నర్సంపేట, డిసెంబర్ 19: వరంగల్ జిల్లా నర్సంపేటలోని మాధవి నర్సింగ్‌హోంలో బుధవారం అవిభక్త కవలలు (ఆడపిల్లలు) జన్మించారు, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకమేనని వైద్యులు చెబుతున్నారు. నర్సంపేట డివిజన్‌లోని కొత్తగూడ మండలం జంగాలపల్లికి చెందిన బానోతు రజిత ప్రసవ వేదనతో బుధవారం తెల్లవారు జామున నర్సంపేటలోని మాధవి నర్సింగ్‌హోంకు వచ్చింది. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో రజిత అవిభక్త కవలలకు జన్మనిచ్చింది. రజిత నార్మల్ డెలీవరీ అయింది. అయితే జన్మించిన ఇద్దరు ఆడపిల్లలు నడుం అతుక్కుని జన్మించారు. అవిభక్త కవలల బరువు ఐదు కేజీల వరకు ఉంది. రజిత తొలికాన్పులోనూ ఆడపిల్లకు జన్మనిచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత రెండవ కాన్పులో అవిభక్త కవలలు జన్మించారు. జన్యుపరమైన లోపాలతో ఇలా పుట్టారని, అవిభక్త కవలలకు ఒకే యోని, ఒకే మలమూత్ర విసర్జన ఉండడం ఆందోళన కలిగిస్తున్న పరిణామమని గైనకాలిజిస్టులు డాక్టర్ రాజారాం, జగదీశ్వర్, నర్సంపేట ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఉదయ్‌సింగ్ తెలిపారు. ఇదే జిల్లాకు చెందిన అవభక్త కవలలు వీణా వాణిల వార్త అందరికి తెల్సిందే. వీణా వాణిలిద్దరూ తలలు అతుక్కుని జన్మించగా నర్సంపేటలో పుట్టిన అవిభక్త కవలలు నడుం అతుక్కుని జన్మించారు. నర్సంపేటలో జన్మించిన అవిభక్త కవలలను నీలోఫర్ ఆసుపత్రికి తరలించి అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వైద్యం అందించాలని పలువురు వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పట్టణ వాసులు పెద్ద సంఖ్యలో వచ్చి చూస్తున్నారు.
వివేకానందుని
విగ్రహాలు పెట్టాలి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, డిసెంబర్ 19: స్వామి వివేకానందుడి నిలువెత్తు విగ్రహాలను పార్లమెంటు, అసెంబ్లీ ఆవరణల్లో ప్రతిష్ఠించాలని శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. వివేకానందుడి జయంతి ఉత్సవాల్లో భాగంగా కర్నూలులో బుధవారం యువజన సమ్మేళనం నిర్వహించారు. వివేకానంద సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వివేకానందుడి కాంస్య విగ్రహాన్ని పరిపూర్ణానంద ఆవిష్కరించారు. స్వామీజీ మాట్లాడుతూ వివేకానందుడి విగ్రహాలు ప్రతిష్ఠించడం వల్ల భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు సజీవంగా నిలుస్తాయన్నారు. స్వామి విగ్రహాన్ని వీక్షించిన ప్రతి భారతీయుడు అనుక్షణం నూతనోత్తేజం పొందుతాడన్నారు. పాశ్చాత్యులకు భారతీయ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని తెలియజేస్తూ అమెరికాలోని చికాగో నగరంలో ‘సోదర, సోదరీముణులారా’ అంటూ ప్రసంగం ప్రారంభించిన వివేకానందుడి స్ఫూర్తిపై సభికులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేసిన విషయం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.
భద్రాచలంలో ‘ఉపాధి’ సర్వే
భద్రాచలం, డిసెంబర్ 19: ఖమ్మం జిల్లా భద్రాచలం గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతంలో ఐటిడిఎ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద 2,299 హేబిటేషన్లలో నిర్వహించే పనులపై సర్వే బుధవారం ప్రారంభమయింది. 885 హ్యాబిటేషన్లలో సర్వే పనులు చాలా తక్కువగా నిర్వహించినట్లు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి జి వీరపాండియన్ తెలిపారు. జనవరి నుంచి హ్యాబిటేషన్లలో ప్రారంభమయ్యే పనులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నోడల్ అధికారులు గ్రామ పంచాయతీ, మండల సర్వే టీంలతో తరచూ మాట్లాడుతూ వంద శాతం సర్వే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ 80 శాతమే సర్వే పనులు జరిగాయన్నారు. దీనిని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు. అవసరమైతే గ్రామసభలు రోజుకు 4 నుంచి 10 వరకు నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఫార్మేట్లలో సేకరించిన సమాచారాన్ని డేటా ఎంట్రీలు సకాలంలో పూర్తి చేసి ఇవ్వాల్సి ఉందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద హార్టీకల్చర్‌లో 50 శాతం సబ్సిడీతో ఆయిల్‌ఫాం తోటలు పెంచేందుకు గిరిజన రైతులకు అవకాశం ఉందని అన్నారు.