విజయవాడ, డిసెంబర్ 19: ఎపిఎస్ ఆర్టీసీలో కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలు ఈ నెల 22వ తేదీ జరుగబోతున్నాయి. సాధారణ ఎన్నికలను మరిపించేలా రాష్ట్ర వ్యాప్తంగా బస్‌స్టేషన్లు... డిపోల్లో ప్రచారం హోరెత్తుతున్నది. మరో 48 గంటల్లో ఓటింగ్ ప్రారంభం కానుండటంతో సభలు, సమావేశాలు, ర్యాలీలు అన్నింటిమించి విమర్శలు ప్రతివిమర్శలు హోరెత్తుతున్నాయి. ఎన్నికల గుర్తులతో కూడిన బ్యానర్లు, జెండాలు, భారీ హోర్డింగ్‌లతో డిపోలు, గ్యారేజీలు, బస్‌స్టేషన్లు కళకళలాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 22వేల మంది కార్మికులు పాల్గొనే ఈ ఎన్నికల్లో లక్షలాది రూపాయలు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చవుతున్నది. ఈ ఎన్నికల్లో ఎన్‌ఎంయు, సిపిఐ అనుబంధ ఇయు, సిపిఎం అనుబంధ ఎస్‌డబ్ల్యుఎఫ్‌తోపాటు తెలంగాణ మజ్దూరు యూనియన్, టిఎన్‌టియుసి ఇంకా అనేక సంఘాలు బరిలో ఉన్నప్పటికీ ఎన్‌ఎంయు, ఇయుల మధ్య ‘నువ్వా నేనా’ అనే రీతిలో పోటీ సాగుతున్నది. గతంలో ఎన్‌ఎంయు బలంగా ఉండేది. ఈ దఫా ఆ పరిస్థితి కన్పించడంలేదు. పైగా తెలంగాణలో ఎన్‌ఎంయులో చీలిక ఏర్పడింది.
ఇటీవల జరిగిన కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఇయు... తెలంగాణ ఎంయుతో పోటీ చేసి విజయకేతనం ఎగుర వేసింది. దీంతో ఈ దఫా ఈ గుర్తింపు ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. త్వరలో వేతన సవరణ జరుగనున్నందున ఇప్పటి వరకు ప్రతిసారీ ఎన్‌ఎంయు నేతృత్వంలోనే న్యాయం జరిగినందున కార్మికులు తమ సంఘానే్న ఆదరిస్తారని ఆ సంఘ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో జిల్లాల్లో పోలైన ఓట్లలో 50 శాతానికి పైబడి ఓట్లు వచ్చిన సంఘమే గుర్తింపు పొందుతుంది. దీని వల్ల 2010 ఎన్నికల్లో రాష్ట్రంలో 19వేల, 800 ఓట్ల అధిక్యతతో గెలిచిన ఎన్‌ఎంయు రాష్ట్రంలో 18 జిల్లాలో గుర్తింపు పొందింది. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఇప్పటి వరకు తొమ్మిది సార్లు 1982, 88, 91, 96, 98, 2003, 2005, 2008, 2010 ఎన్నికల్లో గెలిచింది. ఎంప్లారుూస్ యూనియన్ కేవలం ఇప్పటి వరకు మూడు సార్లు మాత్రమే గెలిచింది. 1965లో ఇయులో చీలిక ఏర్పడి రామ్మోహన్‌రావు నేతృత్వంలో ఎన్‌ఎంయు ఆవిర్భవించింది. వాస్తవానికి అప్పటి వరకు అంటే 1952 నుంచి ఇయుకు ఎదురేలేకుండాపోయింది. 1965లో గుంటూరులో ఇయు రాష్ట్ర మహాసభ జరిగింది. అప్పటికే హైదరాబాద్ శాఖకు కార్యదర్శిగా ఉన్న రామ్మోహనరావు రాష్ట్ర కార్యదర్శిగా పోటీపడి పలు కారణాల వల్ల ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన ఎన్‌ఎంయును స్థాపించారు. తిరిగి 1993లో ఎన్‌ఎంయులో చీలిక వచ్చి టిఎంఎస్ ఆవిర్భవించినా పెద్ద ప్రభావం కన్పించలేదు. పైగా 2005 ఎన్నికల్లో టిఎంఎస్ విలీనమైంది. దీంతో ఎన్‌ఎంయు మరింతగా బలపడింది. 2005 ఎన్నికల సమయానికి రామ్మోహనరావు మరణించినప్పటికీ కార్మికులు ఎన్‌ఎంయు పక్షానే నిలిచారు. ఈ ఎన్నికల్లో ఇయు, ఎస్‌డబ్ల్యుఎఫ్ కలిసి పోటీ చేసినా ఎన్‌ఎంయు 54వేల 507 ఓట్లతో 5వేల 379 ఓట్ల అధిక్యతతో విజయం సాధించింది. మొత్తం 213 డిపోల్లో 171 డిపోల్లో ఆధిక్యత సాధించడమేగాక మొత్తం 20 రీజియన్లపై పట్టు సాధించింది. 2003 ఎన్నికల్లో ఎన్‌ఎంయు ఒంటరిగా పోటీ చేసి 9వేల 788 ఓట్ల అధిక్యతతో గుర్తింపు సాధించింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 13వేల 129 ఓట్లు సాధించిన ఎస్‌డబ్ల్యుఎఫ్ 2005 ఎన్నికల్లో ఇయుకు మద్దతునిచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. 2008 ఎన్నికల్లో ఎన్‌ఎంయు 12వేల ఓట్ల అధిక్యతతో గుర్తింపు సాధించింది. 2010 సెప్టెంబర్ 9వ తేదీన జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అదే సంఘం 19వేల 800 ఓట్ల అధిక్యతతో గెలిచింది. పైగా అదే సమయంలో 18 జిల్లాలపై ఆధిపత్యం సాధించింది. ఈసారి జరిగే ఎన్నికల్లో కార్మికులు ఎవరి పక్షం వహిస్తారో వేచి చూడాలి.
ప్రచార హోరు
english title:
rtc
Date:
Thursday, December 20, 2012