హైదరాబాద్, డిసెంబర్ 18: ప్రపంచ వ్యాప్తంగా భావితరాల తెలుగువారు గౌరవించేవిధంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఏర్పాటు చేస్తున్నామని, ఈనెల 24 నాటికి సభాకార్యక్రమాలకు చెందిన పనులు పూర్తవుతాయని సాంస్కృతిక మండలి ప్రతినిధులు స్పష్టం చేశారు. మంగళవారం సాంస్కృతిక భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చైర్మన్ రమణమూర్తి, సలహాదారుడు కెవి రమణాచారి, కార్యదర్శి బలరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 27 నుంచి 29 తేదీ వరకు తిరుపతిలో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలకు సంబంధించిన పనులు కొలిక్కి వచ్చాయన్నారు. ముఖ్యంగా మహాసభల కోసం ఆహ్వానించిన ఆహూతులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తెలుగు మహాసభల్లో ప్రధాన వేదికతోపాటు మరో రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉప వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భాషకు చెందిన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. మహాసభల్లో పాల్గొనడానికి కవులు, కళాకారులు ఉత్సాహం చూపిస్తున్నారని, అయితే సాధ్యమైనంత వరకు అందరికీ అవకాశం కల్పించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మూడు రోజుల కార్యక్రమానికి దాదాపు 4వేల మంది కళాకారులు హాజరవుతారని తెలిపారు.
రాష్ట్ర, దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిష్ణాతులను గౌరవించడం జరుగుతుందన్నారు. అనేక రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపించామన్నారు. ప్రాంతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు ఆహ్వానాలు పంపామన్నారు. సదస్సు మొదటి రోజు ప్రధాన వేదికపై ప్రముఖ గాయనీగాయకులు ఎస్‌పి బాలసుబ్రమణ్యం, సుశీల, జానకీ తదితరులు ప్రపంచ తెలుగు మహాసభలపై జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణరెడ్డి రచించిన గీతాన్ని ఆలపిస్తారని చెప్పారు. ప్రముఖ సంగీత, నృత్య కళాకారులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, రాజరెడ్డి, శోభానాయుడు, ఎల్లా వేంకటేశ్వరరావు, నేరెళ్ళ వేణుమాధవ్ పాల్గొంటారని చెప్పారు. పౌరాణిక నాటకాలతో పాటు జానపద కళాకారులు, పద్య నాటకాలు ప్రదర్శిస్తారని చెప్పారు. కవిత్వాలు, బాల మేధావులు, భగవద్గీత, కవి సమ్మేళనం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. తెలుగు మహాసభలకు హాజరైన అతిథులను ఆకట్టుకునేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తెలుగు మహాసభలు తిలకించడానికి వచ్చే వారికి అవసరమైన రవాణా సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ప్రతి జిల్లా నుంచి తిరుపతికి ప్రత్యేక బస్సులతోపాటు రైళ్లను కూడా నడపడానికి ప్రభుత్వం అనుమతి తీసుకుందన్నారు. మహాసభలను విజయవంతం చేయడానికి ప్రతి కళాకారుడికి రోజు వెయ్యి రూపాయలు పారితోషకం చెల్లిస్తామని, దాదాపు 4వేల మంది కళాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. సభకు నిధుల సమస్య లేదన్నారు. తొలి రోజు భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటారని చెప్పారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సదస్సుకు రానున్నారని చెప్పారు. సాంస్కృతిక రంగానికి చెందిన వారికి పారితోషికం పంపిణీలో గ్రేడింగ్ ఉంటుందన్నారు.
21న తిరుపతిలో సిఎస్ మిన్నీ మాథ్యూ సమీక్ష
english title:
k
Date:
Wednesday, December 19, 2012