బాలికలు, స్ర్తిలపై నానాటికీ పెచ్చుమీరుతున్న హింసకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న ప్రపంచ వ్యాప్త ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. మహిళల రక్షణకు, వారి హక్కుల కోసం పలు దేశాల్లో నూతన చట్టాలు వచ్చినా, విభిన్న రీతుల్లో ఉద్యమాలు జరుగుతున్నా- హింస కూడా తీవ్రరూపం దాల్చుతోంది. స్ర్తిలపై హింసను వ్యతిరేకిస్తూ ప్రముఖ రంగస్థల నటి, రచయిత్రి ఈవ్ ఎన్‌స్లర్ న్యూయార్క్ నగరంలో 1985 ఫిబ్రవరి 14న ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం ప్రారంభించి 28 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ‘శతకోటి ప్రజాగళం’ వినిపించాలని నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో కనీసం ఒకరు ఎదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటున్న దుస్థితి నెలకొందని, ఈ పరిణామాలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక ‘సామాజిక సునామీ’ రావాల్సి ఉందని ప్రముఖ మహిళా ఉద్యమనేత కమలాభి సేన్ పిలుపునిచ్చారు. ఈ హింసను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంట్లో, సమాజంలో ఎక్కడపడితే అక్కడ మహిళలు వివక్షకు, హింసకు గురవుతున్నందున అభివృద్ధికి అర్థం లేకుండా పోతోందని సామాజిక వేత్తలు విమర్శిస్తున్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా 16 రోజుల పాటు (నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకూ) భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ‘శతకోటి ప్రజాగళం’ సందర్భంగా వచ్చే ఫిబ్రవరి 14న అన్ని దేశాల్లోని మహిళలు ఇళ్లను, కార్యాలయాలను వదిలి ఒక చోట చేరి నిరసన తెలియజేయాలని ఇప్పటికే మహిళా ఉద్యమ సంస్థలు పిలుపునిచ్చాయి.
మన దేశంలో..
ఎనె్నన్నో ఉద్యమాలు జరుగుతున్నా మహిళలపై వివక్ష, లైంగిక దాడులు మన దేశంలో నానాటికీ అధికమవుతున్నట్లు అధికారిక గణాంకాలు ఘోషిస్తున్నాయి. 1953 నుంచి 2011 వరకూ దేశంలో అత్యాచారాల సంఖ్య 873 శాతం మేరకు పెరిగినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘శతకోటి ప్రజాగళం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మధురై నుంచి ఢిల్లీ వరకూ, ముంబై నుంచి భువనేశ్వర్ వరకూ స్ర్తివాద సంస్థలు సమాయత్తమవుతున్నాయి. మహిళలే గాక పిల్లలు, పురుషులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని అంతర్జాతీయ సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 161 దేశాలకు చెందిన సుమారు 5వేల సామాజిక బృందాలు ‘శతకోటి ప్రజాగళా’నికి మద్దతు తెలిపాయి. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా అన్ని దేశాల్లోని ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఒక్కటిగా నిలిచి మహిళలపై హింసను నిరసించాలని మహిళా సంస్థలు కోరుతున్నాయి.
కుటుంబంలో గానీ, ఇంకెక్కడైనా గానీ మహిళలపై హింస జరుగుతోందంటే అందుకు సమాజంలోని పరిస్థితులే కారణమని అఖిల భారత దళిత మహిళా మంచ్ కన్వీనర్ విమల్ ధోరాట్ అంటున్నారు. కొన్ని కులాల్లో కొనసాగుతున్న అనాచారాల వల్ల మహిళలు నేటికీ వివక్షకు గురవుతున్నారని ఆమె విశే్లషిస్తున్నారు. పేదరికం కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చే మహిళలపై అకృత్యాలు అధికమవుతున్నాయని మరికొందరు మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. హింసకు గురైనా ఈ పేద మహిళలు తమ బాధలను చెప్పుకోలేని దుస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. మహిళలపై హింసను అరికట్టాలని వివిధ రూపాల్లో పాలకులపై వత్తిడి తెచ్చేందుకు ‘శతకోటి ప్రజాగళం’ ఓ ఆయుధంగా మారుతుందని స్ర్తివాద సంస్థలు అంచనా వేస్తున్నాయి. నృత్యాలు, నినాదాలు, లఘు చిత్రాలు, సంగీతం, ఇంటర్నెట్‌లో ప్రచారం తదితర రూపాల్లో మహిళల సమస్యల్ని వినిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ‘స్ట్రైక్-డాన్స్-రైజ్’ నినాదంతో ముందుకు సాగాలని మన దేశంలోని వివిధ మహిళా సంస్థలు పిలుపునిచ్చాయి. అన్ని వర్గాల్లో స్నేహభావం వెల్లివిరిస్తే మహిళలపై హింసను నివారించవచ్చని, ఈ దిశగా ‘శతకోటి ప్రజాగళం’ మంచి వేదికగా మారుతుందని స్ర్తి వాద నేతలు ఆశిస్తున్నారు.
విశ్వవ్యాప్తంగా ఉద్యమిస్తున్న నారీలోకం
english title:
a
Date:
Monday, December 17, 2012