సాధిస్తారు. సినిమాల్లో హీరో, హీరోయిన్లు అవడానికే అందంగా వుండాలి. మిగతా రంగాల్లో అందమంత ముఖ్యమనిపించుకోదు. అందమైన మనసుంటే మనకు ప్రకృతిలో ప్రతీదీ అందంగానే కనిపించి ఆనందాన్నిస్తుంది. శారీరక అందానికి ఎప్పటికైనా ముసలితనం తప్పదు. మానసిక అందానికి వృద్ధాప్యమే లేదు. మంచి మనసు, మాటతో ఎందరో ఆత్మీయుల్ని సంపాదించుకోవచ్చు.
అందం అంటే నిండుగా వుండాలే గానీ అశ్లీలతతో ఆకర్షించకూడదు. అందాల్ని ప్రదర్శించడం తమ ఇమేజ్‌కి ప్లస్ అవుతుందని నేటి హీరోయిన్లు హాట్ హాట్‌గా నటిస్తున్నారు. ఇక, నేటి యువత గురించి మాట్లాడితే వాళ్ళంతా సినిమాలు, పాశ్చాత్య సంస్కృతిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఫ్యాషన్ పేరిట అరకొర దుస్తుల్లో రోడ్లమీద నడుస్తుంటే అందరి చూపూ వాళ్ళవైపే. కుర్రాళ్ళు తమ శారీరక సౌష్టవం కనిపించేలా టీషర్ట్స్, జీన్స్‌వేస్తే, యువతులు మిడ్డీలు, టాప్‌లు వేసుకుని తిరుగుతుంటారు. అందానికి మెరుగులు దిద్దుకోవడానికి యువతులు బ్యూటీ పార్లర్స్‌లో, స్పాలల్లో గంటలకు గంటలు టైం వేస్ట్ చేస్తుంటారు. మగవారు కూడా జిమ్ముల్లో, సెలూన్లలో గడిపేస్తుంటారు. నల్లగా వున్నవారు తెల్లగా మిల మిలలాడాలనుకుంటారు. లావుగా వున్నవారు సన్నబడాలనుకుంటారు. ఎత్తుపళ్ళని బాగుచేసుకోవాలనుకుంటారు, సిక్స్ ప్యాక్ కావాలనుకుంటారు. రకరకాల పెర్‌ఫ్యూమ్‌లు, లోషన్లు, ఫేస్‌క్రీంలు వాడి అందాన్ని మరింత మెరుగుపరచుకోవాలనుకుంటారు. ఖరీదైన బ్యూటీ సోప్స్ వాడుతుంటారు. ఇక డబ్బున్న వాళ్ళైతే తమ అందంలో తేడాలున్నచోట ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటుంటారు. అందంగా ఉన్నవాళ్ళని చూసి- తాము అలా లేమనుకుని కొందరు తెగబాధపడిపోతుంటారు. అది అనవసరమైన బాధ. గర్వాలు ఎనిమిది రకాలని శాస్త్రం చెబుతోంది. అందులో- అందం వల్ల కూడా గర్వం వస్తుందని వుంది. అం దం కొందరిలో గర్వాన్ని రేపి, విచక్షణను అంతమొందిస్తుంది. అందానికి మంచి మనసు తోడైతే ఎంత బావుంటుందో! చాలామంది అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి అందంగా లేనివాళ్లను ఏ మాత్రం పట్టించుకోరు. అమ్మాయి అప్సరసలా వుండాలంటారు. అ బ్బాయి నవ మన్మధుడిలా వుండాలంటారు. అందంగా లేనివాళ్ళు ప్రేమకి అనర్హులా? ఈ మనుషులంతా అందాన్ని ఎందుకు అందలం ఎక్కిస్తున్నారు?
అందమైన కోడలు కావాలంటారే కానీ మంచి మనసున్న కోడలు కావాలని ఎవరైనా అంటారా? అమ్మాయికి, అబ్బాయికి ఈడూ జోడూ చూస్తారు కానీ, వాళ్ళ మనసుల కలయికని అస్సలు పట్టించుకోరు. కొందరు పురుషులు తమ భార్యలు అందంగా ఉంటారని విర్రవీగుతుంటారు. అయతే- ఆ భర్త శ్రీకృష్ణలీలలు చేస్తే ఎలా వుంటుంది?
దేవుడిచ్చిందే ముఖం. అందరినీ ఆపైవాడే సృష్టించాడు. ఆయన దృష్టిలో అందరూ సమానులే. పేద, ధనిక వర్గాలు ఎలా ఏర్పడ్డాయో- అందం ఉన్నవారు, అది లేని వారు కూడా వర్గాలుగా ఏర్పడుతున్నారు.
శారీరక అందం కన్నా జీవితం ఇంకా ఎంతో అందమైనది. దాన్ని మనసుతో ఆస్వాదించాలి. అందం అశాశ్వతమని గ్రహించి తోటివారందరిలో కలిసిమెలిసి పోవాలి. అందం కారణంగా ప్రత్యేకంగా వుండాలనుకుంటే చివరికి ఒంటరితనమే మిగులుతుంది. నేడు చాలామంది బాహ్య సౌందర్యం కోసం ఎంత డబ్బైనా ఖర్చుపెడుతుంటారు. మరి అంతఃసౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయొచ్చుకదా? అందుకు ఆథ్యాత్మిక పఠనం, దైవచింతన వంటివి ఉపకరిస్తాయ. అందమైన మనసుతో నలుగురినీ కలుపుకోండి. ఆ నలుగురు నాలుగు వందలౌతారు. కానీ, శారీరక అందంతో అది సాధ్యం కాదని తెలుసుకోండి. అందంగా వున్నవాళ్ళు అదృష్టవంతులు కారు, అందంగా లేనివాళ్ళు అభాగ్యులు కారు. అందమైన మనసున్న వాళ్ళే అసలైన మనుషులు. అది లేకుండా ఏదో సాధించాలనుకోవడం సరికాదు.
‘అందమె ఆనందం- ఆనందమె జీవిత మకరందం’
english title:
a
Date:
Monday, December 17, 2012