బిచ్కుంద, డిసెంబర్ 20: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన 47 మంది అయ్యప్ప దీక్షాపరులతో కూడిన బృందం ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు గురువారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా, బిచ్కుంద మండలం కందర్‌పల్లి సమీపంలోని అకోలా-హైదరాబాద్ రహదారిపై మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో 15 మందికి స్వల్ప గాయాలు కాగా, అయ్యప్ప భక్తులంతా ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. మణికంఠుడి కృప వల్లే తమకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ అయ్యప్ప దీక్షాపరులంతా దర్శనీయ స్థలాలను సందర్శిస్తూ శబరిమలైకు చేరుకోవాలని సంకల్పించారు. షిర్డీ సాయినాథుని దర్శించుకునేందుకు బిచ్కుంద మీదుగా అకోలా మార్గంలో ప్రయాణిస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వెంకటేశ్, శంకరయ్య, సరోజమ్మ, లోకేష్, అంకయ్య గాయపడడంతో వారిని బిచ్కుంద ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స జరిపిన మీదట, బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో పది మందికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికంగానే చికిత్సలు అందించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానిక అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులంతా గురుస్వామి బాల్‌రాజ్ నేతృత్వంలో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బిచ్కుంద సన్నిధానంలో అన్నదానం ఏర్పాటు చేయించారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే సైతం సంఘటనా స్థలాన్ని సందర్శించి, అయ్యప్ప భక్తులను పరామర్శించారు. చిత్తూరులోని వారి కుటుంబ సభ్యులకు స్వయంగా ప్రమాద సమాచారం చేరవేసి, పరిస్థితి అదుపులోనే ఉందని, తాము దగ్గరుండి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. బిచ్కుంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీక్షాపరులను ఆయా పార్టీల నాయకులు దశరథ్ గురుస్వామి, అసద్‌అలీ తదితరులు సైతం పరామర్శించారు. బస్సు బోల్తాపడినప్పటికీ, పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బృందం వెంట బస్సులో ప్రయాణిస్తున్న బాల దీక్షాపరుడు కిటికీ నుండి బయటపడి బిగ్గరగా కేకలు వేయడంతో, ఆ శబ్దాలు విన్న స్థానికులు, అయ్యప్ప సన్నిధానంలో ఉన్న భక్తులు హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టగలిగారు. ఇదంతా ఆ మణికంఠుడి కృప వల్లే జరిగిందని అయ్యప్ప భక్తులు సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
* స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి బయటపడిన దీక్షాపరులు
english title:
a
Date:
Friday, December 21, 2012