నెల్లూరు, డిసెంబర్ 19: అధికార భాష తెలుగు అన్నా తెలుగు కవులన్నా పాలకులకు ఎంత శ్రద్ధో. మామూలు రోజుల్లో సరే కనీసం ప్రపంచ తెలుగు మహాసభల సమయంలోనైనా కనీసం వాళ్లను గుర్తుపెట్టుకోవాలన్న ధ్యాసే లేదు. ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 27నుంచి 29వరకు తిరుపతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతుండటం తెలిసిందే. దీనికి ముందు ప్రతి గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు తెలుగు ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా వివిధ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే తెలుగుభాష కోసం ప్రాచీనకాలంలోనే పాటుపడ్డ మహనీయులకు ఇస్తున్న గౌరవం ఏపాటిదనే సందేహాల దొంతర ఏర్పడుతున్న వైనమిది. వ్యాసమహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో తిక్కనకు సాహితీ సామ్రాజ్యంలో ఎంతో ఉన్నత స్థానం. మహాభారతంలోని సింహభాగం తెనింగించిన మహాకవి తిక్కన్న నెల్లూరీయుడే. ఆయన మహాభారతాన్ని రచించినది కూడా నెల్లూరు నగరంలోని పినాకినీ నది ఒడ్డునే. ఆయన మహాభారతం రచించిన మందిరం నేటికీ ఉంది. అయితే ఆ మందిర ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు నిలయమై ఉండటమే బాధాకరమైన పరిణామం. ఈ ప్రాంగణాన్ని అంతా ఓ పార్కుగా తీర్చిదిద్దుతూ గతంలోనే సాహితీ అభిమానులు విశేష కృషి చేశారు. ప్రభుత్వం మాత్రం మహాకవి తిక్కన పార్కు పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. ఆ పార్కు అంతా అనైతిక చేష్టలకు విడిదిగా మారడం హృదయవిదారకం. పెన్నా నది ఒడ్డునే తిక్కన రచనామందిరం ఉన్నా అక్కడ ఉండే పార్కు, అందులో ఉండే మొక్కలకు ఆలనాపాలనా కరవు. దీంతో ఆ ప్రాంగణం అంతా పిచ్చి మొక్కలకు నిలయంగా మారింది. రాత్రివేళల్లో మందుబాబులకు కూడా తిక్కన పార్కు ఉపకరించే ప్రదేశంగా మారుతోంది. ఆ మార్గంలో వెళ్లేవారు ఇదే తిక్కన భారతం రచించిన మందిరం, పార్కు అని దగ్గరకు వెళ్లి నిశితంగా పరిశీలిస్తే జుగుప్సాకరమైన అంశాలు కనిపించి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పోకిరీలు గంజాయి పీల్చుకుంటున్నారు. అక్కడే మద్యం సీసాలు. పార్కును ఏ శాఖ నేతృత్వంలో పర్యవేక్షించాలనేది ఇప్పటికీ స్పష్టత లేదు. ఇరిగేషన్ శాఖాపరమైన వస్తుసామగ్రిని నిల్వ చేసేందుకు దాన్ని వినియోగిస్తున్నారు. గత వైభవ చిహ్నాలను భావితరాలకు చూపాలంటే ఇలాంటి జ్ఞాపకాల్ని పదిలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెల్లూరు పెన్నానది ఒడ్డున ఉన్న తిక్కన మహాభారతాన్ని రచించిన మందిరం, ఆ ప్రదేశంలో ఉన్న పార్కు నిరుపయోగంగా మారడం వాస్తవమేనంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అంగీకరించారు. పెన్నానదిపై నెల్లూరు బ్యారేజి నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. బ్యారేజి పూరె్తైతే తిక్కన పార్కును కూడా అభివృద్ధిపరిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలుగు మహాసభల సాక్షిగా నిరాదరణలో ‘రచనామందిరం’
english title:
t
Date:
Thursday, December 20, 2012