న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో అమలవుతున్న వౌలికరంగ ప్రాజెక్టులకు వ్యయం అంచనాలు మించుతూ ఈ ఏడాది మార్చి నాటికి రూ. 52,150 కోట్లు అధికంగా పెరిగిపోయిందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ఈ ఏడాది మార్చి 31తో అంతమైన 11వ పంచవర్ష ప్రణాళికలో వౌలికరంగ ప్రాజెక్టుల వ్యయం ముందు వేసిన అంచనాలకన్నా రూ. 52, 150.68 కోట్లు అధికంగా పెరిగిందని కేంద్ర గణాంకాల శాఖ సహాయమంత్రి శ్రీకాంత్ కుమార్ జెనా గురువారం ఒక లిఖితపూర్వక సమాధానంలో లోక్‌సభకు తెలియజేశారు.
ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోవడానికి ప్రధానంగా ద్రవ్యోల్బణం, అధిక టెండర్ విలువ, మారకం విలువల్లో హెచ్చుతగ్గులు కారణాలుగా ఆయన పేర్కొన్నారు. 2010 మార్చి వరకు రూ.20 కోట్లు అంతకన్నా ఎక్కువ వ్యయంతో కూడిన కేంద్రీయ రంగంలోని వౌలిక ప్రాజెక్టుల ఆజమాయిషీని తమ శాఖ పర్యవేక్షిస్తూ వచ్చిందని ఆయన చెప్పారు. తమ శాఖ పర్యవేక్షణ లోని ప్రాజెక్టులకు ఇంతవరకున్న ఫైనాన్షియల్ పరిమితిని 2011 ఏప్రిల్ ఒకటి నుంచి రూ.150 కోట్ల స్థాయికి పెంచారని మంత్రి తెలియజేశారు.
.................
ఇంటర్నేషనల్ ట్రావెల్ బీమాలో
ఐసిఐసిఐ లాంబార్డ్ కొత్త ఆవిష్కరణలు
హైదరాబాద్, డిసెంబర్ 20: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బీమా కంపెనీ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రస్తు తం అందిస్తున్న ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు సరికొత్త ఆవిష్కరణలను జోడించినట్లు ప్రకటించింది. ఆ కం పెనీ వైస్ ప్రెసిడెంట్ అమిత్ భండారీ గురువారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కొత్త ఆవిష్కరణల గురించి వివరించారు. గడచిన కొనే్నళ్లగా దేశంలో ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ పెరుగుతోందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము అమలు చేస్తున్న బీమా పథకానికి కొత్త ఆవిష్కరణలు కొన్నింటిని చేర్చినట్లు తెలిపారు. వైద్య పరీక్షలు అవసరం లేకుండా 85 ఏళ్ల వయస్సు వరకు వర్తింపు, ముందుగా ఉన్న వ్యాధులకు, అత్యవసర, జీవితం ప్రమాదంలో పడిన సందర్భాల్లో ఈ బీమా కవరేజ్ వర్తించే విధంగా మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంకా విలువ ఆధారిత సేవలు కొన్నింటిని కూడా జత చేసినట్లు తెలిపారు.
ఈ పాలసీ ద్వారా లభించే ఇతర ప్రయోజనాల్లో పొలిటికల్ రిస్క్, విపత్తు, అత్యవసర ఆర్థిక సహాయం, కారు ణ్య పర్యటన, వ్యక్తిగత ప్రమాద కవరేజ్, ఇంటి బీమా తదితర సౌకర్యాలు ఉంటాయని తెలిపారు.
...................
తెలుగు మహాసభల్లో ఆప్కో దుకాణాలు
హైదరాబాద్, డిసెంబర్ 20: అంతర్జాతీయ తెలుగు మహాసభల సందర్భంగా తిరుపతిలో నాలుగు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అప్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ గౌరీశంకర్ తెలిపారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు జరిగే తెలుగు మహాసభల్లో తెలుగువారి సం స్కృతి, సాంప్రదాయాలను ప్రతిబించేవిధంగా చేనేత వస్త్రాలతో పాటు చేనేత మగ్గాలను అక్కడ ఉంచుతామన్నారు. త్వరలో హైదరాబాద్‌లో నాలుగు షోరూములు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ముఖ్యమైన పట్టణాల్లో కూడా ఏర్పాటు చేయడంపై పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ యేడాది 254 కోట్ల ఆదాయం లభించిందని, అలాగే వచ్చే ఏడాది 300 కోట్లకు పైగా వ్యాపారం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తామన్నారు.
................
ఇనె్వస్టర్ల లాభాల స్వీకరణ
* సెనె్సక్స్ 22 పాయింట్లు డౌన్
ముంబయి, డిసెంబర్ 20: పలు ప్రధాన షేర్లలో ఇనె్వస్టర్లు జరిపిన లాభాల స్వీకరణ వల్ల గురువారం స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఇన్ఫోసిస్, టిసిఎస్, రిలయన్స్, టాటామోటార్స్, బజాజ్ ఆటో వంటి బ్లూచిప్ కంపెనీల షేర్లలో ఇనె్వస్టర్లు అధికస్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్స్‌కు పాల్పడ్డారు. బిఎస్ సెనె్సక్స్ హెచ్చుతగ్గుల మధ్య సాగుతూ ట్రేడింగ్ ముగిసిన సమయానికి 22.08 పాయింట్లు క్షీణించి 19,453.92 వద్ద క్లోజైంది. గత రెండు సెషన్లలో సెనె్సక్స్ 232 పాయింట్లు పెరిగిన విషయం తెలిసిందే. అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 13.20 పాయింట్లు నష్టపోయి 5916.40 వద్ద ముగిసింది. ఇటీవలి మార్కెట్ ర్యాలీలో లాభపడిన షేర్లని ఇనె్వస్టర్లు ప్రాఫిట్ బుకింగ్స్‌కు ఉపయోగించుకున్నారని బ్రోకర్లు పేర్కొన్నారు.
సెనె్సక్స్ గ్రూప్‌లో నేడు 15 కౌంటర్లు నష్టాలతో ముగిసాయి. అలాగే సెక్టరల్ సూచీల్లో కన్సూమర్ డ్యురబుల్ ఇండెక్స్ అత్యధికంగా 0.97% క్షీణించింది. సన్‌ఫార్మా, మహీంద్ర, బజాజ్ ఆటో, విప్రో, ఎల్ అండ్ టి, ఐటిసి కౌంటర్లు ఎక్కువగా నష్టపోయాయి. మరోపక్క హిందాల్కో, జిందాల్ స్టీల్, టాటాస్టీల్ హింద్‌లీవర్, టిసిఎస్, సిప్లా షేర్లు ఆకర్షణీయ లాభాలు నమోదు చేశాయి. మార్కెట్లో మొత్తం టర్నోవర్ బుధవారంతో పోల్చుకుంటే రూ.2518 కోట్ల నుంచి రూ.2437 కోట్లకు తగ్గింది.