Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అమ్మో... అగస్త్య!

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 18: అగస్త్య... ఎప్పటి నుంచో వివాదాల నడుమ కొనసాగుతున్న ప్రభుత్వ హెలికాప్టర్. దీనిని కొనుగోలు చేసినప్పటి నుంచి వివాదాల్లోనే మనుగడ సాగిస్తోంది. ఈ హెలికాప్టర్‌ను వినియోగించాలంటే భయపడే ముఖ్యమంత్రులు తప్పనిసరి సందర్భాల్లో తప్పితే ఇతర సమయాల్లో విమానాలను, రైలు మార్గాలనే ఉపయోగించేవారంటే అగస్త్యపై ఎంతటి భయం ఉందో అర్ధమవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అగస్త్య వెస్ట్‌ల్యాండ్ ఎడబ్ల్యు139 హెలికాప్టర్‌ను 63 కోట్ల రూపాయలకు కొనుగోలుచేశారు. అంతకు ముందు ప్రభుత్వానికి విశేషంగా సేవలు అందించిన బెల్ 430 హెలికాప్టర్ అనునిత్యం మరమ్మతులకు గురవుతుండడంతో అగస్త్యను కొనుగోలు చేయాల్సి వచ్చింది. అయితే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ చిత్తూరు పర్యటనకు వెళ్లడానికి ముందు అగస్త్యను సిద్ధం చేసినప్పటికీ చివరి నిముషంలో సాంకేతిక కారణాలతో బెల్ 430ని ఉపయోగించారు. నల్లమల అటవీ ప్రాంతంలో బెల్ హెలికాప్టర్ కూలిపోవడం, వైఎస్ దుర్మరణం పాలుకావడంతో అగస్త్య నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. అగస్త్యను సరైన సమయంలో సిద్ధం చేయడంలో అధికారుల వైఫల్యం కూడా విమర్శలకు కారణమైంది. ఇలా అప్పట్లో వైఎస్ మృతికి పరోక్షంగా అగస్త్య కారణం కాగా, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ బాట పర్యటనకు మంగళవారం బయలుదేరి వెళ్లాల్సి ఉండగా, సోమవారం రాత్రే అగ్నికి ఆహుతి కావడం మరోసారి వార్తల్లోకెక్కింది. విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి బుధవారం పాడేరు అటవీ ప్రాంతంలో పర్యటించాల్సి ఉండడంతో అగస్త్య హెలికాప్టర్‌ను ఉపయోగించాలని నిర్ణయించారు. దీనికోసం సోమవారం తొలి దశ పరిశీలన పూర్తి చేయగా, మంగళవారం ఉదయం మరోసారి తనిఖీ నిర్వహించి విశాఖకు తరలించేందుకు ప్రయత్నించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే అనుకోని విధంగా అగ్ని ప్రమాదానికి గురికావడంతో ముఖ్యమంత్రి పర్యటనకోసం ప్రత్యామ్నాయంగా ప్రయివేటు విమానాన్ని పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఇలా ఉండగా, అగస్త్య హెలికాప్టర్ నిర్వహణ కూడా ఖజానాకు పెనుభారంగానే మారింది. 63 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఈ హెలికాప్టర్ నిర్వహణ ఖర్చు కూడా అదే మొత్తానికి చేరుకుంది. నెలకు 1.25 కోట్ల రూపాయల చొప్పున ఏటా 15 కోట్ల రూపాయల వరకు అగస్త్య కోసం ఖర్చు చేస్తుండగా, గడచిన నాలుగు సంవత్సరాల్లో దీనికోసం 60 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం అన్ని కోణాల్లో అగస్త్య అనేక ఆరోపణలను మూటగట్టుకుంది.
ముఖ్యమంత్రి పర్యటనలకోసం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల కోసం కొనుగోలు చేసిన అగస్త్య ముఖ్యమంత్రి పర్యటనల కన్నా ఇతర అంశాలకే ఎక్కువగా వినియోగించారు. నక్సలైట్ల గాలింపు చర్యలకు అగస్త్యను వినియోగించిన అధికారులు కర్నూలు తుపాను సమయంలో కూడా అగస్త్య సేవలను వినియోగించారు. మొత్తం మీద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అగస్త్యను 100 గంటల ప్రయాణానికి వినియోగించగా, తరువాత ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య 150 గంటలపాటు ఇదే హెలికాప్టర్‌లో ప్రయాణించారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా దాదాపు వంద గంటలకుపైగా ఈ హెలికాప్టర్‌లో ప్రయాణించారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్దనున్న ఒకేఒక్క హెలికాప్టర్ దగ్ధం కావడంతో కొత్త హెలికాప్టర్ కొనుగోలు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సి ఉందని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కొద్ది నెలల కితం 14 సీట్లతో కూడిన ఆధునిక హెలికాప్టర్‌ను కొనుగోలు చేసేందుకు మంత్రివర్గం ఓకే చేయగా, ఇప్పటికీ దాని ప్రక్రియ కొలిక్కి రాలేదు. దీంతో ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మరింత వేగంగా అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆ అధికారి వెల్లడించారు.

నాడు వైఎస్ పర్యటనకు ఉపయోగపడని వైనం* నేడు కిరణ్ పర్యటనకు వెళ్లడానికి ముందు దగ్ధం
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>