తిరుపతి, డిసెంబర్ 20: రెండువేల సంవత్సరాల చరిత్రకల్గిన మధురమైన తెలుగుభాష ఖ్యాతిని, తెలుగు జాతి వైభవాన్ని వ్యాప్తి చేయడంలో విద్యార్థులు, అధ్యాపకులు చేస్తున్న కృషి అభినందనీయమని టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రశంసించారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటేందుకు ప్రపంచ తెలుగుమహాసభలు అద్భుతమైన వేదికలని పలు విద్యాసంస్థల సిఇఓలు, ప్రిన్సిపాల్స్ అన్నారు. ప్రపంచ తెలుగుమహాసభలను పురస్కరించుకుని తిరుపతిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థుల చేత ఒక్కొక్కరోజు ఒక్కో కూడలిలో సాంస్కృతిక ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం పాఠకులకు విదితమే. రెండవ రోజు గురువారం ఎంఆర్‌పల్లి సర్కిల్లో తిరుపతి రూరల్ విద్యాధికారి ఇందిరాదేవి నేతృత్వంలో ఎన్‌ఆర్‌ఐ అకాడమీ, భాష్యం, సికాం, గౌతమ్ టాలెంట్, జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, నోబుల్, కృష్ణారెడ్డి చైతన్య, తేజశ్వనీ, శేషాచల, అక్షర ఇంటర్నేషనల్, శంకర్ వృత్తివిద్యా, వికాస్ విద్యాలయ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, సాంప్రదాయాలతో ముడిపడిన వేషధారణలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ అకాడమీ సిఇఓ శ్రీధర్ మాట్లాడుతూ తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పే మా తెలుగుతల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి సుందరాచార్యులు తిరుపతి వాసి కావడం మనందరికి గర్వకారణమన్నారు. ఎంఆర్‌పల్లి కూడలిలో ప్రారంభమైన ఈ మహాప్రదర్శనలో తెలుగుభాషా ప్రశస్తిని చాటే ప్రదర్శనలు, చిత్రాలు, వేమన పద్యాలు, సుమతి శతకాలు, దేవుళ్లు రూపాలు, పగటివేషగాళ్లు, పులివేషగాళ్లు, గంగిరెద్దులు, డప్పువాయిద్యాలు, తెలుగు ఆచార వ్యవహారాలు, చెక్క్భజనలు, కోలాటాలు, జానపద నృత్యాలతో ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, తుడా ఉపాధ్యక్షుడు పెంచల్‌రెడ్డి తన్మయత్వంచెంది విద్యార్థులతో కలిసి డప్పులువాయించి నృత్యాలు చేశారు. మహాప్రదర్శనకు విచ్చేసిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా విద్యాసంస్థల నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు, ప్రముఖ శత సహస్రావధాని మేడసాని మోహన్, ఉప విద్యాశాఖాధికారి చంద్రయ్య, ఎన్‌ఆర్‌ఐ అకాడమీ అసిస్టెంట్ సిఇఓ వాణి, జోనల్ ఇన్‌చార్జి లీలాకృష్ణ, ఏఓ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
* టిటిడి ఇఓ సుబ్రహ్మణ్యం ప్రశంస * ఎంఆర్‌పల్లి సర్కిల్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ
english title:
t
Date:
Friday, December 21, 2012